Fake News, Telugu
 

ఆర్ధిక ఇబ్బందుల కారణంగా గోరఖ్‌పూర్ లోని గీతా ప్రెస్ మూసివేయబోతున్నట్టు షేర్ చేస్తున్న ఈ సమాచారం తప్పు

0

హిందూ సనాతన ధర్మ పుస్తకాలని లాభం లేకుండా అమ్మే గోరఖ్‌పూర్ లోని గీతా ప్రెస్, ఆర్ధిక ఇబ్బందుల కారణంగా త్వరలో మూసివేయబోతున్నట్టు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. ఈ వార్తని ‘Zee News’ సంస్థ ఇటీవల రిపోర్ట్ చేసినట్టు పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. గీతా ప్రెస్ సంస్థని  మూసివేయడం ద్వార హిందూ సమాజానికి చాలా నష్టం చేకూరుతుందని ఈ పోస్టులో తెలిపారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఆర్ధిక ఇబ్బందుల కారణంగా గోరఖ్‌పూర్ లోని గీతా ప్రెస్ మూసివేయబోతున్నట్టు ‘Zee News’ సంస్థ ఇటీవల రిపోర్ట్ చేసింది.

ఫాక్ట్ (నిజం): గోరఖ్‌పూర్ నగరానికి చెందిన గీతా ప్రెస్ సంస్థ, ఆర్ధిక ఇబ్బందుల కారణంగా త్వరలో మూసివేయబోతున్నట్టు ‘Zee News’ ఛానల్ ఆగష్టు 2015 లో రిపోర్ట్ చేసింది. అయితే, ఈ వార్త తప్పని గీతా ప్రెస్ సంస్థ అప్పుడే స్పష్టం చేసింది. తమ సంస్థ ఎటువంటి ఆర్ధిక ఇబ్బందుల్లో లేదని గీతా ప్రెస్ సంస్థ అధికారులు స్పష్టం చేసారు. సోషల్ మీడియాలో తమ సంస్థ పై నిరంతరంగా షేర్ అవుతున్న ఈ ఫేక్ సమాచారం పై గీతా ప్రెస్ సంస్థ 2020లో కూడా స్పష్టతనిచ్చింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయిమ్ కి సంబంధించిన సమాచారం కోసం గూగుల్ లో వెతికితే, గోరఖ్‌పూర్ నగరానికి చెందిన గీతా ప్రెస్ సంస్థ మూసివేయబోతున్నట్టు ‘Zee News’ ఛానల్ 27 ఆగష్టు 2015 నాడు ఒక వీడియో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. హిందూ ధర్మానికి సంబంధించిన పుస్తకాలను విక్రయించే గీత ప్రెస్ సంస్థ, తమ ఉద్యోగులకి జీతాలివ్వలేని ఆర్ధిక సంక్షోభంలో ఉన్నట్టు ఈ వీడియోలో రిపోర్ట్ చేసారు. ఉద్యోగులు తమ జీతాల కోసం ఉద్యమించడంతో గత్యంతరం లేక తమ సంస్థని మూసివేయాలని గీత ప్రెస్ అధికారులు నిర్ణయించుకున్నట్టు ఈ వీడియోలో తెలిపారు. హిందూ ధర్మ విశిష్టతను ప్రజలకు తెలిపే గీతా ప్రెస్ లాంటి సంస్థని కాడుకోవడం మన భాద్యత అని ‘Zee News’ సంస్థ ఈ వీడియోలో తెలిపారు.

అయితే, తమ సంస్థ పై వస్తున్న ఈ వార్తలు తప్పని గీతా ప్రెస్ సంస్థ 2015లోనే స్పష్టం చేసింది. తమ సంస్థ ఎటువంటి ఆర్ధిక ఇబ్బందుల్లో లేదని, తాము ఎవరి దగ్గరా విరాళాలు సేకరించమని గీతా ప్రెస్ సంస్థ స్పష్టం చేస్తూ 28 ఆగష్టు 2015 నాడు ఒక ట్వీట్ పెట్టింది.  

గీతా ప్రెస్ సంస్థ ఈ విషయం పై ఇచ్చిన స్పష్టతను రిపోర్ట్ చేస్తూ పలు న్యూస్ వెబ్సైట్లు ఆర్టికల్స్ పబ్లిష్ చేసాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. గీతా ప్రెస్ సంస్థ, జీతాల కోసం నిరసన చేసిన తమ ఉద్యోగులతో రాజీకొచ్చినట్టు ఈ ఆర్టికల్స్ రిపోర్ట్ చేసాయి. ‘Zee News’ సంస్థ కూడా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసింది.

‘Zee News’ ఛానల్ 2015లో రిపోర్ట్ చేసిన సమాచారం ఆధారంగా గీతా ప్రెస్ సంస్థ ఆర్ధిక ఇబ్బందుల వలన ముసివేయబోతున్నట్టు సోషల్ మీడియాలో నిరంతరంగా పోస్టులు షేర్ అవుతునే ఉన్నాయి. సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఈ ఫేక్ సమాచారం పై గీతా ప్రెస్ సంస్థ 2020లో కూడా స్పష్టతనిచ్చింది. ఈ వివరాల ఆధారంగా, పోస్టులో షేర్ చేసిన సమాచారం తప్పని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, ఆర్ధిక ఇబ్బందుల కారణంగా గీతా ప్రెస్ సంస్థ మూసివేయబోతున్నట్టు షేర్ చేస్తున్న ఈ సమాచారం తప్పు.

Share.

About Author

Comments are closed.

scroll