Fake News, Telugu
 

‘ప్రధానమంత్రి వయా వందన యోజన’ పథకంలో 15 లక్షలు కడితే, జీవితాంతం 10 వేలు పెన్షన్ రాదు

0

60 సంవత్సరాలు పైబడిన వృద్ధుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘ప్రధానమంత్రి వయా వందన యోజన’ పథకంలో 15 లక్షలు కడితే, జీవితాంతం 10 వేలు పెన్షన్ వస్తుంది అని చెప్తూ ‘V6 News’ ఆర్టికల్ (ఆర్కైవ్డ్) తో కూడిన పోస్టుని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘ప్రధానమంత్రి వయా వందన యోజన’ పథకంలో 15 లక్షలు కడితే, జీవితాంతం 10 వేలు పెన్షన్ వస్తుంది.

ఫాక్ట్ (నిజం): 15 లక్షలు కడితే, ప్రధానమంత్రి వయా వందన యోజన’ పథకం ద్వారా జీవితాంతం 10 వేల పెన్షన్ రాదు. కేవలం పది సంవత్సరాలు మాత్రమే వస్తుంది. అంతేకాదు, ఆర్టికల్ లో చెప్పినట్టు పాలసీదారులు పది సంవత్సరాల పాటు డబ్బులను కట్టరు. ఒకేసారి మొత్తం డబ్బుని కట్టి, పది సంవత్సరాల పాటు పెన్షన్ పొందుతారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్టులోని ‘V6 News’ ఆర్టికల్ చదివితే కూడా టైటిల్ లో చెప్పిన విషయమే ఉంటుంది. “సీనియర్ సిటిజన్లకు శుభవార్తు..! 15 లక్షల పాలసీ తీసుకుంటే నెలకు రూ.10వేలు పెన్షన్ చెల్లించేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2017 లో ఎల్ ఐసీ.., ప్రధాన్ మంత్రి వయా వందన యోజన స్కీంను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ లో భాగంగా సీనియర్ సిటిజన్లు 10 సంవత్సరాల్లో 15లక్షలు పే చేయాల్సి ఉంది. పాలసీదారులు పదిసంవత్సరాల పాటు మినిమం నెలకు వెయ్యి , క్వార్టర్లీ 3వేలు, సంవత్సరానికి 6వేలు లేదా 12వేలు చెల్లించాల్సి ఉంది. మ్యాగ్జిమం నెలకు 10వేలు, 6నెలలకు 30వేలు,60వేలు, సంవత్సరానికి 1,20, 000 చెల్లించాలి. ఆ లెక్కన 10సంవత్సరాలకు 15లక్షలు చెల్లించాల్సి ఉంది. ఇలా చెల్లించిన పాలసీదార్లకు 10సంవత్సరాలు ముగిసిన వెంటనే నెలకు రూ. 10వేలు పెన్షన్ పొందవచ్చు.” అని ఆర్టికల్ లో రాసి ఉన్నట్టు చూడవొచ్చు.

‘ప్రధాన మంత్రి వయా వందన యోజన’ పథకం గురించి కేంద్ర ప్రభుత్వ ‘Vikaspedia’ వెబ్ సైట్ లో చూడవొచ్చు. పథకం తీసుకున్నప్పుడు పదిహేను లక్షలు కడితే, పదేళ్ల పాటు నెలకు పదివేలు పెన్షన్ గా పొందవచ్చని ఆ వెబ్ సైట్ లో చదవొచ్చు. పదేళ్ల తరువాత మనం కట్టిన డబ్బులు మనకు తిరిగి చెల్లిస్తారు. పోస్టులో చెప్పినట్టు జీవితాంతం పెన్షన్ రాదు, కేవలం పది సంవత్సరాలు మాత్రమే వస్తుంది. ఆ పథకంలో వచ్చే వివిధ ప్రయోజనాల గురించి కింద చదవొచ్చు.

అంతేకాదు, ఆర్టికల్ లో చెప్పినట్టు 10 సంవత్సరాల్లో 15లక్షలు కట్టాలని లేదు. పథకం తీసుకున్నప్పుడే మొత్తం డబ్బులను కట్టాలి.

ఈ పథకాన్ని ఎల్.ఐ.సీ (LIC) వారు నిర్వహిస్తున్నారు. ఈ పథకానికి సంబంధించిన మరిన్ని వివరాలను ఎల్.ఐ.సీ వారి వెబ్ సైట్ లో చూడవొచ్చు.

చివరగా, ‘ప్రధానమంత్రి వయా వందన యోజన’ పథకంలో 15 లక్షలు కడితే, జీవితాంతం 10 వేలు పెన్షన్ రాదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll