Fake News, Telugu
 

ఫోటోషాప్ ద్వారా సృష్టించిన అస్థిపంజరం ఫోటోని చూపిస్తూ 80 అడుగుల ఘటోత్కచుడి అస్థిపంజరమంటూ షేర్ చేస్తున్నారు

0

విదేశీ పురావస్తు నిపుణులు కురుక్షేత్ర నగర సమీపంలో త్రవ్వినప్పుడు 80 అడుగుల ఎత్తైన మానవ అస్థిపంజరం భయటపడిందని, అది భీముడి కుమారుడైన ఘటోత్కచుడి అస్థిపంజరమంటూ షేర్ చేస్తున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 80 అడుగుల ఘటోత్కచుడి అస్థిపంజరం కురుక్షేత్ర నగర సమీపంలో బయటపడింది.

ఫాక్ట్ (నిజం): పోస్టులో చూపిస్తున్నది నిజమైన అస్థిపంజరం కాదు. డిజిటల్ ఫోటోషాప్ ద్వారా సృష్టించబడిన అస్థిపంజరం. ‘Size matters 4’ అనే ప్రాజెక్ట్ కొరకు ‘Whitmath57’ అనే అమెరికాకి చెందిన గ్రాఫిక్ డిజైనర్ ఈ ఫోటోను సృష్టించి ‘DesignCrowd’ వెబ్సైటులో పోస్ట్ చేసినట్టు విశ్లేషణలో తెలిసింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులోని ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అదే ఫోటో ‘DesignCrowd’ అనే వెబ్సైటులో దొరికింది. ఈ ‘DesignCrowd’ వెబ్సైటు వారు, ప్రతిభ ఉన్న డిజైనర్లని ప్రోత్సహించడానికి కమ్యూనిటీ పోటీలు నిర్వహిస్తుంటారు. అలాగే, వారికి ప్రాజెక్ట్స్ ఇస్తుంటారు. ‘Size matters 4’ అనే ప్రాజెక్ట్ కొరకు ‘Whitmath57’ అనే అమెరికాకి చెందిన గ్రాఫిక్ డిజైనర్ ఈ అస్థిపంజరం ఫోటోను సృష్టించి ‘DesignCrowd’ వెబ్సైటులో పోస్ట్ చేసారు. ఈ ఫోటోను ఆ డిజైనర్  ‘14 August 2011’ నాడు ఈ వెబ్సైటులో పోస్ట్ చేసినట్టు అందులో తెలిపారు. ఇదే ఫోటో ‘DesignCrowd’ వెబ్సైటులోని ‘Whitmath57’ అధికార పోర్ట్ ఫోలియోలో లభించింది.

భీముడి కొడుకైన ఘటోత్కచుడు, కౌరవులు పాండవుల మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో మరణించినట్టు ‘మహాభారత’ ఇతిహాసంలో తెలిపారు. ఫోటోషాప్ వాడి సృష్టించబడిన ఈ ఫోటోలోని అస్థిపంజరం ఘటోత్కచుడిది కాదు.

చివరగా, ఫోటోషాప్ ద్వారా సృష్టించబడిన అస్థిపంజరం ఫోటోని చూపిస్తూ 80 అడుగుల ఘటోత్కచుడి అస్థిపంజరమంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll