కొత్త ఏడాది, అంటే 01 జనవరి 2023, నుండి పరిమితికి మించిన ATM నగదు ఉపసంహరణలపై రూ.21 మరియు జీఎస్టీ ఛార్జీలు విధించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఇటీవల బ్యాంకులకు అనుమతినిచ్చింది, అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: 01 జనవరి 2023 నుంచి పరిమితికి మించిన ATM నగదు ఉపసంహరణలపై రూ. 21 మరియు జీఎస్టీ ఛార్జీలు విధించడానికి RBI ఇటీవల బ్యాంకులకు అనుమతినిచ్చింది.
ఫాక్ట్: పరిమితికి మించిన ATM నగదు ఉపసంహరణలపై రూ. 21 ఛార్జీ విధించడానికి RBI 2021 జూన్ నెలలోనే ఒక సర్క్యులర్ ద్వారా ఆమోదం తెలిపింది. 01 జనవరి 2022 నుండి ఈ కొత్త ఛార్జీలు అమలులోకి వస్తాయని RBI అప్పుడు తెలిపింది. ఆర్‌బీఐ ఇటీవల మళ్ళీ ఈ చార్జీలను సవరిస్తూ ఎటువంటి సర్క్యులర్ పబ్లిష్ చేయలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
పోస్టులో చేస్తున్న క్లెయిమ్‌కు సంబంధించిన వివరాల కోసం కీ పదాలని ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, పరిమితికి మించిన ATM నగదు ఉపసంహరణలపై రూ. 21 ఛార్జీ విధించడానికి RBI బ్యాంకులకు అనుమతిచ్చిందని పలు వార్తా సంస్థలు 2021 జూన్ నెలలో ఆర్టికల్స్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఆ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
పరిమితికి మించిన ATM నగదు ఉపసంహరణలపై రూ. 21 ఛార్జీ విధించడాన్ని ఆమోదిస్తూ RBI 10 జూన్ 2021 నాడు ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. ఉచిత లావదేవిలకు మించి అదనపు ATM నగదు ఉపసంహరణలు చేసిన వారికి ఒక్కో అదనపు లావదేవికి రూ.21 ఛార్జీ విధించడానికి RBI బ్యాంకులకు అనుమతినిచ్చింది. ఈ కొత్త ఛార్జీలు 01 జనవరి 2022 నుండి అమలులోకి వస్తాయని RBI ఈ సర్క్యులర్లో స్పష్టంగా తెలిపింది.
ఈ చార్జీలను సవరిస్తూ RBI మళ్ళీ ఎటువంటి సర్క్యులర్ పబ్లిష్ చేయలేదు. దేశంలోని అన్నీ బ్యాంకులు ఈ చార్జీలను ప్రస్తుతం అనుసరిస్తున్నాయి. ఈ వివరాల ఆధారంగా RBI పరిమితికి మించిన ATM నగదు ఉపసంహరణలపై రూ. 21 ఛార్జీ విధించడానికి బ్యాంకులకు 2021లోనే అనుమతినిచ్చిందని స్పష్టమయ్యింది.
చివరగా, పరిమితికి మించిన ATM లావదేవిలపై రూ.21 ఛార్జీలు విధించడానికి RBI 2021 జూన్ నెలలోనే బ్యాంకులకు అనుమతినిచ్చింది.