Fake News, Telugu
 

గాంధీనగర్ రైల్వే స్టేషన్‌లోని దృశ్యాలని అయోధ్య రైల్వే స్టేషన్‌లోని దృశ్యాలుగా షేర్ చేస్తున్నారు

0

అయోధ్యలో నిర్మించిన కొత్త రైల్వే స్టేషన్‌లోని దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: అయోధ్యలో నిర్మించిన కొత్త రైల్వే స్టేషన్‌లోని దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో నిర్మించిన కొత్త రైల్వే స్టేషన్‌కి సంబంధించినవి. 2020లో అయోధ్య రైల్వే స్టేషన్ ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం 104.77 కోట్ల రూపాయిలని కేటాయించింది. కానీ, అయోధ్య రైల్వే స్టేషన్ పునరుద్దీకరణ పనులు ఇంకా పూర్తి కాలేదు. పోస్టులో షేర్ చేసిన వీడియో అయోధ్య రైల్వే స్టేషన్‌కి సంబంధించింది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని కొందరు తమ యూట్యూబ్ ఛానెల్స్ లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఆ వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వీడియోలో కనిపిస్తున్నవి గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో ఆధునీకరించిన కొత్త రైల్వే స్టేషన్‌లోని దృశ్యాలని ఈ పోస్టులలో తెలిపారు. ఒక యూట్యూబ్ యూసర్ పోస్ట్ చేసిన స్పష్టమైన వీడియోలో, రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం బోర్డులపై  హిందీ, ఇంగ్లీష్ మరియు గుజరాతీ భాషలో రాసి ఉన్న అక్షరాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు, వీడియోలో కనిపిస్తున్న రైల్వే స్టేషన్ గోడలపై గుజరాత్ టూరిజం లోగో మరియ గుజరాత్ రాష్ట్రంలోని కొన్ని పర్యాటక ప్రాంతాల బొమ్మలని చిత్రీకరించినట్టు స్పష్టంగా తెలుస్తుంది.

ఆధునికరించబడిన గాంధీనగర్‌ రైల్వే స్టేషన్‌ ఫోటోలని ‘Central Railway’ తమ ట్విట్టర్ హేండిల్ లో పబ్లిష్ చేసింది. పోస్టులో షేర్ చేసిన వీడియోలోని అవే దృశ్యాలు ఈ ఫోటోలలో కనిపిస్తుండటం మనం గమనించవచ్చు. ‘One India Hindi’ న్యూస్ ఛానల్ గాంధీనగర్‌ రైల్వే స్టేషన్‌కి సంబంధించి పబ్లిష్ చేసిన వీడియోలో కూడా ఈ దృశ్యాలని చూడవచ్చు.

గాంధీనగర్‌ కొత్త రైల్వే స్టేషన్‌కు సంబంధించి గూగుల్ మ్యాప్స్‌లో పోస్ట్ చేసిన ఫోటోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. గాంధీనగర్‌ రైల్వే స్టేషన్‌కు సంబంధించి ‘The Tribune’ పబ్లిష్ చేసిన ఆర్టికల్‌లో కూడా ఇవే దృశ్యాలు కలిగిన ఫోటోని షేర్ చేసారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో గాంధీనగర్‌ రైల్వే స్టేషన్‌కి సంబంధించిందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

2020లో అయోధ్య రైల్వే స్టేషన్‌ ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం 104.77 కోట్ల రూపాయిల నిధులని కేటాయించింది. అయోధ్య పట్టణ అభివృద్ధి పనులపై ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో సమీక్ష జరిపిన ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ సాంప్రదాయాలు, సంస్కృతి ప్రతిబింబించేలా అయోధ్య నగరం ఉండాలని అధికారులని ఆదేశించారు. అయోధ్య రైల్వే స్టేషన్‌ ఆధునీకరణ పనులు ఇంకా పూర్తి అవలేదు.

చివరగా, గాంధీనగర్ రైల్వే స్టేషన్‌లోని దృశ్యాలని అయోధ్య రైల్వే స్టేషన్‌లోని దృశ్యాలుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll