Fake News, Telugu
 

టీడీపీకి మద్దతుగా సైకిల్ గుర్తుని తన షర్ట్ మీద వేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఎడిట్ చేసిన ఫోటోని షేర్ చేస్తున్నారు

0

ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో టీడీపీకి మద్దతుగా సైకిల్ గుర్తుని తన షర్ట్ మీద వేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ అని క్లెయిమ్ చేస్తూ ఒక ఫోటోని సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) షేర్ చేస్తున్నారు. ఈ క్లెయిమ్‌లో ఎంతవరకు నిజం ఉందో చూద్దాం. 

క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో టీడీపీకి మద్దతుగా సైకిల్ గుర్తుతో ఉన్న షర్ట్ వేసుకున్న జూనియర్ ఎన్టీఆర్. 

ఫాక్ట్ (నిజం): ఇది ఎడిట్ చేసిన ఫోటో. అసలు ఫొటోలో జూనియర్ ఎన్టీఆర్ షర్ట్ మీద ఎలాంటి గుర్తు లేదు. ‘వార్ 2’ సినిమా షూటింగ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల ముంబయి వెళ్ళినప్పుడు అక్కడి ఎయిర్ పోర్టులో ఈ ఫోటోను తీశారు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు

వైరల్ అవుతున్న ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతికితే ఇదే ఫోటోతో పలు కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ). వీటి ప్రకారం, జూనియర్ ఎన్టీఆర్ ‘వార్ 2’ సినిమా షూటింగ్ కోసం ముంబయి వెళ్ళినప్పుడు అక్కడి ఎయిర్ పోర్టులో 21 ఏప్రిల్ 2024న ఈ ఫోటోను తీశారు. ఇదే విషయాన్ని ‘ANI NEWS’ 22 ఏప్రిల్ 2024న రిపోర్ట్ చేసిన వీడియోలో కూడా చూడవచ్చు. వీటిలో ఎక్కడా కూడా జూనియర్ ఎన్టీఆర్ షర్ట్ మీద సైకిల్ గుర్తు లేదని గమనించవచ్చు. 

అసలు ఫోటోలో జూనియర్ ఎన్టీఆర్ షర్ట్‌కి, వైరల్ ఫొటోలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ షర్ట్‌కి మధ్య తేడాలను కింద గమనించవచ్చు. 

అంతేకాక, 2023లో ప్రచురించిన ఒక కథనం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ చివరగా 2009 అసెంబ్లీ ఎలక్షన్స్ సమయంలో టీడీపీకి మద్దతుగా ప్రచారం చేసారు. అప్పటినుంచి, ఆయన తన కెరీర్ మీద దృష్టి పెట్టడానికి రాజకీయాలకు దూరంగా ఉన్నట్టు ఇందులో పేర్కొన్నారు. 

చివరగా, టీడీపీకి మద్దతుగా సైకిల్ గుర్తుని తన షర్ట్ మీద వేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఎడిట్ చేసిన ఫోటోని షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll