“ఇటీవల గుజరాత్‌లోని మోర్బీ వంతెన కూలడంతో 135 మంది మరణించిన విషయం తెలిసిందే. ఆ ప్రాంతంలో ప్రధాని మోదీ పర్యటించి.. బాధితులకు నష్టపరిహారం ప్రకటించారు కూడా. అయితే, ఈ విషయంలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయట. మోదీ పర్యటన కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.30కోట్లు ఖర్చు చేసిందట. కాగా.. బాధితులకు మాత్రం ఒక్కో కుటుంబానికి రూ.4లక్షల చొప్పున.. మొత్తం రూ.5కోట్లు చెల్లించినట్లు ఆర్టీఐ ద్వారా తేలిందట” అని చెప్తూ ‘Way2News’ వారు ప్రచురించిన ఒక వార్తని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: మోర్బీ వంతెన ఘటన భాదితులకు ప్రభుత్వం కేవలం సుమారు 5 కోట్ల రూపాయిలు పరిహారం ఇస్తే, ప్రధాని మోదీ మోర్బీ పర్యటనకు మాత్రం 30 కోట్ల రూపాయిలు ఖర్చు చేసినట్టు RTI సమాధానం ద్వారా తెలిసింది.
ఫాక్ట్: ప్రధాని మోదీ మోర్బీ పర్యటనకు ప్రభుత్వం 30 కోట్ల రూపాయిలు ఖర్చు చేసినట్టు ఎటువంటి RTI సమాధానం తెలపలేదని భారత ప్రభుత్వం వారి ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’ (PIB) వివరణ ఇచ్చింది. అంతేకాదు, ఆ RTI సమాధానం గురించి గుజరాత్ సమాచార్ పత్రికలో వచ్చినట్టు కొందరు షేర్ చేయగా, అలాంటి వార్త తాము ప్రచురించలేదని గుజరాత్ సమాచార్ పత్రికకి సంబంధించిన వారు తెలిపినట్టు తెలిసింది. కావున, పోస్ట్‌లో చెప్పింది తప్పు.
పోస్ట్‌లోని చెప్పిన RTI సమాధానం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, ప్రధాని మోదీ మోర్బీ పర్యటనకు ప్రభుత్వం 30 కోట్ల రూపాయిలు ఖర్చు చేసినట్టు ఒక ఆర్టీఐ తెలిపినట్టు ఎక్కడా ఎటువంటి అధికారిక సమాచారం దొరకలేదు. అయితే, త్రిణమూల్ కాంగ్రెస్ నాయకుడు సాకేత్ గోఖలే కూడా అదే క్లెయిమ్‌తో ట్వీట్ చేయగా, ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’ వివరణ ఇస్తూ, అది ఒక ఫేక్ న్యూస్ అని, అలాంటి సమాచారం ఇస్తూ ఎటువంటి RTI సమాధానం ప్రభుత్వం ఇవ్వలేదని తెలిపింది.
సాకేత్ గోఖలే పెట్టిన ఫొటోలో ‘Dax Patel’ అనే వ్యక్తి ఒక పత్రికలో ఆ ఆర్టీఐకి సంబంధించిన ఆర్టికల్ వచ్చినట్టు ట్వీట్ చేసినట్టు చూడవచ్చు. ఆ ఆర్టికల్ ఏ పత్రికలో వచ్చిందని కొందరు ‘Dax Patel’ని అడగగా, అది ‘Gujarat Samachar’ (గుజరాత్ సమాచార్) పత్రికలో వచ్చినట్టు తెలిపాడు. అయితే, గుజరాత్ సమాచార్ పత్రికలో ఆ ఆర్టికల్ వచ్చినట్టు మాకు ఎక్కడా ఎటువంటి సమాచారం దొరకలేదు. అంతేకాదు, అలాంటి వార్త తాము ప్రచురించలేదని గుజరాత్ సమాచార్ పత్రికకి సంబంధించిన వారు ‘బూమ్ లైవ్’ సంస్థకు తెలిపారు. మోర్బీ జిల్లా కలెక్టర్ కూడా అటువంటి RTI సమాధానం తాము ఇవ్వలేదని తెలిపారు.
చివరగా, ప్రధాని మోదీ మోర్బీ పర్యటనకు ప్రభుత్వం 30 కోట్ల రూపాయిలు ఖర్చు చేసినట్టు ఎటువంటి RTI సమాధానం తెలపలేదని ‘PIB’ వివరణ ఇచ్చింది.