బంగ్లాదేశ్‌లో భారీ స్థాయిలో ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడి హిందువులపై దాడులు జరిగినట్టు పలు రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. ఐతే ఈ క్రమంలోనే బంగ్లాదేశ్‌లో హిందువులను చంపుతున్నారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ ఉంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ ఆందోళనల్లో హిందువులను చంపిన వీడియో.
ఫాక్ట్(నిజం): జులై 2024లో బంగ్లాదేశ్‌లోని బోగ్రాలో జరిగిన రథయాత్ర సందర్బంలో విద్యుదాఘాతం జరగడంతో ఐదుగురు భక్తులు మరణించారు. ఈ దృశ్యాలు ఆ ఘటనకు సంబంధించినవే. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో జరుగుతున్న అల్లర్లకు ఈ వీడియోతో ఎలాంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొన్ని రోజులుగా హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి. పలు రిపోర్ట్స్ ప్రకారం, ప్రస్తుతం జరుగుతున్న అల్లర్లలో కొన్ని చోట్ల నిరసనకారులు మైనారిటీలు, ముఖ్యంగా హిందువుల ఇళ్లు, వ్యాపారాలపై దాడి చేసి వారి విలువైన వస్తువులను దోచుకున్నారని తెలుస్తుంది. అలాగే హిందువుల ఇళ్లను, దేవాలయాలను ధ్వంసం చేయడం, తగులబెట్టడం, మహిళలపై దాడి చేయడం వంటి సంఘటనలు జరుగుతున్నట్లు మరికొన్ని రిపోర్ట్స్ పేర్కొన్నాయి (ఇక్కడ & ఇక్కడ).
ఐతే సోషల్ మీడియాలో ఇప్పుడు షేర్ అవుతున్న ఈ వీడియోకు ప్రస్తుతం జరుగుతున్న బాంగ్లాదేశ్ ఆందోళనలకు ఎటువంటి సంబంధం లేదు. ఈ వీడియో స్క్రీన్ షాట్స్‌ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇవే దృశ్యాలను జులై 2024లో రిపోర్ట్ చేసిన పలు బంగ్లాదేశీ వార్తా కథనాలు మాకు కనిపించాయి. ఈ కథనాల ప్రకారం బంగ్లాదేశ్‌లోని బోగ్రాలో జరిగిన రథయాత్ర సందర్బంలో విద్యుదాఘాతం సంభవించడంతో ఐదుగురు మరణించగా, సుమారు 50 మంది గాయపడ్డారు. ప్రస్తుతం షేర్ అవుతున్న దృశ్యాలు ఈ ఘటనకు సంబంధించినవే.
ఇవే దృశ్యాలను రిపోర్ట్ చేసిన మరికొన్ని వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఈ కథనాలు కూడా ఈ దృశ్యాలు విద్యుదాఘాతం సంఘటనకు సంబంధించినవని దృవీకరిస్తున్నాయి. చనిపోయిన వారు హిందువులే అయినప్పటికీ ఈ ఘటనకు ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితులకు ఎలాంటి సంబంధం లేదని ఈ కథనాల ద్వారా స్పష్టమవుతుంది.
చివరగా, రథయాత్ర సందర్బంలో జరిగిన విద్యుదాఘాతం ఘటనకు సంబంధించిన దృశ్యాలను బంగ్లాదేశ్‌లో హిందువులను చంపేస్తున్నారంటూ షేర్ చేస్తున్నారు.