Fake News, Telugu
 

19 సెప్టెంబర్ 2024న మిలాద్ ఉన్ నబీ ర్యాలీ సందర్భంగా చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయానికి ముస్లింలు నిప్పు పెట్టారాని పేర్కొంటున్న పోస్ట్‌లు ఫేక్

0

“19 సెప్టెంబర్ 2024న మిలాద్ ఉన్ నబీ ర్యాలీ సందర్భంగా పాతబస్తీలోని చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి కొందరు ముస్లిం దుండగులు నిప్పు పెట్టారు” అంటూ ఓ వీడియోతో కూడిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). డీజే సౌండ్ బాక్సులు ఉన్న వాహనం మంటల్లో కాలిపోతున్న దృశ్యాలను ఈ వీడియోలో మనం చూడొచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 19 సెప్టెంబర్ 2024న మిలాద్ ఉన్ నబీ ర్యాలీ సందర్భంగా పాత బస్తీలోని చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయానికి ముస్లింలు నిప్పు పెట్టారు.

ఫాక్ట్(నిజం): 19 సెప్టెంబర్ 2024న మిలాద్ ఉన్ నబీ ర్యాలీ సందర్భంగా పాత బస్తీలోని చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయానికి ముస్లింలు నిప్పు పెట్టారు అన్నది ఫేక్ వార్త. 19 సెప్టెంబర్ 2024న, మిలాద్ ఉన్ నబి సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలో చార్మినార్ దగ్గర అల్ ఇండియా సున్ని యునైటెడ్ ఫోరమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మిలాద్ ర్యాలీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది, ర్యాలీలో టపాసులు కాల్చటంతో నిప్పు రవ్వలు పడి డీజే సౌండ్ బాక్సులు ఉన్న వాహనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయానికి ఎలాంటి నష్టం జరగలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ముందుగా వైరల్ పోస్ట్‌లో పేర్కొన్నట్లుగా, 19 సెప్టెంబర్ 2024న మిలాద్ ఉన్ నబీ ర్యాలీ సందర్భంగా పాత బస్తీలోని చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయానికి ముస్లింలు నిప్పు పెట్టారా? అని తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఇలాంటి ఘటన జరిగినట్లు ఎటువంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ మాకు లభించలేదు. ఒకవేళ ఇలాంటి ఏదైనా ఘటన జరిగి ఉంటే ఖచ్చితంగా మీడియా సంస్థలు రిపోర్ట్ చేసి ఉండేవి. ఈ క్రమంలోనే 19 సెప్టెంబర్ 2024న, మిలాద్ ఉన్ నబి సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలో చార్మినార్ దగ్గర అల్ ఇండియా సున్ని యునైటెడ్ ఫోరమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మిలాద్ ర్యాలీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుందని, ర్యాలీలో టపాసులు కాల్చటంతో నిప్పు రవ్వలు పడి డీజే సౌండ్ బాక్సులు ఉన్న వాహనంలో మంటలు చెలరేగాయని చెప్తున్న పలు రిపోర్టులు లభించాయి (ఇక్కడ, ఇక్కడ,  ఇక్కడ, & ఇక్కడ).

అలాగే ఈ ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు కథనాలతో కూడిన పలు పోస్టులు వైరల్ అవ్వగా, ఓ X(ట్విట్టర్) పోస్టు పై స్పందిస్తూ హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీ.వీ. ఆనంద్, స్వయంగా ఆయనే మీడియాకు ఈ ఘటన గురించి వివరిస్తున్న వీడియోను మరియు డీజే సౌండ్ బాక్సులు ఉన్న వాహనం మంటల్లో కాలిపోతున్న వీడియోను పోస్ట్ చేశారు.

అలాగే మేము ఈ ఘటన, మిలాద్ ఉన్ నబీ ర్యాలీకి సంబంధించిన మరిన్ని వీడియోల కోసం యూట్యూబ్‌లో వెతకగా పలు వీడియోలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ,  ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలలో కూడా మనం కేవలం డీజే సౌండ్ బాక్సులు ఉన్న వాహనంలో మాత్రమే మంటలను చూడవచ్చు, భాగ్యలక్ష్మి ఆలయ సమీప పరిసరాలలో ఎటువంటి మంటలు లేకపోవడం కూడా మనం చూడవచ్చు. దీన్ని బట్టి  ఈ ఘటనలో చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయానికి ఎలాంటి నష్టం జరగలేదని మరియు ఈ వైరల్ పోస్టులు ఫేక్ అని మనం నిర్థారించవచ్చు.

చివరగా, 19 సెప్టెంబర్ 2024న మిలాద్ ఉన్ నబీ ర్యాలీ సందర్భంగా పాతబస్తీలోని చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయానికి ముస్లింలు నిప్పు పెట్టారానిపేర్కొంటున్న పోస్ట్‌లు ఫేక్. మిలాద్ ఉన్ నబీ ర్యాలీ సందర్భంగా జరిగిన అగ్ని ప్రమాద దృశ్యాలను ఈ తప్పుడు కథనాలతో షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll