Fake News, Telugu
 

బ్రిటీష్ వారిని క్షమాభిక్ష కోరుతూ పిటిషన్లు రాసింది కేవలం సావర్కర్ మాత్రమే కాదు. ఇంకా పలువురు కూడా ఇలా పిటిషన్లు రాసారు

0

కాలాపాని జైల్లో 80,000 మంది ఖైదీలు ఉంటే అందులో ఒక్క సావర్కర్ మాత్రమే బ్రిటిష్ వారికి క్షమాభిక్ష కోసం పిటిషన్ రాసాడు అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: అండమాన్ కాలాపాని జైల్లో 80,000 మంది ఖైదీలు ఉంటే అందులో ఒక్క సావర్కర్ మాత్రమే బ్రిటిష్ వారికి క్షమాభిక్ష కోసం పిటిషన్ రాసాడు.

ఫాక్ట్(నిజం):  స్వాతంత్రోద్యమంలో బ్రిటీష్ వారిని క్షమాభిక్ష కోరుతూ పలువురు పిటిషన్లు రాసారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అండమాన్ జైలు నుండి సచింద్రనాథ్ సన్యాల్ కూడా ఇలా ఒక పిటిషన్ రాసాడు. ఈ విషయం తన ఆత్మకథలో తనే స్వయంగా తెలిపాడు. కాబట్టి కేవలం సావర్కర్ ఒక్కడే ఇలా క్షమాభిక్ష పిటిషన్లు రాసాడన్నదాంట్లో నిజం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించేదిగా ఉంది.

సావర్కర్ కాలాపాని (అండమాన్) జైల్లో నుండి బ్రిటీష్ వారికీ క్షమాభిక్ష కోరుతూ పలు సార్లు పిటిషన్లు రాసిన మాట నిజమే అయినప్పటికి ఇలా రాసింది కేవలం సావర్కర్ ఒక్కడు మాత్రమే కాదు. స్వాతంత్రోద్యమం సమయంలో సావర్కర్‌తో పాటు ఇంకా పలువురు కూడా ఇలా పిటిషన్లు రాసినట్టు ఆధారాలు ఉన్నాయి.

సచింద్రనాథ్ సన్యాల్ కూడా క్షమాభిక్ష పిటిషన్ రాసాడు:

సచింద్రనాథ్ సన్యాల్ తన ఆత్మకథలో(బందీ జీవన్‌) తాను కూడా ఇలా క్షమాభిక్ష పిటిషన్ రాసినట్టు పేర్కొన్నాడు. “నేను దాదాపు అదే పిటిషన్‌ను వ్రాసినప్పటికీ నన్ను విడుదల చేసారు గాని, వినాయక్ దామోదర్ సావర్కర్‌ను ఎందుకు విడుదల చేయలేదు” అని సన్యాల్ తన ఆత్మకథలో అండమాన్ జైలు జీవితం గురించి రాసిన ఒక సందర్భంలో ఇలా అన్నాడు.

అండమాన్ జైలు నుండి విడుదల అయిన తరవాత కూడా బ్రిటీష్ ప్రభుత్వం సన్యాల్‌ను పలు కేసులకు సంబంధించి అరెస్ట్ చేసింది. ఆ సమయంలో కూడా సన్యాల్, తనను విడుదల చేయాలని కోరుతూ బ్రిటీష్ వారికి క్షమాభిక్ష పిటిషన్ రాసాడు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియాకి చెందిన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

పలువురు చరిత్రకారులు కూడా సావర్కర్‌తో పాటు ఇంకా పలువురు కూడా ఇలా పిటిషన్లు రాసినట్టు తమ రచనల్లో పేర్కొన్నారు. బరింద్ర ఘోష్, కంజీలాల్, మొదలైన వారు కూడా అండమాన్ జైలు నుండి బ్రిటీష్ వారిని క్షమాభిక్ష కోరుతూ పిటిషన్ రాసినట్టు వారు పేర్కొన్నారు (ఇక్కడ మరియు ఇక్కడ).

ఇంకా కొంత మంది కూడా ఇలా పిటిషన్లు రాసారు:

R.I.A.S.Cకి చెందిన సిపాయి బాగ్ అలీ ఖాన్ కూడా తనను అండమాన్ జైలు నుండి విడుదల చేయాలని కోరుతూ బ్రిటీష్ వారికి పిటిషన్ రాయగా, వారు దీనిని తిరస్కరించినట్టు   నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా డాకుమెంట్స్‌లో స్పష్టంగా ఉంది.

సుశీల్ కుమార్ బద్ర అనే ఫార్వర్డ్ బ్లాక్‌కి చెందిన మరొక నాయకుడు కూడా తను విడిచి పెట్టాలని బ్రిటీష్ వారిని కోరుతూ రాసిన  పిటిషన్ ఇక్కడ చూడొచ్చు. ఈ ఉదాహరణల బట్టి బ్రిటీష్ వారిని క్షమాభిక్ష కోరుతూ పిటిషన్లు రాసింది కేవలం సావర్కర్ మాత్రమే కాదన్న విషయం స్పష్టమవుతుంది.

చివరగా, బ్రిటీష్ వారిని క్షమాభిక్ష కోరుతూ పిటిషన్లు రాసింది కేవలం సావర్కర్ మాత్రమే కాదు. ఇంకా పలువురు కూడా ఇలా పిటిషన్లు రాసారు.

Share.

About Author

Comments are closed.

scroll