Fake News, Telugu
 

తన వ్యాఖ్యలను పార్లమెంటు రికార్డుల నుంచి తొలగించడంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి షేర్ చేస్తున్నారు

0

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మీడియాతో ‘భారత్’ అనేది అసభ్య పదం అని అన్నారు అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు విస్తృతంగా వైరల్ అవుతోంది. ఆ పోస్టులో ఎంత వరకు నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: రాహుల్ గాంధీ, ‘భారత్’ అనే పదం అసభ్య పదం అని అన్నాడు.

ఫాక్ట్: రాహుల్ గాంధీ ‘భారత్’ అనేది అసభ్య పదం అని అనలేదు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా మణిపూర్ గురించి జరిగిన చర్చలను సూచిస్తూ , తన ప్రసంగంలోని కొన్ని పదాలను తొలగించాలన్న లోక్ సభ స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ రాహుల్ గాంధీ, ‘ఈ రోజుల్లో, భారత మాత అనేది అన్‌పార్లమెంటరీ పదం అట’ అని అన్నారు. కావున ఈ పోస్టు చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ముందుగా, ఈ వీడియో గురించి ఇంటర్నెట్లో వెతకగా, ఇదే వీడియోని ది ప్రింట్  మీడియా సంస్థ ప్రసారం చేసినట్టు గమనించాం. ఇటీవల పార్లమెంట్లో జరిగిన అవిశ్వాస తీర్మానం చర్చలలో భాగంగా, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మణిపూర్ ఘటనల గురించి చర్చిస్తూ, మోదీ ప్రభుత్వం మణిపూర్ని విభజిస్తుంది అని, బీజేపీ ప్రభుత్వం మణిపూర్లోని భారత మాతను హత్య చేస్తోంది అని ఆరోపించారు.

రాహుల్ గాంధీ చర్చలో భాగంగా వాడిన ఏ పదాలను తొలగించారు అని ఇంటర్నెట్లో వెతకగా, ది వైర్ ఆర్టికల్ ద్వారా  తొలగించిన పదాలలో ‘భారత్ మాత’ అన్న పదం లేదు అని, తాను చేసిన ఆరోపణలలో వాడిన ‘భారత మాత హత్య’ అనే మాట నుంచి ‘హత్య’ వంటి  కొన్ని పదాలను లోక్ సభ రికార్డ్స్ నుంచి తొలగించడం జరిగింది అని తెలిసింది. ఇదే విషయాన్నీ పార్లమెంట్ అధికారిక రికార్డ్స్ ద్వారా నిర్దారించుకోవొచ్చు.

భారత రాజ్యాంగంలోని ఎంపీలకు సంబంధించిన  పార్లమెంటరీ ప్రివిలేజెస్ ప్రకారం (ఇక్కడ మరియు ఇక్కడ) ఆర్టికల్ 105 (2), పార్లమెంటు సభ్యులు పార్లమెంటులో వారి ప్రకటనలకు కోర్టు విచారణల నుండి మినహాయింపు పొందుతారు అని చెబుతుంది. అయితే, ఆర్టికల్ 121, పార్లమెంటరీ చర్చల సమయంలో సభ్యులు, “పార్లమెంటరీ భాష” ఉపయోగించాలని సూచిస్తుంది.

రూల్స్ అఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ అఫ్ బిజినెస్ రూల్ 380 ప్రకారం చర్చలలో, అసభ్యకరమైన లేదా పరువు నష్టం కలిగించే మాటలు లేదా అన్‌పార్లమెంటరీ లేదా అగౌరవ పరిచే మాటలు వాడినప్పుడు స్పీకర్ అభిప్రాయం ప్రకారం ఆ పదాలను సభ రికార్డ్స్ నుంచి తొలగించొచ్చు.

చివరిగా, తన వ్యాఖ్యలను పార్లమెంటు రికార్డుల నుంచి తొలగించడంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll