“జార్ఖండ్‌లో ట్యూషన్ నుండి తిరిగి వస్తున్న బాలికపై, సామూహిక అత్యాచారం చేసి, చంపేసిన జిహాదీలు” అని చెప్తూ ఒక యువతి మృతదేహం వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: జార్ఖండ్‌లో ముస్లింలచే అత్యాచారం, మరియు హత్య చేయబడ్డ యువతి వీడియో.
ఫాక్ట్: వీడియోలో ఉన్న యువతి జార్ఖండ్‌కు చెందిన 17 ఏళ్ల పల్లవి కుమారి. ఈమెను 05 డిసెంబర్ 2022న పీయూష్ తివారీ అనే వ్యక్తి హత్య చేశాడు. పూజ తనని పెళ్లి చేసుకోమని అడగటం వల్లనే ఇలా చేశాను అని అతను పోలీసు విచారణలో చెప్పాడు. పీయూష్ తివారీ ముస్లిం మతస్తుడు కాదు. కావున పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.
ముందుగా జార్ఖండ్‌లో ఇటీవల ఇటువంటి ఘటన ఏదైనా జరిగిందా అని ఇంటర్నెట్లో వెతకగా, 05 డిసెంబర్ 2022న జార్ఖండ్‌లోని రాంచీ జిల్లాలో పల్లవి కుమారి అనే 17 ఏళ్ల యువతి యొక్క హత్య గురించిన వార్తలు లభించాయి. ఈ ఘటనకు సంబంధించి మీడియాలో వచ్చిన ఫోటోలు మరియు వీడియోలను వైరల్ వీడియోలతో పోల్చి చూడగా, వైరల్ వీడియోలో ఉన్నది పూజ కుమారి మృత దేహం అని స్పష్టం అయ్యింది. సంబంధిత దృశ్యాలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
వివిధ వార్తా కథనాలు, పోలీసులు మరియు పూజ తల్లిదండ్రులు చెప్పిన దాని ప్రకారం, 05 డిసెంబర్ 2022 న ‘BIT Mesra’ లో హోటల్ మానేజ్మెంట్ చదువుతున్న పల్లవి కుమారిని ఆమె ప్రియుడు ‘పీయూష్ తివారీ అలియాస్ పీయూష్ పాండే అలియాస్ ప్రిన్స్ కుమార్’ అనే 23 ఏళ్ల వ్యక్తి పదునైన ఆయుధంతో చంపి రైలు పట్టాల వద్ద పడేశాడు. పోలీసులు అరెస్టు చేసి ప్రశ్నించగా, అతను నేరం ఒప్పుకున్నాడు. పల్లవి పెళ్లి చేసుకోమని అడగటం వలనే అతను ఈ పని చేశాడు అని చెప్పాడు.
దీనికి సంబంధించిన FIR (133/2022), రాంచీ జిల్లా లోని Tatisilwai పోలిస్ స్టేషన్లో నమోదు అయ్యింది. FIR వివరాలను ఇక్కడ చూడవచ్చు. FIRలో నమోదయిన పేర్ల ఆధారంగా నిందితుడు ముస్లిం మతస్తుడు కాదని అర్థం అవుతుంది.
చివరిగా, ఇటీవల జార్ఖండ్‌లో పల్లవి కుమారిని హత్య చేసిన పీయూష్ తివారీ ముస్లిం మతస్తుడు కాదు.