Fact Check, Fake News, Telugu
 

సుప్రీంకోర్టు కేవలం ఐటీ చట్టం, 2000లోని సెక్షన్ 66(A) కింద కేసులు నమోదు చేయొద్దని చెప్పింది, ఇతర చట్టాల కింద కాదు

0

సుప్రీంకోర్టు తీర్పుకి అనుగుణంగా ‘సోషల్ మీడియాలో పోస్టుల పై అరెస్టులు, శిక్షలు ఉండవు. FIR నమోదు చేయకూడదు, ఇప్పటికే నమోదైన కేసులను రద్దు చేయండని’ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చిందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఐతే ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: సోషల్ మీడియాలో పోస్టుల పై అరెస్టులు, శిక్షలు ఉండవు. FIR నమోదు చేయకూడదు, ఇప్పటికే నమోదైన కేసులను రద్దు చేయాలి – సుప్రీంకోర్టు.

ఫాక్ట్(నిజం): సుప్రీంకోర్టు 2015లోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆక్ట్, 2000 లోని సెక్షన్ 66 (A)ని రాజ్యాంగ విరుద్ధం అని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఇక ముందు పోలీసులు సెక్షన్ 66(A) కింద కేసులు నమోదు చేయకుండా, ఇప్పటికే ఈ సెక్షన్ కింద నమోదైన కేసులను వెనక్కి తెసుకోవాలని ఆదేశించాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక అడ్వైసరీ జారీ చేసింది. ఐతే ఇండియన్ పీనల్ కోడ్ (IPC), ఇతర కొన్ని చట్టాల కింద సోషల్ మీడియాలో గాని లేదా ఇతర మాధ్యమాలలో మనం చేసే పోస్టులకు సంబంధించి కేసులు నమోదు చేసే అవకాశం ఇంకా ఉంది. ఉదాహారణకి విపత్తు నిర్వహణ చట్టం, 2005 లోని సెక్షన్ 54, ఇండియన్ పీనల్ కోడ్, 1860 లోని సెక్షన్ 505 (1), 153 (A), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆక్ట్, 2000 లోని పలు ఇతర సెక్షన్స్ కింద సోషల్ మీడియాలో మనం పోస్టు చేసే పోస్టులకు సంబంధించి కేసులు నమోదు చేసే అవకాశం ఇంకా ఉంది.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఇ-కామర్స్‌ కి చట్ట బద్దత కల్పిస్తూ, తద్వారా జరిగే వ్యాపార లావాదేవీలను నియంత్రించడం, సైబర్ నేరాలను శిక్షించడం, మొదలైన అంశాలకు సంబంధించి భారత ప్రభుత్వం మొదటి సారిగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆక్ట్, 2000 ద్వారా దేశ మొదటి సైబర్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టానికి 2008లో సవరణ చేస్తూ సెక్షన్ 66 (A)ని చేర్చారు.

ఈ సెక్షన్ కింద కంప్యూటర్‌ లేదా ఏ ఇతర సమాచార పరికరాన్నైనా ఉపయోగించి

  • ఇతరులకు హానికర, అభ్యంతరకర సమాచారాన్ని చేరవేసినా
  • ఒక సమాచారం తప్పు అని తెలిసి కూడా కోపం/ అసౌకర్యం/ ప్రమాదం/ ద్వేష భావం/ శతృత్వం/ దురుద్దేశం/ నేరపూరిత ఉద్దేశంతో ఇతరులకు పంపించినా.
  • ఇతరులకు అసౌకర్యం కలిగించేలా, లేదా తప్పుదారి పట్టించేలా ఏదైనా మెయిల్‌ను చేసినా

మూడేళ్ల వరకు జైలుశిక్ష, జరిమానా విధించవచ్చు.

ఐతే ఈ సెక్షన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) (ఎ) భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకుంటుందని, ఈ సెక్షన్ రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ 2012లో సుప్రీంకోర్టులో శ్రేయ సింఘాల్ అనే న్యాయ విద్యార్థిని ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలుచేసింది. ఈ PILపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు 2015లో ఈ సెక్షన్ 66(A)ని రద్దు చేసింది.

సుప్రీంకోర్టు ఈ సెక్షన్ ని రద్దు చేసిన తర్వాత కూడా ఇదే సెక్షన్ కింద పలు సందర్భాల్లో కొందరిని అరెస్ట్ చేసిన ఘటనలు జరిగాయి. ఐతే ఇదే విషయమై ఇటీవల పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (PUCL) అనే NGO సుప్రీంకోర్టులో ఒక వ్యాజ్యం దాఖలు చేయగా, సుప్రీంకోర్టు రద్దు చేయబడిన సెక్షన్ కింద ఇంకా కేసులు నమోదు చేయడంపై తీవ్రంగా స్పందించి కేంద్ర ప్రభుత్వాన్ని ఈ విషయంపై కౌంటర్ దాఖలు చేయాలని కోరింది. ఈ నేపధ్యంలోనే ఇక ముందు పోలీసులు సెక్షన్ 66(A) కింద కేసులు నమోదు చేయకుండా, ఇప్పటికే ఈ సెక్షన్ కింద నమోదైన కేసులను వెనక్కి తెసుకోవాలని ఆదేశించాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 14 జూలై 2021న అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రెటరీలకు ఒక అడ్వైసరీ జారీ చేసింది.

ఐతే సుప్రీంకోర్టు గాని, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అడ్వైసరీ గాని కేవలం సెక్షన్ 66(A) గురించి మాత్రమే ప్రస్తావించాయి. కాని దీనిని కొందరు తప్పుగా అర్ధం చేసుకొని ఇకపై సోషల్ మీడియాలో పోస్టులపై అరెస్టులు,శిక్షలు ఉండవు, FIR నమోదు చేయకూడదు, ఇప్పటికే నమోదైన కేసులు రద్దు చేస్తారంటూ షేర్ చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆక్ట్, 2000 లోని సెక్షన్ 66(A)ని కొట్టేసినప్పటికీ, ఇండియన్ పీనల్ కోడ్ (IPC), ఇతర కొన్ని  ఇతర చట్టాలలో సోషల్ మీడియాలో గాని లేదా ఇతర మాధ్యమాలలో మనం చేసే పోస్టులకు సంబంధించి కేసులు నమోదు చేసే అవకాశం ఇంకా ఉంది. ఇలాంటి కొన్ని సెక్షన్స్ కింద చూడొచ్చు.

విపత్తు నిర్వహణ చట్టం, 2005 లోని సెక్షన్ 54:  ఏదైనా విపత్తుల సమయంలో ఆ విపత్తు తీవ్రత గురించి ప్రజలను భయందోలనకు గురిచేసే విధంగా తప్పుడు హెచ్చరికలను లేదా సమాచారాన్ని ప్రసారం చేస్తే  ఈ సెక్షన్ కింద శిక్షార్హులు.

కరోనాని జాతీయ విపత్తుగా గుర్తించిన నేపథ్యంలో కరోనాకి సంబంధించి ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న కొందరిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేసిన ఉదాహరణ చూడొచ్చు. అంతేకాకుండా, కోవిడ్-19 లాంటి వ్యాధుల గురించి సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం షేర్ చేస్తే అంటువ్యాధుల నివారణ చట్టం,1897 కింద కూడా కేసు నమోదు చెయ్యొచ్చు.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆక్ట్, 2000 లోని పలు ఇతర సెక్షన్స్:

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆక్ట్, 2000 లోని సెక్షన్ 67 మరియు సబ్ సెక్షన్ల కింద ఎవరైనా సోషల్ మీడియాలో అసభ్యకరమైన అశ్లీల ఫోటోలు పోస్ట్ చేస్తే వారు శిక్షార్హులు. ఇటీవల కాలంలో ఈ సెక్షన్ 67 కింద నమోదవుతున్న కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తా కథనాన్ని కూడా ప్రచురించింది.

అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆక్ట్, 2000 లోని సెక్షన్ 66D కింద ఎవరైతే కంప్యూటర్ లేదా ఏదైనా కమ్యూనికేషన్ డివైస్ ద్వారా ఇతరులను మోసం చేస్తే వారు శిక్షార్హులు.

ఇండియన్ పీనల్ కోడ్, 1860 లోని సెక్షన్ 505 (1):

ప్రజలను భయందోనలకు గురిచేసే విధంగా ఏదైనా ప్రకటన / పుకారు / వార్తను ప్రచురించిన లేదా ప్రచారం చేసినా ఈ సెక్షన్ కింద శిక్షార్హులు.

ఇండియన్ పీనల్ కోడ్, 1860 లోని ఇతర సెక్షన్లు:

2020లో ఢిల్లీ అల్లర్ల పై మరియు ప్రధాని మోదీని విమర్శిస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసినందుకు అస్సాం లో ఒక వ్యక్తిని ఐపీసీ సెక్షన్ 295(ఏ), 153(ఏ), 507 మరియు ఐటీ చట్టంలోని సెక్షన్ 66 (తొలగించిన సెక్షన్ 66(A) కాదు) కింద కేసు బుక్ చేసినట్టు అరెస్ట్ చేసినట్టు ఇండియా టుడే ఒక కథనంలో పేర్కొంది.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని అవమానిస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టినందుకు ఒక వ్యక్తిపై దేశద్రోహం (సెడిషన్ – ఐపీసీ 124(ఏ)) మరియు ఇతర ఐపీసీ సెక్షన్ల కింద కేసుపెట్టినట్టు ఇక్కడ చదవొచ్చు.

ఇటీవల సాకేత్ గోఖలే అనే ముంబైకి చెందిన ఒక సామాజిక కార్యకర్త భారత దౌత్యవేత్త లక్ష్మి పూరిపై అభియోగాలు చేస్తూ ట్విట్టర్ లో ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్స్ పై విచారణ జరిపిన ఢిల్లీ హై కోర్టు సాక్షాదారాలు అభియోగాలకు వ్యతిరేకంగా ఉండడంతో సాకేత్ గోఖలేని వెంటనే లక్ష్మి పూరిపై చేసిన ట్వీట్స్ ని తొలగించాలని ఆదేశించింది.

ఈ ఉదాహరణల బట్టి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆక్ట్, 2000 లోని సెక్షన్ 66(A)ని తొలగించినప్పటికీ, ఇతర చట్టాల కింద సోషల్ మీడియాలో చేసే పోస్టులపై కేసులు నమోదు చేసే అవకాశం ఇంకా ఉంది అని, విచారణ జరిపి శిక్షించవచ్చని తెలుస్తుంది.

చివరగా, సుప్రీంకోర్టు కేవలం ఐటీ చట్టం, 2000 లోని సెక్షన్ 66(A) కింద కేసులు నమోదు చేయొద్దని చెప్పింది, ఇతర చట్టాల కింద కాదు.

Share.

About Author

Comments are closed.

scroll