Fake News, Telugu
 

జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలనే ఉద్దేశంలో రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితి ఎత్తి వేస్తామని రాహుల్ గాంధీ అన్నారు

0

రాహుల్ గాంధీ ఎన్నికల హామీలలో భాగంగా ప్రస్తుతం రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని ఎత్తివేస్తామని ప్రకటన చేసాడన్న వార్త ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.  ఐతే కేవలం మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించడం కోసం మాత్రమే రాహుల్ గాంధీ ఈ ప్రకటన చేసినట్టు ఈ వార్తను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించడం కోసం రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని ఎత్తివేస్తామని రాహుల్ గాంధీ ఎన్నికల హామీ ఇచ్చాడు.

ఫాక్ట్(నిజం): కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా అనేక సందర్భాలలో రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని ఎత్తేసి, SC/STలకు, ఇతరులకు వారి జనాభాను బట్టి రిజర్వేషన్‌ అమలు చేస్తామని రాహుల్ గాంధీ అన్నారు. ఇదే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తమ కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పేర్కొంది. రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలను వక్రీకరించి కేవలం మైనారిటీలకు రిజర్వేషన్లు పెంచేందుకే పరిమితిని ఎత్తేస్తాం అని అన్నట్టు షేర్ చేస్తున్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

రాహుల్ గాంధీ రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని ఎత్తివేస్తామని అన్న మాట నిజమే అయినప్పటికి, జనగణన నిర్వహించి జనభా దామాషా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశంలో ఈ వ్యాఖ్యలు చేసాడు, అంతేగానీ కేవలం మైనారిటీలకు రిజర్వేషన్లు పెంచడం కోసం కాదు.

రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని ఎత్తేస్తాము – రాహుల్ గాంధీ:

రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని ఎత్తేస్తామని కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. ప్రస్తుతం ఉన్న 50% పరిమితిని ఎత్తేసి రిజర్వేషన్లలు 75%కి పెంచుతామని మేనిఫెస్టోలో తెలిపింది.

ఇటీవల కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ కూడా ఇదే అంశాన్ని అనేక సందర్భాలలో ప్రస్తావించాడు. ప్రస్తుతం రిజర్వేషన్లపై అమలులో ఉన్న 50% పరిమితిని ఎత్తేసి, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను అమలు చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించాడు.

మోదీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వాన్ని కులాల ఆధారంగా జనాభా గణన నిర్వహించాలనీ, 2011లో UPA ప్రభుత్వం చేసిన కుల ఆధారిత జనాభా గణన వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేస్తూ, తాము అధికారంలోకి వస్తే 50% పరిమితిని ఎత్తేసి, SC/STలకు, ఇతరులకు వారి జనాభాను బట్టి రిజర్వేషన్‌ అమలు చేస్తామని రాహుల్ గాంధీ అన్నాడు.

జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లలో మార్పులు చేయాలని రాహుల్ గాంధీ అన్నాడే తప్ప తన ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కూడా కేవలం మైనారిటీ రిజర్వేషన్లను పెంచడం కోసమే ప్రస్తుత పరిమితిని ఎత్తేస్తాం అని అనలేదు.

రాహుల్ గాంధీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ సందర్భాలలో రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. వీటన్నిటి బట్టి రాహుల్ గాంధీ వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని అర్ధం చేసుకోవచ్చు.

రాజ్యాంగంలో రిజర్వేషన్లపై పరిమితి:

రిజర్వేషన్లు 50 శాతం కన్నా మించకూడదని రాజ్యాంగంలో స్పష్టంగా ప్రస్తావించారని ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. కాని నిజానికి రాజ్యాంగంలో రిజర్వేషన్ల పరిమితికి సంబంధించి ఎటువంటి ప్రస్తావన లేదు.

రిజర్వేషన్లపై పరిమితిని సుప్రీంకోర్టు విధించింది. సుప్రీంకోర్టు 1992లో ఇందిరా సాహ్ని కేసు ద్వారా రిజర్వేషన్లు 50% దాటకూడదని నిర్దేశించింది.

నిజానికి మొదట రాజ్యాంగంలో కేవలం చట్టసభలలో SC మరియు STలకు రిజర్వేషన్లకు సంబంధించి మాత్రమే ప్రస్తావించారు. అది కూడా కేవలం పది సంవత్సరాల (1951-61) వరకు మాత్రమే ఈ రిజర్వేషన్ అమలులో ఉండాలని మాత్రమే ఉండేది.

కాని కాలక్రమేనా ఈ రిజర్వేషన్లు పొడిగిస్తూ, చట్ట సభలు మాత్రమే కాకుండా విద్యా, ఉద్యోగ విషయలకు కూడా ఈ రిజర్వేషన్లు వర్తించేలా సవరణలు చేసుకుంటూ వస్తున్నారు. 1991లో మండల కమిషన్ రిపోర్ట్ ఆధారంగా OBCలకు రిజర్వేషన్ అమలును చేపట్టారు.

ఐతే సుప్రీంకోర్టు 1992లో ఇందిరా సాహ్ని కేసు ద్వారా రిజర్వేషన్లు 50% దాటకూడదని నిర్దేశించింది. ఆ తరవాత కూడా అనేక సందర్భాలలో సుప్రీంకోర్టు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి అనుగుణంగానే తమతమ రాష్ట్రాలలో రిజర్వేషన్లను అమలు చేస్తున్నాయి.

కేవలం తమిళనాడు మాత్రమే తమ రాష్ట్రంలో 69% రిజర్వేషన్‌ను అమలు చేస్తుంది. Tamil Nadu Backward Classes, Scheduled Castes and Scheduled Tribes  Act, 1993ను  రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చడం ద్వారా తమిళనాడు ఈ విధానాన్ని అమలు చేస్తుంది.  సుప్రీంకోర్టు కూడా దీనికి  వెసులుబాటు కల్పించింది.

చివరగా, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలనే ఉద్దేశంలో రిజర్వేషన్లపై ఉన్న 50% ఎత్తి వేస్తామని రాహుల్ గాంధీ అన్నారు.

Share.

About Author

Comments are closed.

scroll