Fake News, Telugu
 

ఇటీవల విడుదలైన ఉప ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఈ వివరాలు తప్పు

0

ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన 29 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు విడుదలైనాయి. ‘ఐతే ఉపఎన్నిక జరిగిన అసెంబ్లీ స్థానాలలో 6 NDA సిట్టింగ్ స్థానాలు కాగా, ఈ ఎన్నికల్లో NDA 15 (+9) స్థానాలు గెలుచుకుందని. అదేవిధంగా UPA 11 సిట్టింగ్ స్థానాల నుండి 8 (-3)కి పడిపోయిందని’ చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఇటీవల ఉపఎన్నిక జరిగిన అసెంబ్లీ స్థానాలలో 6 NDA సిట్టింగ్ స్థానాలు కాగా, ఇప్పుడు NDA 15 (+9) స్థానాలు గెలుచుకుంది; అదేవిధంగా UPA 11 సిట్టింగ్ స్థానాల నుండి 8 (-3)కి పడిపోయింది.

ఫాక్ట్ (నిజం): దేశవ్యాప్తంగా ఉపఎన్నిక జరిగిన 29 అసెంబ్లీ స్థానాలలో NDAవి 12 సిట్టింగ్ స్థానాలు కాగా, విడుదలైన ఫలితాలలో NDA మొత్తం 15 స్థానాలలో విజయం సాధించింది. గతంతో పోల్చుకుంటే తమ సీట్ల సంఖ్యలో అధనంగా మూడు సీట్లు పెంచుకుంది. అలాగే 29 అసెంబ్లీ స్థానాలలో UPAవి 9  సిట్టింగ్ సీట్లు కాగా, విడుదలైన ఫలితాలలో UPA కేవలం 8 స్థానాలలోనే గెలుపొందింది, గతంతో పోల్చుకుంటే తమ సీట్ల సంఖ్యలో ఒక సీటు తగ్గింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఇటీవలి ఉపఎన్నిక జరిగిన 29 అసెంబ్లీ స్థానాల, 3 లోక్‌సభ స్థానాల ఫలితాలు విడుదలైయ్యాయి. నాగాలాండ్‌లోని ఒక్క అసెంబ్లీ స్థానం పోటీ లేకుండా భర్తీ చేయబడింది. ఫలితాలు విడుదలైన ఈ స్థానాలలో UPA, NDA గెలిచిన సీట్ల వివరాలు కింద చూడొచ్చు.

అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో NDA ఫలితాలు:

ఈ 29 అసెంబ్లీ స్థానాలలో 12 NDA (BJP+ మిత్రపక్షాలు) సిట్టింగ్ స్థానాలు కాగా, విడుదలైన ఫలితాల ప్రకారం NDA 15 స్థానాలలో విజయం సాధించింది. గతంతో పోల్చుకుంటే తమ సీట్ల సంఖ్యలో అధనంగా మూడు సీట్లు పెంచుకుంది. ఈశాన్య రాష్ట్రాలలో జరిగిన అన్ని స్థానాలను బిజెపి మరియు వాటి మిత్రపక్షాలే గెలుచుకున్నాయి.

అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లోUPA ఫలితాలు:

ఉపఎన్నిక జరిగిన29 అసెంబ్లీ స్థానాలలో 9 UPA సిట్టింగ్ సీట్లు. విడుదలైన ఫలితాల ప్రకారం 29 అసెంబ్లీ స్థానాలలో UPA కేవలం 8 స్థానాలలోనే గెలుపొందింది, అంటే UPA సీట్ల సంఖ్య 9 నుండి 8 (-1)కి పడిపోయింది. NDA మరియు UPA గెలిచినవి తీసేస్తే మిగిలనవి ఆయా ప్రాంతాల్లోని ప్రాంతీయ పార్టీలు గెలుచుకున్నాయి.

లోక్‌సభ స్థానాల ఉప ఎన్నికల్లో NDA ఫలితాలు:

దేశవ్యాప్తంగా మండి (హిమాచల్ ప్రదేశ్), ఖండ్వ (మధ్యప్రదేశ్), దాద్రా అండ్ నగర్ హవేలీ, 3 లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి, ఇందులో 2 NDA సిట్టింగ్ స్థానాలు. ఐతే 3 స్థానాలకు విడుదలైన ఫలితాలలో NDA కేవలం ఒక్క దాంట్లోనే విజయం సాధించింది. అంటే NDA సీట్ల సంఖ్య 2 నుండి 1కి పడిపోయింది.

లోక్‌సభ స్థానాల ఉప ఎన్నికల్లో UPA ఫలితాలు:

ఉపఎన్నిక జరిగిన 3 లోక్‌సభ స్థానాలలో UPAకి ఇంతకు ముందు ఒక్క స్థానంలో కూడా ప్రాతినిధ్యం లేదు. కాని ఉపఎన్నిక ఫలితాలలో UPA రెండింటిలో విజయం సాధించింది. మండి స్థానాన్ని కాంగ్రెస్, దాద్రా అండ్ నగర్ హవేలీ స్థానాన్ని శివసేన గెలుచుకున్నాయి. అంటే UPA సీట్ల సంఖ్య 0 నుండి 2కి పెరిగింది.

చివరగా, ఇటీవల విడుదలైన ఉప ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఈ వివరాలు తప్పు.

Share.

About Author

Comments are closed.

scroll