ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్ జిల్లాలో మసీదుపై పాకిస్థాన్ జెండా ఎగరేసినందుకు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆ మసీదును కూల్చివేశారు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. రోడ్డు పక్కనే ఉన్న ఒక మసీదుని బుల్‌డోజర్ సహాయంతో కూల్చివేస్తున్న దృశ్యాలని మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఈ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: పాకిస్థాన్ జెండా ఎగరేసినందుకు ప్రయాగ్‌రాజ్ జిల్లాలోని ఒక మసీదుని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూల్చివేస్తున్న దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): ప్రయాగ్‌రాజ్ జిల్లా హాండియా మండలం సైదాబాద్ మార్కెట్ సమీపంలోని షాహీ మసీదుని ఉత్తరప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అధికారులు కూల్చివేస్తున్న దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది. ప్రయాగ్‌రాజ్-హాండియా మధ్య రాష్ట్ర రహదారి విస్తరణ పనులలో భాగంగా ప్రభుత్వ స్థలంలో నిర్మించిన షాహీ మసీదుని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూల్చివేసింది. వీడియోలో మసీదుపై పచ్చ రంగులో కనిపిస్తున్నది ఇస్లాం మత జెండాలు, పాకిస్థాన్ జాతీయ జెండా కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియోకి సంబంధించిన వివరాల కోసం వెతికితే, వీడియోలో కనిపిస్తున్న మసీదు కూల్చివేతకు సంబంధించి ‘Siasat’ వార్తా సంస్థ ఇటీవల ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. రోడ్డు విస్తరణలో భాగంగా ప్రయాగ్‌రాజ్ జిల్లా హాండియా ప్రాంతంలోని 16వ శతాబ్దం కాలం నాటి షాహీ మసీదుని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూల్చివేసినట్టు ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను తెలుపుతూ ‘దైనిక్ భాస్కర్’ వార్తా సంస్థ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ప్రయాగ్‌రాజ్ నుంచి హాండియా మధ్య రహదారి విస్తరణ పనులలో భాగంగా షాహీ మసీదుని ఉత్తరప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అధికారులు 09 జనవరి 2023 నాడు కూల్చివేసినట్టు ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేశారు. షాహీ మసీదు కూల్చివేతకు సంబంధించి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అధికారులు షాహీ మసీదు యాజమాన్యానికి ఇదివరకే నోటీసులు ఇచ్చారని, దీన్ని వ్యతిరేకిస్తూ షాహీ మసీదు యాజమాన్యం హైకోర్ట్, సివిల్ కోర్టు మరియు దిగువ కోర్టులను ఆశ్రయించినట్టు ఈ ఆర్టికల్‌లో తెలిపారు.
షాహీ మసీదు కూచివేతకు వ్యతిరేకంగా ఫైల్ అయిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు 2022 ఆగస్టు నెలలోనే కొట్టిపారేసింది. రాష్ట్ర రహదారి 106ను విస్తరించే క్రమంలో ప్రభుత్వ స్థలం Gata No. 402లో నిర్మించిన షాహీ మసీదును కూల్చివేయడం తప్పనిసరని ఉత్తరప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ హైకోర్టుకి తెలియజేయడంతో, ఈ కేసుకి సంబంధించి తాము ఎటువంటి మాండమస్ ఇచ్చే స్థానంలో లేమని, మసీదు స్థలానికి సంబంధించి పిటిషనర్ సివిల్ కోర్టులో సివిల్ సూట్ ఫైల్ చేసుకోవచ్చని హైకోర్టు తెలిపింది. షాహీ మసీదు కూల్చివేత నిలిపివేయడానికి ఫైల్ చేసిన పేటీషన్‌ను సివిల్ కోర్టు కూడా కొట్టిపారేయడంతో, దిగువ కోర్టును ఆశ్రయించమని, కోర్టు హియరింగ్ అవకముందే అధికారులు షాహీ మసీదును కూల్చివేసినట్టు షాహీ మసీద్ ఇమామ్ ఆరోపిస్తూ మీడియాకి తెలిపారు.
వీడియోలో మసీదుపై పచ్చ రంగులో కనిపిస్తున్నది ఇస్లాం మత జెండాలు, పాకిస్థాన్ జాతీయ జెండా కాదు. అనేక ఇస్లాం మతపరమైన ప్రదేశాలలో ఈ జెండాలను ఎగరవేస్తారు. ఇదివరకు, ఇస్లాం మత జెండాలను పాకిస్థాన్ జాతీయ జెండాగా సోషల్ మీడియాలో తప్పుడు నేపథ్యాలతో షేర్ చేసినప్పుడు, ఫాక్ట్‌లీ వాటికి సంబంధించి ఫాక్ట్-చెక్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది.
చివరగా, ప్రయాగ్‌రాజ్‌లోని షాహీ మసీదుని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రోడ్డు విస్తరణ పనులలో భాగంగా కూల్చివేసింది; అలాగే విడియోలో మసీదుపై పచ్చ రంగులో కనిపిస్తున్నది ఇస్లాం మత జెండాలు, పాకిస్థాన్ జాతీయ జెండా కాదు.