ఐఐటీ మణిపూర్ విద్యార్థి అయిన రీతురాజ్ చౌదరి గూగుల్‌ను 53 సెకన్ల పాటు హ్యాక్ చేసాడు అని సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ చేస్తున్నారు. రీతురాజ్ తమ వెబ్సైటును హ్యాక్ చేసి రిపోర్ట్ చేసినందుకుగాను అతనికి గూగుల్ సంస్థ 3.66 కోట్ల రూపాయల జీతంతో ఉద్యోగం కూడా ఇచ్చింది అని ఈ పోస్టులో ఉంది. దీని వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ పోస్టు ద్వారా తెలుసుకుందాం.
క్లెయిమ్: ఐఐటీ మణిపూర్ విద్యార్థి అయిన రీతురాజ్ చౌదరి గూగుల్‌ను 53 సెకన్ల పాటు హ్యాక్ చేసి వారికి రిపోర్టు చేసాడు. ఇందుకుగాను ఆ సంస్థ తనకు 3.66 కోట్ల రూపాయల జీతంతో ఉద్యోగం ఇచ్చింది.
ఫ్యాక్ట్ (నిజం): రీతురాజ్ చౌదరి గూగుల్‌ను హ్యాక్ చేయలేదు. అతను కేవలం ఒక బగ్‌ని రిపోర్టు చేసాడు. అలాగే, తనకు గూగుల్ నుంచి ఎలాంటి జాబ్ ఆఫర్ రాలేదని తన లింక్డ్ఇన్ అకౌంట్ ద్వారా స్పష్టం చేశాడు. ఫిబ్రవరి 2022లో మొదటిసారి ఈ వార్త వైరల్ అయింది. ఆ సమయంలోనే రీతురాజ్ ఇది ‘ఫేక్ న్యూస్’ అని చెప్పాడు. కావున పోస్ట్‌లో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
రీతురాజ్ చౌదరి గురించి ఇంటర్నెట్‌లో వెతికితే, సెర్చ్ రిసల్ట్స్‌లో 2022నాటి చాలా వార్తా కథనాలు కనిపించాయి. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ వారి కథనంలో, రీతురాజ్ చౌదరి IIIT మణిపూర్‌లో (‘IIT మణిపూర్’ కాదు) రెండవ సంవత్సరం విద్యార్థి అని, Googleలో ఒక Potential బగ్‌ను కనుగొన్నాడని చదవవచ్చు (పోస్ట్‌లో చెప్తున్నట్లు 53 సెకన్ల పాటు Googleని హ్యాక్ చేయలేదు). ‘జీ’కి తను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు, అందులో కూడా తాను గూగుల్‌ని హ్యాక్ చేసినట్లు ఎక్కడా చెప్పలేదు, కేవలం బగ్‌ను గూగుల్‌కు రిపోర్టు చేసినట్లు చెప్పాడు. అతని పేరు Google యొక్క బగ్ హంటర్స్ జాబితాలో ఇక్కడ చూడవచ్చు.
వైరల్ పోస్టులో ఉన్నటువంటి క్లెయిమ్ తో 2022లో కూడా ఇటువంటి వార్త సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు, లింక్డ్‌ఇన్‌లో అలాంటి ఒక పోస్ట్ కింద కామెంట్ చేస్తూ, రీతురాజ్ దానిని ‘ఫేక్ న్యూస్’ అని పేర్కొన్నాడు. అతను తన లింక్డ్‌ఇన్ ఖాతాలో– “నాకు Google నుండి ఎటువంటి ప్యాకేజీ లేదా జాబ్ ఆఫర్ రాలేదు, లేదా (నా ద్వారా) ఏది హ్యాక్ చేయబడలేదు, ఒక బగ్‌ని నేను రిపోర్ట్ చేశాను అంతే, మరియు ప్రస్తుతం నేను 2వ సంవత్సరం Btech విద్యార్థిని కాబట్టి… ఆ వార్తలు ఫేక్…”, అని తెలిపాడు. ఈ విషయంపై రితురాజ్ యొక్క పోస్ట్‌లు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
చివరిగా, రీతురాజ్ చౌదరి గూగుల్‌ను హ్యాక్ చేయలేదు, తను కేవలం ఒక బగ్‌ని గూగుల్‌కు రిపోర్ట్ చేసాడు.