Fake News, Telugu
 

ఈ వీడియో 2016లోనిది; నోట్ల రద్దు చేసిన వారంలోనే అవినీతిపై ప్రధాని మోదీ గోవాలో ఈ ప్రసంగం ఇచ్చారు

0

తాజాగా గోవాలో ప్రధాని మోదీ ఇచ్చిన ప్రసంగం అని చెప్తూ ఒక వీడియో క్లిప్‌ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. మోదీ అవినీతిపై ఇచ్చిన తాజా ప్రసంగానికి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ భయపడినట్టు కూడా పోస్ట్‌లో రాస్తున్నారు. గోవాలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ వీడియో షేర్ చేయబడుతుంది. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: తాజాగా (2022లో) కాంగ్రెస్ నాయకులు భయపడేలా గోవాలో అవినీతిపై ప్రధాని మోదీ ఇచ్చిన ప్రసంగం వీడియో.

ఫాక్ట్:  పోస్ట్‌లోని వీడియో చాలా పాతది. ప్రధాని మోదీ 13 నవంబర్ 2016న గోవాలో ఇచ్చిన ప్రసంగానికి సంబంధించిన వీడియో క్లిప్ అది. నోట్ల రద్దు (డీమోనిటైజేషన్) చేసిన వారం రోజులలోపల ఆ ప్రసంగం ఇవ్వబడింది. గోవాలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల (2022) సందర్భంగా మోదీ ఆ మాటలు మాట్లాడలేదు. కావున పోస్ట్‌లో పాత వీడియోని షేర్ చేసి, తాజా వీడియో అని తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్ట్‌లోని వీడియో యొక్క స్క్రీన్‌షాట్స్‌ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వెతకగా, అలాంటి చాలా వీడియోలు సెర్చ్ రిజల్ట్స్‌లో  వచ్చాయి. అందులో ఒక వీడియో టైటిల్ – “PM Narendra Modi Speech in Goa | 13th November 2016 | Demonetization, Assault on Black Money”, అని ఉంది. ఆ పదాలతో ఇంటర్నెట్‌లో వెతకగా, అదే ప్రసంగం వీడియో ప్రధాని మోదీ ట్విట్టర్ మరియు యూట్యూబ్ ఛానల్‌లో కూడా లభిస్తుంది. ఆ వీడియోని 13 నవంబర్ 2016న పోస్ట్ చేసినట్టు చూడవొచ్చు. వీడియోలో 59:05 దగ్గర పోస్ట్‌లోని క్లిప్ చూడవొచ్చు. కాబట్టి, వీడియో గోవాలో మోదీ ఇచ్చిన ప్రసంగానిదే, కానీ ఐదేళ్ళ కంటే పాతది.

నోట్ల రద్దు (8 నవంబర్ 2016) చేసిన వారం రోజుల లోపల 2016లో ప్రధాని మోదీ ఆ ప్రసంగం ఇచ్చారు. గోవాలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల (2022) సందర్భంగా మోదీ ఆ మాటలు మాట్లాడలేదు. అంతేకాదు, పోస్ట్‌లోని వీడియోలో ఉన్న ప్రసంగం తరువాత మధ్యలో 2017లో కూడా గోవాలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 

తాజగా, డిసెంబర్ 2021లో, గోవాలోని డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో జరిగిన గోవా విమోచన దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో తన ప్రసంగం వీడియోని ఇక్కడ చూడవచ్చు. ప్రస్తుతం పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా ఎన్నికలు జరగబోతున్న ఐదు రాష్ట్రాలలో ఎన్నికల కమిషన్ రాజకీయ ర్యాలీలు మరియు రోడ్‌షోలపై ఆంక్షలు విధించించింది.

చివరగా,  పోస్ట్‌లోని మోదీ ప్రసంగం వీడియో 2016కి సంబంధించింది. గోవాలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల (2022) సందర్భంగా మోదీ ఆ మాటలు మాట్లాడలేదు.

Share.

About Author

Comments are closed.

scroll