Fake News, Telugu
 

‘మా టార్గెట్ హిందువులేనంటూ బహిరంగంగా ప్రకటించిన పాకిస్తాన్’ అని CVR న్యూస్ ప్రచురించిన వార్త తప్పు

1

హిందువులే తమ టార్గెట్ అని పాకిస్తాన్ బహిరంగంగా ప్రకటించినట్టు ఉన్న ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : మా టార్గెట్ హిందువులేనంటూ బహిరంగంగా ప్రకటించిన పాకిస్తాన్.

ఫాక్ట్ (నిజం): హిందువులే తమ టార్గెట్ అంటూ పాకిస్తాన్ బహిరంగంగా ప్రకటించినట్టు ఎక్కడా కూడా సమాచారం లేదు. CVR న్యూస్ వారు పెట్టిన వీడియో లో కూడా పాకిస్తాన్ ఎక్కడ మరియు ఎప్పుడు అలా ప్రకటించిందో ఎటువంటి సమాచారం లేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.   

పాకిస్తాన్ లో మైనారిటీలపై, ముఖ్యంగా హిందువులపై అనేక దాడులు జరుగుతున్నట్టు దాదాపు అన్ని వార్త సంస్థలు ప్రచురించాయి. అంతే కాదు, పాకిస్తాన్ దేశ మానవ హక్కుల కమిషన్ కూడా తమ 2017 వార్షిక రిపోర్ట్ లో మైనారిటీలు, మరీ ముఖ్యంగా హిందువులు పాకిస్తాన్ లో ఇప్పటికి మాయమవుతున్నారని, అక్రమంగా చంపివేయబడుతున్నారని పేర్కొంది. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం బహిరంగంగా ఇలా ప్రకటించిందో లేదో చూద్దాం.

పోస్ట్ లోని విషయం గురించి గూగుల్ లో ‘Pakistan says Hindus are their targets’ అని వెతకగా, హిందువులే తమ టార్గెట్ అని పాకిస్తాన్ బహిరంగంగా ప్రకటించినట్టు ఎటువంటి సమాచారం దొరకలేదు. కేవలం, CVR న్యూస్ వారు మాత్రమే ఈ వార్తను ప్రచురించినట్టుగా తెలుస్తుంది. వారి యూట్యూబ్ ఛానల్ లో ఈ విషయం పై పెట్టిన ఒక వీడియోని చూడవచ్చు. ఆ వీడియో ( ఆర్కైవ్డ్ వెర్షన్) నుండే పోస్ట్ లో పెట్టిన ఫోటో తీసుకోబడింది. అయితే, ఆ వీడియో టైటిల్ లో ‘మా టార్గెట్ హిందువులే..పాకిస్తాన్ సంచలన ప్రకటన’ అని రాసివున్నా, వీడియోలో మాత్రం ఎక్కడ కూడా పాకిస్తాన్ ఎపుడు మరియు ఎక్కడ అలా ప్రకటించిందో చెప్పలేదు. కేవలం పాకిస్తాన్ లో తాజాగా హిందూ టీచర్ మరియు ఒక గుడి పై జరిగిన దాడి గురించి చెప్పినట్టు చూడవచ్చు. ఈ విషయం గురించి CVR న్యూస్ వారికి FACTLY ఫోన్ చేసి మాట్లాడగా, ఆ వార్త ఎక్కడ నుండి వచ్చిందో తెలుసుకొని చెప్తామని అన్నారు. వారు వివరణ ఇచ్చాక ఈ ఆర్టికల్ అప్డేట్ చేయబడుతుంది.

పాకిస్తాన్ లో హిందూ టీచర్ మరియు గుడి మీద జరిగిన దాడి పై ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ తను ఐక్యరాజ్యసమితి లో స్పీచ్ ఇవ్వనున్న సమయంలో కావాలని కొందరు కుట్ర చేసారని చెప్పినట్టు ‘టైమ్స్ అఫ్ ఇండియా’ ఆర్టికల్ లో చదవచ్చు. అంతే కాదు, పాకిస్తాన్ లోని  ప్రజలందరికి తమ రాజ్యాంగం మరియు ఇస్లాం సమాన ప్రాముఖ్యత ఇస్తుందని తెలిపాడు. ‘రిపబ్లిక్ టీవీ’ కూడా ‘Pak Targets Minorities’ అంటూ ఒక వీడియో యూట్యూబ్ లో పోస్ట్ చేసినా, హిందువులే తమ టార్గెట్ అంటూ పాకిస్తాన్ బహిరంగంగా ప్రకటించినట్టు ఎక్కడా కూడా ప్రచురించలేదు.

చివరగా, పాకిస్తాన్ లో హిందువుల పై దాడులు నిజమైనప్పటికీ, మా టార్గెట్ హిందువులేనంటూ పాకిస్తాన్ బహిరంగంగా ప్రకటించలేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll