ఆంధ్రప్రదేశ్ లోని వై. యస్. జగన్ ప్రభుత్వం టీ, బిస్కెట్ల కోసం ఏడాదికి ఎనిమిది (8) కోట్లు ఖర్చు చేస్తున్నట్టు సోషల్ మీడియాలో ఒక ఆర్టికల్ స్క్రీన్ షాట్ షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: వై. యస్. జగన్ ప్రభుత్వం టీ, బిస్కెట్ల కోసం ఏడాదికి ఎనిమిది (8) కోట్లు ఖర్చు చేస్తున్నట్టుగా షేర్ అవుతున్న ఫోటో.
ఫాక్ట్ (నిజం): టీ, బిస్కెట్ల కోసం ఏడాదికి 8 కోట్లు ఖర్చు చేసినట్టుగా చెప్తున్నది తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లోని వై. యస్. జగన్ ప్రభుత్వం కాదు. సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ప్రోటోకాల్ శాఖలో నిధుల దుర్వినియోగం జరుగుతుందని తెలంగాణ గవర్నర్ కి ఇటీవల పంపిన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రోటోకాల్ శాఖ, టీ, బిస్కెట్ల కోసం ఎనిమిది కోట్లు ఖర్చు చేసినట్టుగా 2021-22 బడ్జెట్ లెక్కలలో చూపెట్టినట్టు పద్మనాభ రెడ్డి తన లేఖలో ఆరోపించారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో చేస్తున్న క్లెయిమ్ కు సంబంధించిన వివరాల కోసం ‘టీ, బిస్కెట్ల కోసం 8 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం’ అనే కీ పదాలు ఉపయోగించి గూగుల్ లో వెతికితే, ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ ‘ఈనాడు’ వార్త సంస్థ 04 జూలై 2021 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. టీ, బిస్కెట్ల కోసం ఏడాదికి 8 కోట్లు ఖర్చు చేసినట్టుగా చెప్తున్నది తెలంగాణ ప్రభుత్వం అని ఈ ఆర్టికల్ లో స్పష్టంగా తెలిపారు. సుపరిపాలన వేదిక (FGG) కార్యదర్శి పద్మనాభ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ప్రోటోకాల్ శాఖలో జరిగిన నిధుల దుర్వినియోగం పై ఇటీవల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కి పంపిన లేఖలో పేర్కొన్నట్టు ఈ ఆర్టికల్ లో తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వ ప్రోటోకాల్ శాఖ, టీ మరియు బిస్కెట్ల కోసం ఎనిమిది కోట్లు (అంటే, రోజుకి 2 లక్షలు) ఖర్చు చేసినట్టుగా 2021-22 బడ్జెట్ లెక్కలలో చూపించినట్టు పద్మనాభ రెడ్డి తన లేఖలో ఆరోపించారు. అంతేకాదు, 2021-22 రాష్ట్ర బడ్జెట్ లో కార్ల అద్దె కోసం ప్రభుత్వం 8.9 కోట్లు కేటాయించారని FGG ఆరోపించింది. ఈ రెండు ప్రభుత్వ చర్యల పై విజిలెన్సు లేదా ఏసిబి తో విచారణ జరిపించేలా ఆదేశాలివ్వాలని పద్మనాభ రెడ్డి గవర్నర్ ని కోరినట్టు తెలిసింది. ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ ‘The Hans India’ న్యూస్ సంస్థ పబ్లిష్ చేసిన ఆర్టికల్ ని ఇక్కడ చూడవచ్చు.
ఈ లేఖ పై మరింత స్పష్టత కొరకు FGGని సంప్రదించగా, తెలంగాణ ప్రభుత్వ ప్రోటోకాల్ శాఖలో జరుగుతున్న నిధుల దుర్వినియోగానికి సంబంధించి FGG కార్యదర్శి పద్మనాభ రెడ్డి తెలంగాణ గవర్నర్ కి లేఖ రాసినట్టు వారు స్పష్టం చేసారు. ఈ లేఖకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నుండి ఎటువంటి సమాధానం రాలేదని వారు FACTLY కి తెలిపారు. అలాగే, వై. యస్. జగన్ ప్రభుత్వం పై ఇటువంటి లేఖ ఏదైనా రాశారా అని అడగగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై ఇటీవల ఇటువంటి లేఖాలేవి రాయలేదని వారు స్పష్టం చేసారు. FGG కార్యదర్శి తెలంగాణ ప్రభుత్వ ప్రోటోకాల్ శాఖ పై చేసిన ఆరోపణలని, వై. యస్. జగన్ ప్రభుత్వం పై చేసినట్టుగా ‘నమస్తే ఆంధ్ర’ న్యూస్ సంస్థ 05 జూలై 2021 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసింది. పోస్టులో షేర్ చేసిన ఫోటో ‘నమస్తే ఆంధ్ర’ పబ్లిష్ చేసిన ఆర్టికల్ ని చూపిస్తుంది.
చివరగా, టి ,బిస్కెట్ల కోసం 8 కోట్లు ఖర్చు చేసినట్టుగా చెప్తున్నది తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లోని వై. యస్. జగన్ ప్రభుత్వం కాదు.