Fake News, Telugu
 

ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ జడ్జి కాదు, తెలంగాణ లోని జయశంకర్ భుపాలపల్లి జిల్లా కలెక్టర్ అబ్దుల్ అజీం

0

రెండు సంవత్సరాలుగా పెన్షన్ కోసం తిప్పలుపడుతున్న అవ్వ కోసం దిగివచ్చిన ఆంధ్రప్రదేశ్ జిల్లా జడ్జి, అంటూ షేర్ చేస్తున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్.జగన్ ప్రవేశపెట్టిన గ్రామ వాలంటీర్ పథకం యొక్క ఫలితాలు ఇవి, అంటూ ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

   ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పెన్షన్ కోసం తిప్పలుపడుతున్న అవ్వ కోసం దిగివచ్చిన ఆంధ్రప్రదేశ్ జిల్లా జడ్జి ఫోటో.

ఫాక్ట్ (నిజం): ఫోటోలో ముసలావిడతో పాటు మెట్లపై కూర్చున్నది తెలంగాణ రాష్ట్ర జయశంకర్ భుపాలపల్లి జిల్లా కలెక్టర్ అబ్దుల్ అజీం. పెన్షన్ డబ్బులు అందడం లేదని ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఆ ముసలావిడ బాధ తెలుసుకోవడం కోసం కలెక్టర్ అబ్దుల్ ఆజీం, ఇలా ఆమెతో పాటు కింద మెట్ల పై కూర్చున్నారు. ఈ ఫోటో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అదే ఫోటోని షేర్ చేస్తూ ‘The Hans India’ వారు ‘27 Feb 2020’ నాడు పబ్లిష్ చేసిన ఒక ఆర్టికల్ దొరికింది. ఫోటోలో ముసలావిడతో పాటు కూర్చొని ఉన్న వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భుపాలపల్లి జిల్లా కలెక్టర్ అబ్దుల్ అజీం అని ఆ ఆర్టికల్ లో తెలిపారు. చాలా సమయం నుంచి కలెక్టర్ ఆఫీస్ ముందున్న మెట్ల పై కూర్చున్న ముసలావిడను గమనించిన కలెక్టర్ అబ్దుల్ అజీం, ఆ ముసలావిడ ఫిర్యాదు తెలుసుకొనేందుకు ఆవిడతో పాటు మెట్ల పై కూర్చున్నట్టు ఆర్టికల్ లో తెలిపారు. తనకు రావలిసిన పెన్షన్ డబ్బులు అందటం లేదు అని ఆమె ఫిర్యాదు చేయడంతో, వెంటనే కలెక్టర్ అబ్దుల్ అజీం అధికారులతో మాట్లాడి మంగమ్మ కు రావలిసిన పెన్షన్ డబ్బులు వచ్చేలా చర్యలు తీసుకున్నట్టు అందులో తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలుపుతూ ‘TV9 తెలుగు’ న్యూస్ వెబ్సైట్ వారు రాసిన ఆర్టికల్ ని ఇక్కడ చూడవచ్చు. ఇదే ఫోటోని మనం జయశంకర్ భుపాలపల్లి జిల్లా అధికారిక వెబ్సైటులో చూడవచ్చు. అలాగే, కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం(IAS) ప్రొఫైల్ ను ఈ వెబ్సైటులో చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా ఫోటోలోని ఆ ఘటన తెలంగాణలోని జయశంకర్ భుపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుందని, ఫోటోలో ముసలావిడతో పాటు కూర్చున్న వ్యక్తి జిల్లా జడ్జి కాదు, జిల్లా కలెక్టర్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఇదే ఫోటోని చూపిస్తూ, భువనపల్లి జిల్లా జడ్జి ఫిర్యాదు చేయడం కోసం వచ్చిన ముసలావిడతో పాటు కింద కూర్చున్నట్టు షేర్ చేసినప్పుడు, ‘FACTLY’ దానికి సంబంధించి రాసిన ఆర్టికల్ ని ఇక్కడ చూడవచ్చు.

చివరగా, ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ జడ్జి కాదు, తెలంగాణ లోని జయశంకర్ భుపాలపల్లి జిల్లా కలెక్టర్ అబ్దుల్ అజీం.

Share.

About Author

Comments are closed.

scroll