Fake News, Telugu
 

వర్షం నీళ్ళలో కొందరు సరదాగా జారుకుంటూ వెళ్తున్న ఈ వీడియో కరాచీ (పాకిస్తాన్) లో తీసినది

0

13 అక్టోబర్ 2020 న హైదరబాద్ లో భారీ వర్షం పడి, చాలా చోట్ల రోడ్ల పైకి నీళ్ళు వచ్చాయి. వాటికి సంబంధించిన వీడియోలని చెప్తూ చాలా వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వాటిల్లో కొన్ని నిజమైనవి ఉంటే, మరికొన్ని తాజాగా హైదరాబాద్ లో పడిన భారీ వర్షానికి సంబంధించినవి కావు. ‘హైదరాబద్ లో సముద్రం లేదు అని బాధ పడ్డా, ఇప్పుడు ఆ బాధ లేదు’ అని చెప్తూ, వర్షం నీళ్ళలో కొందరు సరదాగా జారుకుంటూ వెళ్తున్న వీడియోని చాలా మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ వీడియో హైదరబాద్ కి సంబంధించిందో లేదో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: హైదరాబాద్ లో వర్షం నీళ్ళలో కొందరు సరదాగా జారుకుంటూ వెళ్తున్న వీడియో.

ఫాక్ట్: అది పాకిస్తాన్ లోని కరాచీ లో తీసిన పాత వీడియో. ఆ వీడియోకీ, తాజాగా హైదరాబాద్ లో పడిన భారీ వర్షాలకి ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, కొన్ని వీడియోలు సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. ఆ వీడియోని కొందరు ఆగస్టు 2020 లోనే పోస్ట్ చేసినట్టు ఇక్కడ , ఇక్కడ చూడవొచ్చు. కాబట్టి, అది తాజాగా హైదరాబాద్ లో పడిన భారీ వర్షాలకి సంబంధించిన వీడియో కాదు. అంతేకాదు, కొందరు ఆ వీడియో కరాచీ (పాకిస్తాన్) కి సంబంధించిన వీడియో అని పోస్ట్ చేసారు.

వీడియోలో వెనకాల ఉన్న ఆటో పాకిస్తాన్ కి చెందిన ‘సజ్గర్’ కంపెనీ వారు తాయారు చేసే ఆటో లానే ఉన్నట్టు కింద ఫోటోలో చూడవొచ్చు.

అంతేకాదు, ఒకరు అదే వీడియోని పోస్ట్ చేసి, కరాచీ లోని తారిక్ రోడ్డు లో ఆ వీడియోని తీసినట్టు రాసారు. తారిక్ రోడ్డు కి సంబంధించిన ఒక వీడియోలో, పోస్ట్ లోని వీడియోలో మొదట్లో కనిపించిన బిల్డింగ్స్ ని చూడవొచ్చు. కావున, వీడియో కరాచీ (పాకిస్తాన్) కి సంబంధించినదని కచ్చితంగా చెప్పవొచ్చు.

చివరగా, వర్షం నీళ్ళలో కొందరు సరదాగా జారుకుంటూ వెళ్తున్న వీడియో కరాచీ (పాకిస్తాన్) లో తీసినది. ఆ వీడియోకీ, తాజాగా హైదరాబాద్ లో పడిన భారీ వర్షాలకి ఎటువంటి సంబంధంలేదు.

Share.

About Author

Comments are closed.

scroll