కోవిడ్-19 వ్యాధికి వాక్సిన్ కనుగొన్న మొట్టమొదటి దేశంగా రష్యా నిలిచిందని చెప్తూ ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కోవిడ్-19 వ్యాధికి వాక్సిన్ కనుగొన్న రష్యా.
ఫాక్ట్ (నిజం): కోవిడ్-19 వ్యాధికి ఇంకా ఎవరూ వాక్సిన్ కనుగొనలేదు. రష్యా కి చెందిన గమలేయ ఇన్స్టిట్యూట్ వారి వాక్సిన్ యొక్క క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి, పోస్ట్ లో చెప్పినట్టు అన్నీ దశల క్లినికల్ ట్రయల్స్ ఇంకా పూర్తి కాలేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
రష్యా వాక్సిన్ గురించి ఇంటర్నెట్ లో వెతకగా, పోస్ట్ లో ఇచ్చిన ‘Financial Express’ వార్త తప్పు అని తెలుస్తుంది. ‘Financial Express’ వారు ప్రచురించిన ఇంకొ ఆర్టికల్ లో రష్యా కి చెందిన సెచెనోవ్ యూనివర్సిటీ లో గమలేయ ఇన్స్టిట్యూట్ వారి వాక్సిన్ యొక్క మొదటి ఫేస్ క్లినికల్ ట్రయల్స్ మాత్రమే పూర్తయ్యాయని రాసి ఉన్నట్టు ఇక్కడ చదవొచ్చు.
సెచెనోవ్ యూనివర్సిటీ వెబ్సైటులో కూడా క్లినికల్ ట్రయల్స్ మొత్తం అయిపోయినట్టు రాసి లేదు. ఎన్నో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయో రాసి లేకున్నా, తదుపరి దశల క్లినికల్ ట్రైల్స్ ఎలా నిర్వహించాలో గమలేయ ఇన్స్టిట్యూట్ నిర్ణయం తీసుకుంటుందని 13 జూలై 2020 న తమ వెబ్సైటులో ప్రచురించిన ఆర్టికల్ లో సెచెనోవ్ యూనివర్సిటీ వారు తెలిపారు.
15 జూలై 2020 న కోవిడ్-19 వాక్సిన్లకి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు రిలీజ్ చేసిన డాక్యుమెంట్ లో కూడా గమలేయ ఇన్స్టిట్యూట్ కి సంబంధించిన వాక్సిన్లు మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నట్టు చదవొచ్చు. వేరే సంస్థల కొన్ని వాక్సిన్లు మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నట్టు కూడా ఆ డాక్యుమెంట్ లో చదవొచ్చు.
అమెరికా ప్రభుత్వం వారి క్లినికల్ ట్రయల్స్ వెబ్సైటులో గమలేయ ఇన్స్టిట్యూట్ వారి వాక్సిన్లు సంబంధించి ఉన్న సమాచారాన్ని ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. అదే సమాచారాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి క్లినికల్ ట్రయల్స్ వెబ్సైటులో కూడా ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.
సాధారణంగా క్లినికల ట్రయల్స్ నాలుగు దశలు ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్సైటులో చదవొచ్చు.
చివరగా, కోవిడ్-19 వ్యాధికి వాక్సిన్ ను ఇప్పటివరకైతే రష్యా కనుగొనలేదు. క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి.