రాష్ట్రపతి భవన్‌లో మాంసాహార విందు, మద్యం పూర్తిగా నిషేధించాలని కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు జారీ చేశారని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. పోస్ట్‌లో చేసిన దావాలోని నిజానిజాలను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
క్లెయిమ్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ లోపల మాంసాహారం మరియు మద్యం పూర్తిగా నిషేధించాలని ఆదేశించారు.
ఫాక్ట్ (నిజం): రాష్ట్రపతి భవన్‌లో మాంసాహారం, మద్యాన్ని నిషేధిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. రాష్ట్రపతి భవన్‌లో ఎలాంటి కొత్త మార్పులు చేయలేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది. కాబట్టి, పోస్ట్‌లో చేసిన దావా తప్పు
రాష్ట్రపతి భవన్‌లో మాంసాహారం, మద్యాన్ని నిషేధిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్తగా ఆదేశాలు జారీ చేశారా అని మేము తనిఖీ చేసినప్పుడు, ఈ వార్తను ధృవీకరించే వార్తా కథనాలు ఏమి మాకు కనిపించలేదు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అలాంటి ఉత్తర్వులు జారీ చేసి ఉంటే, మీడియాలో దానిపై కథనాలు తప్పకుండా వచ్చేవి. కొన్ని మీడియా రిపోర్టుల ప్రకారం, ద్రౌపది ముర్ము ఒక స్వచ్ఛమైన శాఖాహారి, ఆమె ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి కూడా తినరు.
రాష్ట్రపతి భవన్‌లో మాంసాహారం, మద్యపానంపై పూర్తి నిషేధం విధించారు అని ఈ వైరల్ పొస్ట్‌లో చేస్తున్న దావా ఫేక్ అని, రాష్ట్రపతి భవన్‌లో ఇచ్చే విందులకు సంబంధించి ఎలాంటి కొత్త మార్పులు చేయలేదని ‘పీఐబీ ఫ్యాక్ట్ చెక్’ ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది.
ఇతర దేశాల అధినేతలు లేదా ప్రముఖ వ్యక్తుల పర్యటనల సమయంలో రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేక విందులు ఏర్పాటు చేస్తారు. ఉదాహరణకు, ఫిబ్రవరి 2020లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన విందు సందర్భంగా అందించిన శాఖాహారం మరియు మాంసాహార మెనుని ఇక్కడ చూడవచ్చు.
మే 2020లో, కోవిడ్ -19 ఉపశమన చర్యల కోసం మరిన్ని వనరులను అందుబాటులో ఉంచే చర్యల్లో భాగంగా, అప్పటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, రాష్ట్రపతి భవన్‌కు ఖర్చులను తగ్గించడం, వనరులను సరైన రీతిలో వినియోగించడం వంటివి చేసి ఒక ఉదాహరణగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇలా COVID-19ని ఎదుర్కోవడానికి డబ్బును ఆదా చేసారు. వేడుకల సందర్భాలలో వినియోగ ఖర్చులను తగ్గించటం కోసం, తక్కువ మందితో కూడిన అతిథి జాబితాలను తయారుచేయటం మరియు ఆహార మెనూని వీలైనంత వరకు తగ్గించడం వంటి చర్యలు తీసుకోమని, రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్‌కు సూచించారు. కానీ రామ్ నాథ్ కోవింద్ కూడా రాష్ట్రపతి భవన్ లోపల మాంసాహారాన్ని పూర్తిగా నిషేధించాలని ఆదేశాలు జారీ చేయలేదు.
చివరగా, రాష్ట్రపతి భవన్‌లో మాంసాహారం, మద్యాన్ని నిషేధిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు.