Fake News, Telugu
 

శబరిమల ప్రసాదం తయారీ టెండర్ అల్ జహా స్వీట్స్ అనబడే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంపెనీకి ఇవ్వలేదు

0

శబరిమల ప్రసాదం టెండర్ ఒక ముస్లింకు ఇచ్చిన కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వం అని అంటూ ఒక ఫోటోతో ఉన్న పోస్టును సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ అరవన పాయసం ఇక హలాల్ సర్టిఫైడ్ అని పోస్ట్ ద్వారా అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: శబరిమల ప్రసాదం తయారీ టెండర్ ఒక ముస్లింకు ఇచ్చిన కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వం.

ఫాక్ట్ (నిజం): శబరిమల ప్రసాదం తయారీ టెండర్ అల్ జహా స్వీట్స్ అనబడే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంపెనీకి ఇవ్వలేదు. ప్రస్తుతం ఉన్న అరవన ప్రసాదం కంటైనర్‌కు, కంపెనీ యొక్క ప్యాకేజింగ్‌కు చాలా తేడా ఉంది. ‘న్యూస్ చెకర్’ ఫాక్ట్-చెకింగ్ సంస్థ అల్ జాహా కంపెనీని, ట్రావెన్ కోర్ దేవసోమ్ బోర్డు వారిని సంప్రదించినప్పుడు, ఈ క్లెయిమ్ తప్పని తెలిపారు. కొన్ని చోట్ల అరవన పాయసం అనే పేరుతో కంపెనీలు స్వీట్‌లను అమ్ముతున్నారు. దుబాయ్‌లో ఆన్‌లైన్‌లో కూడా దీన్ని విక్రయిస్తున్నారు. ట్రావెన్ కోర్ దేవసోమ్ బోర్డు వారు అరవన ప్రసాదానికి సంబంధించి పేటెంట్ కోసం అప్లై చేస్తున్నారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఫోటోలో ఉన్న కంపెనీ పేరు ‘Al Zahaa Sweets LLC’ (అల్ జహా స్వీట్స్ ఎల్.ఎల్.సి) గూగుల్లో వెతకగా, ఒక వెబ్సైటులో ఆ కంపెనీ యొక్క సమాచారం లభించింది. అల్ జహా స్వీట్స్ ఎల్.ఎల్.సి అనే ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అజ్మాన్ కేంద్రంగా 2020లో స్థాపించబడింది. ఈ సంస్థ ఫుడ్ ప్రొడక్ట్స్ సెక్టార్‌లో పనిచేస్తుందని వెబ్సైటులో తెలిపారు.

ఫోటోను జాగ్రత్తగా గమనించినట్లైతే, దానిపై అరవన పాయసం అని ఉంది, అరవన ప్రసాదం అని కాదు. అసలైన అరవన ప్రసాదంతో గనక ఈ ఫోటోను పోల్చినప్పుడు, ‘Travancore Devaswom Board’ (ట్రావెన్ కోర్ దేవసోమ్ బోర్డు) అని గాని ‘Saranam Ayyappa’ (శరణం అయ్యప్ప) అని గానీ లేదు.

సైలెంట్ స్ప్రింగ్స్ అనబడే యూట్యూబ్‌ ఛానల్ అప్లోడ్ చేసిన మలయాళీ వీడియోలో అల్ జాహా తయారు చేసిన అదే అరవన పాయసంను తింటున్నట్టు చూడొచ్చు. ఆ యొక్క పాయసం విదేశీ కేరళీలీయులకు విక్రయించడానికి ఉద్దేశించబడిందని వీడియోలో తెలిపారు.

2007లో ట్రావెన్ కోర్ దేవసోమ్ బోర్డు వారు శబరిమలలో అరవన పాయసంను తయారు చేయడానికి, సప్లై చేయడానికి, ఒక ముస్లిం యొక్క కంపెనీ అయిన ఎలీట్ ఇండియాను షార్ట్ లిస్టు చేసారు. ముగ్గురు బిడ్డర్స్ వీరికంటే తక్కువ బిడ్ చేసినాగాని ఆ నాలుగొవ కంపెనీనే షార్ట్ లిస్టు చేసి హై కోర్ట్ పర్మిషన్ కోసం అడిగారని టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్‌లో ఉంది. అప్పట్లో దీనిని హిందూ సంస్థలు వ్యతిరేకించినట్టు ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది.

అరవన ప్రసాదంను బియ్యం, బెల్లం, నెయ్యి, యాలకులతో తయారు చేస్తారు. ఆలయం యొక్క 60% రెవిన్యూ ఈ ప్రసాదం ద్వారానే వస్తుంది.

కేరళలోని చాలా దేవాలయాలలో తయారు చేయబడే ప్రత్యేకరకం ‘పాయసం’ అరవన పాయసం. అయితే, శబరిమల ‘అరవన పాయసం’ అత్యంత ప్రజాదరణ పొందింది. శబరిమల ‘అరవన’ ఇతర దేవాలయాల మాదిరిగానే దాదాపు అదే పదార్థాలను ఉపయోగిస్తున్నప్పటికీ, భిన్నంగా తయారు చేయబడుతుంది, అందువల్ల ఒక ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది.

విల్మార్ ఇంటర్నేషనల్ (సింగపూర్ సంస్థ) తన ఆహార అనుబంధ సంస్థ కువోక్ ఆయిల్స్ అండ్ గ్రెయిన్స్ ట్రేడింగ్ లిమిటెడ్ యొక్క ట్రేడ్ మార్క్ గా ‘అరవన’ పేరును పొందాలనుకుంది. ట్రేడ్ మార్క్ అప్లికేషన్ కోల్‌కతాలోని ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రీలో 2018లో దాఖలు చేసారు.

కొన్ని చోట్ల అరవన పాయసం అనే పేరుతో కంపెనీలు స్వీట్‌లను అమ్ముతున్నారు. దుబాయ్‌లో ఆన్‌లైన్‌లో కూడా దీన్ని విక్రయిస్తున్నారు.

సోషల్ మీడియాలో అరవన ప్రసాదం పేరిట పాయసం అమ్ముతున్నారని వీడియోలు బాగా షేర్ అవ్వటంతో, GI ట్యాగ్ కోసం అప్లికేషన్ వేసారని ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. ట్రావెన్ కోర్ దేవసోమ్ బోర్డు వారు అరవన ప్రసాదానికి సంబంధించి పేటెంట్ కోసం అప్లై చేస్తున్నారు.

న్యూస్ చెకర్ వారు ఇదే క్లెయిమ్‌కు సంబంధించి ఫాక్ట్ చెక్ ఆర్టికల్ రాసారు; అందులో, వారు అల్ జాహా కంపెనీని, ట్రావెన్ కోర్ దేవసోమ్ బోర్డు వారిని సంప్రదించినప్పుడు, ఈ క్లెయిమ్ తప్పని తెలిపారు.

చివరగా, శబరిమల ప్రసాదం తయారీ యొక్క టెండర్ అల్ జహా స్వీట్స్ అనబడే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంపెనీకి ఇవ్వలేదు.

Share.

About Author

Comments are closed.

scroll