Fake News, Telugu
 

హిందూ దేవాలయాలను ప్రభుత్వ ఆధీనంలో నుండి విడిపించేందుకు సత్యపాల్ సింగ్ 2019లోనే ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టారు

0

హిందూ దేవాలయాలను ప్రభుత్వ ఆధీనం నుండి విడిపించేందుకు బీజేపీ ఎంపీ సత్యపాల్ సింగ్ ఇటీవల పార్లమెంట్ లో ఒక ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టినట్టు చెప్తున్న  పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఆ వార్తకి సంబంధించి  నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: హిందూ దేవాలయాలను ప్రభుత్వ ఆధీనం నుండి విడిపించేందుకు బీజేపీ ఎంపీ సత్యపాల్ సింగ్ ఇటీవల పార్లమెంట్ లో ఒక ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టారు.

ఫాక్ట్ (నిజం): హిందూ దేవాలయాలను ప్రభుత్వ ఆధీనం నుండి విడిపించేందుకు సంబంధించి బీజేపీ ఎంపీ సత్యపాల్ సింగ్ ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టింది 2019లో, ఈ మధ్య కాలంలో కాదు. ఈ బిల్లు ఇంకా పెండింగ్ లోనే ఉంది. పైగా ప్రైవేటు బిల్లు కావడంతో, ఇది పాస్ అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువ. 1970 తర్వాత ఏ ఒక్క ప్రైవేట్ మెంబెర్ బిల్ పార్లమెంట్ ఆమోదం పొందలేదు.  అలాగే ఈ విషయానికి సంబంధించి బీజేపీ ప్రభుత్వం బిల్లు లేదా అర్దినన్స్ గాని తీసుకరానున్నట్టు ఎటువంటి సమాచారం లేదు.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఇలాంటి బిల్లు ఏది ప్రవేశపెట్టలేదు. పైగా హిందూ దేవాలయాలను ప్రభుత్వ ఆధీనం నుండి విడిపించేందుకు బీజేపీ ప్రభుత్వం బిల్లు లేదా అర్దినన్స్ గాని తీసుకరానున్నట్టు ఎటువంటి సమాచారమైతే లేదు. పోస్టులో చెప్తున్న బీజేపీ ఎంపీ సత్యపాల్ సింగ్ హిందూ దేవాలయాలను ప్రభుత్వ ఆధీనం నుండి విడిపించేందుకు సంబంధించి ఒక ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టింది 2019లో, ఈ మధ్య కాలంలో కాదు. ఐతే 2019లో సత్యపాల్ సింగ్ ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఇంకా పెండింగ్ లోనే ఉంది. సాధారణంగా ప్రైవేటు బిల్లులకు ప్రభుత్వ మద్దతు ఉండదు కాబట్టి పాస్ కావడం అనేది చాలా అరుదు.

నిజానికి సత్యపాల్ సింగ్ ఈ బిల్లుని 2016లోనే ప్రవేశపెట్టగా, 2019లో పార్లమెంట్ రద్దు కావడంతో ఆ బిల్లు లాప్స్ అయ్యింది, కాబట్టి తిరిగి కొత్తగా 2019లో మళ్ళీ ప్రవేశపెట్టారు.

ప్రైవేట్ మెంబర్ బిల్లు:

మంత్రి కాని ఇతర ఎంపీలను ప్రైవేట్ మెంబర్ అని అంటారు. ఈ ప్రైవేట్ సభ్యులు ప్రవేశపెట్టిన బిల్లులను ప్రైవేట్ మెంబర్ బిల్లులని, మంత్రులు ప్రవేశపెట్టిన వాటిని ప్రభుత్వ బిల్లులు అని అంటారు. సాధారణంగా చట్టపరమైన జోక్యం అవసరమైన పలు అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేందుకు ఎంపీలు ఇలా ప్రైవేటు బిల్లులను ప్రవేశ పెడుతుంటారు. ప్రతీ శుక్రవారం పార్లమెంట్ సమావేశాల్లోని రెండో భాగంలో మాత్రమే ఈ ప్రైవేటు బిల్లులకు సంబంధించిన వ్యవహారాలను చూస్తుంటారు.

సాధారణంగా మంత్రులు ప్రవేశపెట్టే బిల్లులకు ప్రభుత్వ మద్దతు ఉంటుంది, కానీ ఈ ప్రైవేటు బిల్లులకు ప్రభుత్వ మద్దతు ఉండదు. అందుకని ఈ బిల్లులు పాస్ అవడం చాలా అరుదు. అసలు ప్రైవేటు బిల్లులపై చర్చ జరిగే సందర్భాలు కూడా చాలా తక్కువ. ఈ వార్తా కథనం ప్రకారం 1952లో మొదటి లోక్ సభ ఏర్పడ్డప్పటి నుండి ఇప్పటి వరకు కేవలం 14 ప్రైవేట్ మెంబర్ బిల్లులు మాత్రమే చట్టాలుగా మారాయి. చివరిసారిగా ఒక ప్రైవేటు బిల్లు చట్టంగా మారింది 1970లో.

చివరగా, హిందూ దేవాలయాలను ప్రభుత్వ ఆధీనంలో నుండి విడిపించేందుకు సత్యపాల్ సింగ్ 2019లోనే ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టారు, పైగా ఈ బిల్లు ఇంకా పెండింగ్ లోనే ఉంది.

Share.

About Author

Comments are closed.

scroll