ప్రస్తుతం (నవంబర్ 14 –18 మధ్య తేదీల్లో) దుబాయ్లో ఎయిర్ షో జరుగుతూ ఉంది. ఈ షోలో భారత్ తరపున దేశీయంగా తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ని ప్రదర్శించారు. ఐతే ఈ నేపథ్యంలో ఒక యుద్ద విమానం ఫోటోని తేజస్ది అంటూ షేర్ చేస్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా దానికి సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: దుబాయ్ ఎయిర్ షోలో భారత వైమానిక దళం ప్రదర్శించిన తేజస్ యుద్ధ విమానం ఫోటో.
ఫాక్ట్ (నిజం): 14 నవంబర్ 2021న యూఏఈలోని అల్ మక్తూమ్ విమానాశ్రయంలో దుబాయ్ ఎయిర్ షో ప్రారంభమైంది. షో మొదటిరోజు భారత వైమానిక దళం తరపున తేజస్ యుద్ధవిమానం, సారంగ్ హెలికాప్టర్లను ప్రదర్శించారు. ఐతే వైరల్ అవుతున్న ఫోటో తేజస్ది కాదు. ఆ ఫోటో 2019లో పారిస్లో జరిగిన ఎయిర్ షోలో ప్రదర్శించిన పాకిస్తాన్ వైమానిక దళం యొక్క JF-17 థండర్ యుద్ద విమానానిది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఇటీవల 14 నవంబర్ 2021న యూఏఈలోని అల్ మక్తూమ్ విమానాశ్రయంలో దుబాయ్ ఎయిర్ షో ప్రారంభమైంది. ఈ సంవత్సరం షోలో ఇరవైకి పైగా దేశాలు పెవిలియన్లను ఏర్పాటు చేయడంతో పాటు, 160కి పైగా వాణిజ్య, సైనిక మరియు ప్రైవేట్ జెట్ల యొక్క విమాన ప్రదర్శన జరగబోతుంది.
ఈ షోలో భారత వైమానిక దళం తరపున తేజస్ యుద్ధవిమానం, సారంగ్ హెలికాప్టర్లను మొదటి రోజున ప్రదర్శించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్సు అధికారిక ట్విట్టర్ ఎకౌంటులో ఈ ప్రదర్శనకి సంబంధించిన ఫోటోలు షేర్ చేసింది. అలాగే వార్తా సంస్థలు భారత యుద్ధవిమానాల విన్యాసాల వీడియోలను కూడా ప్రచురించాయి.
ఐతే పోస్టులో షేర్ చేసింది భారత్కు చెందిన తేజస్ యుద్ధవిమానం ఫోటో కాదు. ఆ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోని 2019లో ప్రచురించిన పలు పాకిస్తాన్ వార్తా కథనాలు మాకు కనిపించాయి. ఈ కథనాల ప్రకారం ఆ ఫోటో 2019లో పారిస్లో జరిగిన ఎయిర్ షోలో ప్రదర్శించిన పాకిస్తాన్ వైమానిక దళం యొక్క JF-17 థండర్ యుద్ద విమానానిది. ఇదే విషయం చెప్తున్న మరొక వార్తా కథనం ఇక్కడ చూడొచ్చు.

పైగా పోస్టులో షేర్ చేసిన యుద్ద విమానంపై పాకిస్తాన్ జెండా స్పష్టంగా కనిపిస్తుంది. దీన్నిబట్టి ప్రస్తుతం జరుగుతున్న దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ని ప్రదర్శించినప్పటికీ షేర్ చేస్తున్న ఫోటో తేజస్ యుద్ధ విమానానిది కాదని స్పష్టమవుతుంది.

చివరగా, 2019లో పారిస్లో జరిగిన ఎయిర్ షోలో ప్రదర్శించిన పాకిస్తాన్ యుద్ద విమానం JF-17 థండర్ ఫోటోని తేజస్ యుద్ధ విమానం అంటూ షేర్ చేస్తున్నారు.