Fake News, Telugu
 

తెలంగాణ ప్రభుత్వం 1640 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించింది, 16 వేల మందిని కాదు

0

తెలంగాణ ప్రభుత్వం ఒకే రోజు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న 16 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించిందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తెలంగాణ ప్రభుత్వం ఒకే రోజు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న 16 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించింది.

ఫాక్ట్ (నిజం): తెలంగాణ ప్రభుత్వం 1640 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించింది, 16 వేల మందిని కాదు. తెలంగాణ ప్రభుత్వం గత సంవత్సరం ఔట్ సోర్సింగ్ బేసిస్ లో నియమించిన 1640 స్టాఫ్ నర్సుల కాంట్రాక్టు ముగియడంతో విధులకు రావద్దని ఉత్తర్వులు జారీ చేసింది. ఐతే ఈ వార్తని ప్రభుత్వం 16 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించిందని తప్పుగా అర్ధం చేసుకున్నారు. ప్రముఖ వార్తా సంస్థ NTV కూడా ప్రభుత్వం 16 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించిందని కథనాలు ప్రచారం చేయడంతో ఈ వార్త వైరల్ అయ్యింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

తెలంగాణ ప్రభుత్వం గత సంవత్సరం కరోనా సమయంలో తెలంగాణలోని పలు ప్రభుత్వ ఆసుపత్రులలో సేవల కోసం 1640 స్టాఫ్ నర్సులను ఔట్ సోర్సింగ్ బేసిస్ లో నియమించింది. 01 ఏప్రిల్ 2020 నుండి 31 మార్చ్ 2021 మధ్య ఒక సంవత్సర కాలం పనిచేసేలా వీరిని నియమించింది.

ఈ సంవత్సరం మార్చ్ లో వీరి గడువు ముగియడంతో, ప్రభుత్వం వీరిని జూన్ చివరి దాకా పొడిగించిందని ఒక నర్స్ హిందూ పత్రికతో మాట్లాడుతూ అంది. ఐతే 05 జూలై 2021న వీరిని తొలగిస్తూ ప్రభుత్వం ఆయా ఆసుపత్రి సూపరింటెండెంట్లకు ఉత్తర్వులు ఇవ్వడంతో, డ్యూటీలకు వచ్చిన నర్సులను సంబంధిత అధికారులు వెనక్కి పంపించారని మరొక వార్తా కథనం రాసింది.

ఐతే ప్రభుత్వం వీరిని తొలగించిన ఈ విషయాన్నీ ‘వైద్య ఆరోగ్య శాఖలో 16 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం తొలగించిందని’ ప్రముఖ వార్తా సంస్థ NTV తప్పుగా కథనాలు ప్రచారం చేయడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోస్టులోని వార్త కూడా NTV కథనాల నుండి సేకరించి ఉండొచ్చు. NTV ప్రసారం చేసిన ఈ కథనాలను ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. NTV ఇదే వార్తని మొదట ట్విట్టర్ లో షేర్ చేసింది, ఆ తర్వాత ట్వీట్ ని డిలీట్ చేసింది. దీన్నిబట్టి, ప్రభుత్వం 1640 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించిన వార్తని, 16 వేల మందిని తొలగించినట్టు తప్పుగా భావించారని అర్ధమవుతుంది.

చివరగా, తెలంగాణ ప్రభుత్వం 1640 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించింది, 16 వేల మందిని కాదు.

Share.

About Author

Comments are closed.

scroll