Fake News, Telugu
 

ఉజ్జెయిన్‌ ప్రభుత్వ అధికారులు మహాకాల్ మార్గ్‌లో కూల్చి వేసిన అక్రమ కట్టడాలు పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసిన వారివని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

మధ్యప్రదేశ్ ఉజ్జెయిన్‌ నగరంలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేసిన దేశద్రోహుల ఇళ్ళని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం కూల్చి వేస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఉజ్జెయిన్‌ నగరంలో ఇటీవల మొహరం పండగ సందర్భంగా జరిగిన ఊరేగింపులో కొందరు పాకిస్తాన్ అనుకూల నినాదాల చేసారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో, ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: మధ్యప్రదేశ్ ఉజ్జెయిన్‌ నగరంలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేసిన దేశద్రోహుల ఇళ్ళని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం కూల్చి వేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): ఉజ్జెయిన్‌ నగరంలోని మహాకాల్ మార్గ్‌లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించుకున్న ఇళ్ళని ఇటీవల ఉజ్జెయిన్‌ జిల్లా అధికారులు కూల్చి వేసారు. పోస్టులో షేర్ చేసిన వీడియో ఈ ఘటనకి సంబంధించిన దృశ్యాలని చూపిస్తుంది. ప్రభుత్వ భూమిలో నిర్మించుకున్న ఈ అక్రమ ఇళ్ళని కుల్చివేయాలని సుప్రీం కోర్టు 2020 సెప్టెంబర్ నెలలోనే ఆదేశాలు జారీ చేసింది. ఈ వీడియోకి ఇటీవల మొహరం ఊరేగింపు కార్యక్రమంలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసారని చెప్తున్న వ్యక్తులతో ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.  

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోలని కొన్ని లోకల్ న్యూస్ సంస్థలు తమ యూట్యూబ్ ఛానెల్స్‌లో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఆ వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఉజ్జెయిన్‌ నగరంలోని మహాకాలేశ్వర్ దేవాలయం సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించుకున్న ఇళ్ళని ఉజ్జెయిన్‌ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చి వేస్తున్న దృశ్యాలని ఈ వీడియోలలో రిపోర్ట్ చేసారు. పోస్టులో షేర్ చేసిన వీడియోలో ‘Hotel President’ పేరుతో ఉన్న భవనం కనిపిస్తుండటాన్ని మనం గమనించవచ్చు.  ఈ ప్రెసిడెంట్  హోటల్ ఉజ్జెయిన్‌ నగరంలోని న్యూ హరిఫాతక్ ఓవర్ బ్రిడ్జి సమీపంలో ఉన్నట్టు తెలిసింది. ఉజ్జెయిన్‌ నగరంలోని ప్రెసిడెంట్ హోటల్ దృశ్యాలు పోస్టులో షేర్ చేసిన వీడియోలోని దృశ్యాలతో పోలి ఉండటాన్ని బట్టి, ఈ వీడియో  ఉజ్జెయిన్‌ నగరానికి సంబంధించింది అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఉజ్జెయిన్‌ నగరంలో జరిగిన ఈ అక్రమ కట్టడాల కూల్చివేతకు సంబంధించిన వివరాల కోసం వెతకగా, ‘ZEE News’ సంస్థ ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుపుతూ 27 ఆగష్టు 2021 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఉజ్జెయిన్‌ మహాకాల్ మార్గ్‌లో అక్రమంగా నిర్మించిన 200 షాపులని హై కోర్టు ఆదేశాల మేరకు ఉజ్జెయిన్‌ ప్రభుత్వ అధికారులు కుల్చివేసినట్టు ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు. స్మార్ట్ సిటీ కార్యక్రమంలో భాగంగా ఉజ్జెయిన్‌ నగరంలోని మహాకాలేశ్వర్ మందిరాన్ని పదింతలు విస్తరింపచేయాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళిక చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగానే మహాకాలేశ్వర్ మందిర సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి కట్టుకున్న ఇళ్లని ఉజ్జెయిన్‌ జిల్లా అధికారులు కుల్చివేసినట్టు ఈ ఆర్టికల్‌లో తెలిపారు.

మహాకాలేశ్వర్ దేవాలయం సమీపంలో నిర్మించిన అక్రమ కట్టడాలని కుల్చివేయాలని సుప్రీం కోర్టు 2020 సెప్టెంబర్ నెలలోనే ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను పాటిస్తూ ఉజ్జెయిన్‌ జిల్లా అధికారులు 2021 మర్చి నెలలో మహాంకాల్ మార్గ్‌లో అక్రమంగా ఇళ్లు కట్టుకొని నివసిస్తున్న వారిని ఖాళీ చేయాలనీ ఆదేశించారు. 2021 జూలై నెలలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకి ఇచ్చిన నివేదికలో, మహాకాలేశ్వర్ దేవాలయం సమీపంలోని 500 మీటర్ల దూరంలో నిర్మించిన 144 అక్రమ కట్టడాలని ఉజ్జెయిన్‌ జిల్లా అధికారులు కుల్చివేసినట్టు రిపోర్ట్ చేసింది.  

19 ఆగష్టు 2021 నాడు మొహరం సందర్భంగా ఉజ్జెయిన్‌ నగరంలోని గీతా కాలోనిలో జరిగిన ఊరేగింపులో కొందరు పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఉజ్జెయిన్‌ పోలీస్ అధికారులు పది మందిని అదుపులోకి తీసుకొని, నలుగురిని జాతీయ భద్రతా చట్టం (NSA) కింద అరెస్ట్ చేసారు. అదుపులోకి తీసుకున్న ఈ పది మంది మహాంకాల్ మార్గ్‌లో నివసించేవారని ఎక్కడా కూడా రిపోర్ట్ అవలేదు. ఈ వివరాల ఆధారంగా వీడియోలో కూల్చి వేస్తున్న ఇళ్లు ఇటీవల ఉజ్జెయిన్‌ నగరంలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసిన వ్యక్తులకు సంబంధించినవి కావని చెప్పవచ్చు.

చివరగా,ఉజ్జెయిన్‌ నగరంలో అక్రమ కట్టడాలని ప్రభుత్వం కూల్చి వేస్తున్న దృశ్యాలని పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసిన వారి ఇళ్లని మధ్య ప్రదేశ్ ప్రభుత్వం కూల్చి వేస్తున్న దృశ్యాలంటున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll