ఢిల్లీ పోలీసులు తామే స్వయంగా బస్సులు తగలబెడుతున్నారని, కానీ దానికి కారణం జామియా విద్యార్థులు, AAP పార్టీ అని BJP పార్టీ ఆరోపిస్తుందని క్లెయిమ్ చేస్తూ ఒక వీడియోతో కూడిన పోస్ట్ ఫేస్బుక్ లో విస్తృతంగా ప్రచారం కబడుతుంది. ఆ పోస్ట్ యొక్క క్లెయిమ్ లో ఎంతవరకు నిజం ఉందో పరిశీలిద్దాం.
క్లెయిమ్: ఢిల్లీ పోలీసులు ఒక బస్సుని తగలబడుతున్న వీడియో.
ఫాక్ట్ (నిజం): ఆ వీడియోలో ఉన్న పోలీసులు బస్సుకి అంటుకున్న మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. అంతేకాక, అదే బస్సుని మరుసటి రోజు ప్రసారం అయిన ఒక వీడియోలో చూసినప్పుడు ఆ వైరల్ వీడియోలో కనిపించినప్పుడు ఉన్న స్థితి లోనే ఉంది. కావున, పోస్ట్ లోని క్లెయిమ్ అబద్ధం.
పోస్టు లోని వీడియోని గమనిస్తే, ఒక పక్కన పోలీసులు మంటను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారని, మరొక పక్కన బస్సు పైన ఏదో పోస్తున్నారని అర్ధం అవుతుంది. కానీ, ఏం పోస్తున్నారనేది ఆ వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు. దీన్ని తప్పుగా అర్ధం చేసుకుని కొంతమంది సోషల్ మీడియాలో పోలీసులే పెట్రోల్ పోసి బస్సుకి నిప్పటించారని పోస్ట్ లు పెడుతున్నారు.
ఆ వీడియోలో చూపించిన దాని ప్రకారం ఆ బస్సు నెంబర్ ‘DL 1PD 0299’ అని తెలుస్తుంది. పోస్టులో క్లెయిమ్ చేసినట్టు నిజంగా పోలీసులు ఆ బస్సు ని తగలబెట్టి ఉంటే ఆ బస్సు మొత్తం కాలిపోయి ఉండేది, కానీ ‘India TV’ వారు డిసెంబర్ 16, 2019న ప్రసారం చేసిన ఒక వీడియోలో అదే బస్సు ఆ వైరల్ వీడియోలో కనిపించినప్పుడు ఉన్న స్థితిలో లాగానే వుంది. దీని బట్టి పోలీసులు ఆ బస్సు మీద పెట్రోల్ పోసి తగలబెట్టలేదని అర్ధం అవుతుంది. రాహుల్ అనే జర్నలిస్ట్ కూడా ఆ బస్సు సురక్షితంగానే డిపోలో ఉందని ఆ బస్సు ఫోటోలని ట్వీట్ చేయడం ఇక్కడ చూడవచ్చు.
పోలీసు అధికారులు చిన్మయ్ బిస్వాల్ (DCP సౌత్-ఈస్ట్ ఢిల్లీ), మన్దీప్ రంధవా ( ఢిల్లీ పోలీస్ PRO) మీడియాతో మాట్లాడుతూ పోలీసులు కేవలం బస్సు మంటలు ఆర్పుతున్నారని స్పష్టం చేస్తూ, ప్రజలు ఎవరు ఇలాంటి పుకార్లు వ్యాప్తి చేయొద్దని కోరుకున్నారు.
ఇదే విషయం ఫేక్ అని చెప్తూ బర్ఖా దత్ అనే ఒక జర్నలిస్ట్ ఇంకో వీడియో ట్వీట్ చేసింది. మోజో స్టోరీ చేసిన ఈ వీడియోలో ఆ సంఘటన జరిగినప్పుడు ఉన్న ప్రజలు చెప్పిన సమాచారం కూడా చూడొచ్చు.
చివరగా, ఆ వీడియోలో ఢిల్లీ పోలీసులు బస్సుని తగలబెట్టడం లేదు, దానికి అంటుకున్న మంటలు ఆర్పుతున్నారు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
Pingback: వీడియో లో ఢిల్లీ పోలీసులు బస్సుని తగలబెట్టడం లేదు - Fact Checking Tools | Factbase.us