Fake News, Telugu
 

ఈ ఫోటో 2018లో జరిగిన రైతుల నిరసనలకు సంబంధించింది, ఇప్పటిది కాదు

0

పోలీసులు ఆందోళనకారులపై భాష్ప వాయువు (టియర్ గ్యాస్) ప్రయోగిస్తున్న ఫోటో చూపిస్తూ, ఈ ఘటన ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు తెలుపుతున్న నిరసనల సందర్భంగా జరిగిందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన తెలుపుతున్న రైతులపై పోలీసులు భాష్ప వాయువు ప్రయోగించిన ఫోటో.

ఫాక్ట్ (నిజం): ఈ ఫోటో 2018లో వ్యవసాయ రుణాల మాఫీ, కనీస మద్దతు ధర, పెరుగుతున్న ఇంధన ధరలు, స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు మొదలైన పలు డిమాండ్స్ తో భారతీయ కిసాన్ యూనియన్ నేతృత్వంలో రైతులు హరిద్వార్ నుండి ఢిల్లీకి కిసాన్ క్రాంతి మార్చ్ నిర్వహించినపుడు వారిని పోలీసులు ఉత్తరప్రదేశ్-ఢిల్లీ బోర్డర్ లో అడ్డుకునే క్రమంలో వారిపై భాష్ప వాయువు, వాటర్ కానన్స్ ప్రయోగించినప్పుడు తీసింది, ఈ ఫోటోకి ఇప్పుడు జరుగుతున్న రైతుల నిరసనలకి ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులోని ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోని ప్రచురించిన ఒక 2018 వార్తా కథనం మాకు కనిపించింది. ఈ కథనం ప్రకారం ఈ ఘటన 2018లో ఉత్తరప్రదేశ్-ఢిల్లీ బోర్డర్ లో రైతుల నిరసనలను పోలీసులు అడ్డుకుంటున్న సందర్భంలో జరిగింది.

ఈ వార్తా కథనం ఆధారంగా గూగుల్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా 2018లో ఈ రైతుల నిరసనలకు సంబంధించిన మరిన్ని వార్తా కథనాలు మరియు న్యూస్ వీడియోలు మాకు కనిపించాయి. ఈ కథనాల ప్రకారం 2018లో వ్యవసాయ రుణాల మాఫీ, కనీస మద్దతు ధర, పెరుగుతున్న ఇంధన ధరలు, స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు మొదలైన పలు డిమాండ్స్ తో భారతీయ కిసాన్ యూనియన్ నేతృత్వంలో రైతులు హరిద్వార్ నుండి ఢిల్లీకి కిసాన్ క్రాంతి మార్చ్ నిర్వహించారు. ఐతే వీరిని ఉత్తరప్రదేశ్-ఢిల్లీ బోర్డర్ లో పోలీసులు అడ్డుకునే క్రమంలో వారిపై భాష్ప వాయువు, వాటర్ కానన్స్ ప్రయోగించారు, పోస్టులోని ఫోటో ఈ సందర్భంలో తీసిందే. ఈ నిరసనలకు సంబంధించిన మరికొన్ని వార్తా కథనాలు మరియు న్యూస్ వీడియోలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. వీటన్నిటి ఆధారంగా ఈ ఫోటో ఇప్పుడు జరుగుతున్న రైతుల నిరసనలకు సంబంధించింది కాదని కచ్చితంగా చెప్పొచ్చు.

కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహిస్తున్న ఆందోళనల నేపథ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే పోస్టులు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

చివరగా, ఈ ఫోటో 2018లో జరిగిన రైతుల నిరసనలకు సంబంధించింది, ఇప్పటిది కాదు.

Share.

About Author

Comments are closed.

scroll