Fake News, Telugu
 

ప్రధాని మోదీ అబ్దుల్ కలాం, వాజ్‌పేయీ పేర్లతో విద్యార్థులకు స్కాలర్షిప్‌లు ప్రకటించాడన్న వార్తలో నిజం లేదు

0

10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం ప్రధాని మోదీ అబ్దుల్ కలాం, వాజ్‌పేయీ పేర్లపై స్కాలర్షిప్ ప్రకటించారని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. 75% కంటే ఎక్కువ స్కోర్ చేసిన 10వ తరగతి విద్యార్థులకు 10000/- రూపాయలు మరియు 85% కంటే ఎక్కువ మార్కులు సాధించిన 12వ తరగతి విద్యార్థులకు 25000/- రూపాయలు, ఈ స్కాలర్షిప్ ద్వారా అందిచనున్నారని కూడా పోస్టులో చెప్తున్నారు. ఐతే ఈ స్కాలర్షిప్‌కు సంబంధించి నిజమేంటో ఈ కథనం ద్వారా చూద్దాం.

క్లెయిమ్: 10/12 ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం ప్రధాని మోదీ అబ్దుల్ కలాం, వాజ్‌పేయీ పేర్లపై స్కాలర్షిప్‌లను ప్రకటించారు.

ఫాక్ట్(నిజం): కేంద్ర ప్రభుత్వం అబ్దుల్ కలాం, వాజ్‌పేయీ పేర్లతో 10/12 ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం ఎటువంటి స్కాలర్షిప్‌లను అందించడం లేదు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ICCR) అబ్దుల్ కలాం, వాజ్‌పేయీ పేర్లతో భారతదేశంలోని విశ్వవిద్యాలయాల్లో చదువుకునే విదేశీయులకు స్కాలర్షిప్‌లను అందిస్తుంది. బహుశా ఈ స్కాలర్షిప్‌లను 10/12 విద్యార్థులకు అందిస్తున్నారని తప్పుగా అర్ధం చేసుకొని ఉండొచ్చు. కాని ఈ స్కాలర్షిప్‌లు కేవలం భారత విశ్వవిద్యాలయాల్లో చదువుకునే విదేశీ విద్యార్థులకే తప్ప భారతీయ విద్యార్థులకు కాదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ప్రధానమంత్రి మోదీ అబ్దుల్ కలాం, వాజ్‌పేయీ పేర్లతో 10/12 ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం ఎటువంటి స్కాలర్షిప్‌లను అందించడం లేదు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం స్కూల్/ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు అందించే స్కాలర్షిప్‌ల వివరాలు కేంద్ర హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి సంబంధించిన వివిధ డిపార్టుమెంట్ వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంచుతారు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ).

కాని ఈ వెబ్‌సైట్‌లలో అబ్దుల్ కలాం/వాజ్‌పేయీ పేర్లతో స్కాలర్షిప్‌లు ఉన్నట్టు ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ నిజంగానే మోదీ ఇలాంటి స్కాలర్షిప్‌లు ప్రారంభించి ఉంటే మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసి ఉండేది, కాని మాకు అలాంటి మీడియా కథనాలేవి కనిపించలేదు.

ఐతే ఇదే వార్తా గత కొన్ని సంవత్సరాలుగా షేర్ అవుతూ వస్తుంది. గతంలో ఈ వార్తతో పాటు, దరఖాస్తు చేసుకోవడానికి ఒక లింక్‌ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసారు. కొన్ని పార్టీల అధికారిక సోషల్ మీడియా అకౌంట్లు ఈ వార్తను షేర్ చేయడంతో ఈ వార్త విస్తృతంగా షేర్ అయ్యింది. ఐతే అప్పట్లో ఈ వార్త తప్పని, కేంద్ర ప్రభుత్వం ఇలాంటి స్కాలర్షిప్‌లు ఏవి అందించట్లేదని PIB స్పష్టం చేసింది.

ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ICCR):

ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం పరిధిలోని స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అయిన ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ICCR), అబ్దుల్ కలాం, వాజ్‌పేయీ పేర్లతో భారతదేశంలో చదువుకునే విదేశీయులకు స్కాలర్షిప్‌లను అందిస్తుంది.

ఆసియా మరియు లాటిన్ అమెరికా దేశాలకు చెందిన విద్యార్థులు భారతదేశంలో అండర్ గ్రాడ్యుయేట్/పోస్ట్ గ్రాడ్యుయేట్/పరిశోధనలు చేసే విద్యార్థులకు ICCR, అటల్ బిహారీ వాజ్‌పేయీ జనరల్ స్కాలర్‌షిప్ స్కీం పేరుతో విద్యార్థులకు ఆర్ధిక సహాయాన్ని అందిస్తుంది.

అలాగే డాక్టర్ ఏ.పీ.జే. అబ్దుల్ కలాం కామన్వెల్త్ స్కాలర్‌షిప్ పేరుతో భారత విశ్వవిద్యాలయాల్లో అండర్ గ్రాడ్యుయేట్/పోస్ట్ గ్రాడ్యుయేట్/పరిశోధనలు చేసే కామన్ వెల్త్ దేశాలకు చెందిన విద్యార్థులకు ICCR ఆర్ధిక సహాయాన్ని అందిస్తుంది.

ఈ స్కాలర్షిప్‌లకు సంబంధించిన వివరాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. బహుశా ఈ స్కాలర్షిప్‌లను 10/12 విద్యార్థులకు అందిస్తున్నారని తప్పుగా అర్ధం చేసుకొని ఉండొచ్చు. కాని ఈ స్కాలర్షిప్‌లు కేవలం భారత విశ్వవిద్యాలయాల్లో చదువుకునే విదేశీ విద్యార్థులకే తప్ప భారతీయ విద్యార్థులకు కాదు. కేవలం ఈ రెండు స్కాలర్షిప్‌లు మాత్రమే కాడుండా, వివిధ దేశాలకు చెందిన విద్యార్థులకు ICCR స్కాలర్షిప్‌లను అందిస్తుంది.

చివరగా, ప్రధాని మోదీ అబ్దుల్ కలాం, వాజ్‌పేయీ పేర్లతో విద్యార్థులకు స్కాలర్షిప్‌లు ప్రకటించాడన్న వార్తలో నిజం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll