“పాకిస్థాన్‌లోని దాదాపు 8 లక్షల కోట్ల రూపాయల భారత కరెన్సీని అక్రమంగా భారత్‌లోకి తరలించాలని ప్లాన్ చేశారు. నాకు రహస్య సమాచారం వచ్చింది. ప్రధాని మోదీ వద్దకు తీసుకెళ్లి చెప్పాను. వెంటనే 500, 1000 రూపాయల నోట్లు చెల్లవని ప్రకటించారు. ఎవ్వరూ ఊహించలేనంత వేగం ఆయనది”, అని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రాఘురామ్ రాజన్ అన్నట్టు చెప్తూ ఒక పోస్ట్‌ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. అంతేకాదు, పాకిస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ రూ. 5 లక్షల కోట్లు దాచిపెట్టిందని కూడా రాఘురామ్ రాజన్ చెప్పినట్టు పోస్ట్‌లో రాసారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: పాకిస్థాన్‌లోని దాదాపు 8 లక్షల కోట్ల రూపాయల భారత కరెన్సీని అక్రమంగా భారత్‌లోకి తరలించాలని ప్లాన్ చేశారని, ప్రధాని మోదీకి చెప్పగానే, వెంటనే పెద్ద నోట్లను రద్దు చేసారని రాఘురామ్ రాజన్ తెలిపారు.
ఫాక్ట్: పోస్ట్‌లోని వ్యాఖ్యలను ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రాఘురామ్ రాజన్ చేసినట్టు ఎక్కడా ఎటువంటి సమాచారం గానీ, ఆధారాలు గానీ లేవు. డీమోనిటైజేషన్ (పెద్ద నోట్ల రద్దు) సమయంలో రాఘురామ్ రాజన్ ఆర్‌బీఐ గవర్నర్‌గా లేరు. అంతేకాదు, పాకిస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ రూ. 5 లక్షల కోట్లు దాచిపెట్టిందని కూడా రాఘురామ్ రాజన్ ఎక్కడా చెప్పలేదు. కావున, పోస్ట్‌లో చెప్పింది తప్పు.
పోస్ట్‌లోని వ్యాఖ్యలను ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రాఘురామ్ రాజన్ చేసారా అని ఇంటర్నెట్‌లో వెతకగా, రాజన్ అలాంటి వ్యాఖ్యలు చేసినట్టు ఎక్కడా ఎటువంటి సమాచారం దొరకలేదు. “డిమోనిటైజేషన్‌పై నా అభిప్రాయం కోసం ఫిబ్రవరి 2016లో ప్రభుత్వం అడిగింది. నేను మౌఖికంగా ఆ అభిప్రాయం ఇచ్చాను. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, స్వల్పకాలిక ఆర్థిక వ్యయాలు వాటి కంటే ఎక్కువగా ఉంటాయని నేను భావించాను”, అని రాజన్ తన పుస్తకంలో రాసినట్టు తెలిసింది. అంతేకాదు, “నా పదవీ కాలంలో ఏ సమయంలోనూ పెద్ద నోట్ల రద్దుపై నిర్ణయం తీసుకోమని ఆర్‌బీఐని ప్రభుత్వం కోరలేదు“, అని కూడా రాజన్ తెలిపినట్టు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
డీమోనిటైజేషన్ (పెద్ద నోట్ల రద్దు) సమయంలో రాఘురామ్ రాజన్ ఆర్‌బీఐ గవర్నర్‌గా లేరు. తనను కొనసాగించడానికి ప్రభుత్వం తరుపు నుండి ఎటువంటి ఆఫర్ రాలేదని రాఘురామ్ రాజన్ తెలిపారు. కాబట్టి, రాఘురామ్ రాజన్ చెప్పడంతో, మోదీ వెంటనే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్టు పోస్ట్‌లో చెప్పినదాంట్లో వాస్తవం లేదు. అంతేకాదు, రాఘురామ్ రాజన్ ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉన్నప్పుడు నోట్ల రద్దు ఆలోచనను వ్యతిరేకించడమే తను ఆర్‌బీఐని వదిలి వెళ్ళడానికి కారణమని చిదంబరం అభిప్రాయపడినట్టు ఇక్కడ చదవచ్చు.
పాకిస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ రూ.5 లక్షల కోట్లు దాచిపెట్టిందని కూడా రాఘురామ్ రాజన్ ఎక్కడా చెప్పలేదు. “మీరు ఒక ప్రభుత్వాన్ని మరొకదాని కంటే నిర్ణయాత్మకంగా భావించారా?” అని ‘ది టైమ్స్ అఫ్ ఇండియా’ వారు రాజన్‌ని అడగగా, “ప్రభుత్వాలతో నిర్దిష్ట సంబంధాలపై నేను వ్యాఖ్యానించలేను…రెండు ప్రభుత్వాలతోనూ నాకు సత్సంబంధాలు ఉన్నాయి”, అని తను సమాధానమిచ్చినట్టు ఇక్కడ చదవచ్చు.
పోస్ట్‌లో చిదంబరం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ గురించి కూడా ఉంది. అయితే, దానికి సంబంధించి ఎటువంటి ఖచ్చితమైన సమాచారం మాకు దొరకలేదు. అయితే, ఇండియాలోని ఫేక్ నోట్లకు చిదంబరం కారణమని సుబ్రమణ్యస్వామి ఆరోపించినట్టు తెలిసింది. “చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఇదంతా మొదలైంది. అతను లండన్‌లోని డి లా ర్యూ అనే బ్రిటిష్ కంపెనీకి కరెన్సీని ముద్రించే కాంట్రాక్టును ఇచ్చాడు మరియు అదే కంపెనీ పాకిస్తాన్‌కు కూడా కరెన్సీని ముద్రిస్తోంది. కాబట్టి, కరెన్సీ పేపర్లను పొందడం పాకిస్తాన్‌కు సులువుగా మారింది”, అని సుబ్రమణ్యస్వామి చెప్పినట్టు ఇక్కడ చదవచ్చు.
డి లా ర్యూ అనే బ్రిటిష్ కంపెనీ మరియు భారత ప్రభుత్వం మధ్య సంబంధాల గురించి మరింత సమాచారాన్ని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చదవచ్చు.
చివరగా, పెద్ద నోట్ల రద్దుకి సంబంధించి కాంగ్రెస్ గురించి రాఘురామ్ రాజన్ పోస్ట్‌లోని వ్యాఖ్యలు చేయలేదు.