Fake News, Telugu
 

ఉత్తరప్రదేశ్ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో 2000లోపు ఓట్ల మెజారిటీతో బీజేపీ కూటమి గెలిచిన స్థానాలు కేవలం 18 మాత్రమే

0

ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 86 స్థానాల్లో బీజేపీ కూటమి కేవలం 2 వేల లోపు ఓట్ల మెజారిటీతో గెలిచిందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పైగా ఈ 86లో, 49 స్థానాల్లో కేవలం 1000 ఓట్ల తేడాతో గెలవగా, 23 స్థానాల్లో 500 లోపు, అలాగే 7 స్థానాల్లో 200లోపు ఓట్ల మెజారిటీతో గెలిచిందని కూడా పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా పోస్టులో చేస్తున్న క్లెయిమ్‌లకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 86 స్థానాల్లో బీజేపీ కూటమి కేవలం 2 వేల లోపు ఓట్ల మెజారిటీతో గెలిచింది.

ఫాక్ట్ (నిజం): ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 స్థానాలకు గాను అభ్యర్థులు 2000లోపు ఓట్ల తేడాతో గెలిచిన స్థానాలు కేవలం 29 మాత్రమే, 86 స్థానాలు కాదు. 200లోపు ఓట్ల మెజారిటీతో అభ్యర్థులు గెలిచిన స్థానాలు ఒక్కటి కూడా లేవు. 500 కంటే తక్కువ ఓట్ల మెజారిటీతో అభ్యర్ధులు గెలిచిన స్థానాలు 11 కాగా, 4 స్థానాల్లో 500-1000 మధ్య ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక 14 స్థానాలలో అభ్యర్థులు 1000-2000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఒకవేళ ఈ స్థానాలలో బీజేపీ ఓడిపోయినా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజారిటీ దానికి సొంతంగానే ఉంటుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఇటీవల విడుదలైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బీజేపీ 255 స్థానాలలో గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. మిత్రపక్ష పార్టీలు గెలిచిన స్థానాలను కలుపుకొని బీజేపీ కూటమి మొత్తం మీద 273 స్థానాల్లో గెలిచింది. 111 ఎస్పీ అభ్యర్థులు గెలుపొందగా, మిత్రపక్షాలతో కలిపి ఎస్పీ కూటమి మొత్తం మీద 125 సీట్లు గెలుచుకుంది.

ఐతే ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా ప్రకారం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 స్థానాలకు గాను అభ్యర్థులు 2000లోపు ఓట్ల తేడాతో గెలిచిన స్థానాలు కేవలం 29 మాత్రమే, పోస్టులు చేస్తున్న 86 స్థానాలన్న వాదన తప్పు.

ఈ 29 స్థానాల్లో కూడా 500 కంటే తక్కువ ఓట్ల మెజారిటీతో అభ్యర్ధులు గెలిచిన స్థానాలు 11 కాగా, 4 స్థానాల్లో 500-1000 మధ్య ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక 14 స్థానాలలో అభ్యర్థులు 1000-2000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ 29 నియోజకవర్గాలు మరియు మెజారిటీ వివరాలు కింది చార్ట్‌లో చూడొచ్చు.

ఐతే పోస్టులో క్లెయిమ్ చేస్తున్నదానికి విరుద్దంగా ఉత్తరప్రదేశ్‌లో 200లోపు ఓట్ల మెజారిటీతో అభ్యర్థులు గెలిచిన స్థానాలు ఒక్కటి కూడా లేవు. ఇకపోతే ఉత్తరప్రదేశ్‌లో ఈ ఎన్నికల్లో 2000-5000 మధ్య ఓట్ల మెజారిటీతో అభ్యర్థులు గెలిచిన స్థానాలు 24 ఉన్నాయి.

అంటే మొత్తం మీద 5000లోపు ఓట్ల మెజారిటీతో గెలిచిన స్థానాలు మొత్తం 53 కాగా, ఇందులో బీజేపీ మరియు దాని మిత్రపక్ష పార్టీల అభ్యర్థులుగెలిచిన స్థానాలు మొత్తం 31, 21 స్థానాల్లో ఎస్పీ గెలుపొందగా, మిగిలిన ఒక స్థానంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2000 ఓట్ల కంటే తక్కువ మెజారిటీతో ఫలితం వచ్చిన 29 స్థానాల్లో, బీజేపీ కూటమి 18 స్థానాల్లో గెలిచింది, ఎస్పీ కూటమి 10 స్థానాల్లో గెలవగా, మిగిలిన ఒక స్థానం కాంగ్రెస్ గెలిచింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ 53 స్థానాలలో బీజేపీ మరియు దాని మిత్రపక్షాలు గెలిచిన 31 స్థానాల్లో ఒకవేళ ఎస్పీ కూటమి అభ్యర్థులు గెలిచినా కూడా ఎస్పీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన సీట్ల కన్నా చాలా వెనకబడి ఉండేది. అలాగే ఈ 31 స్థానల్లో ఓడిపోయినా కూడా బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజారిటీ దానికి ఉంటుంది. కాబట్టి పోస్టులో చెప్తునట్టు ఈ స్థానాలలో బీజేపీ ఓడిపోయి ఉంటే ఎస్పీ కూటమి అధికారంలోకి వచ్చేదన్న వాదన తప్పని రుజువు అవుతుంది.

పలు ప్రధాన మీడియా సంస్థలు ఇలాంటి కథనాలను ప్రచురించడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.

చివరగా, ఉత్తరప్రదేశ్ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో 2000లోపు ఓట్ల మెజారిటీతో బీజేపీ మరియు దాని మిత్రపక్షాలు గెలిచిన స్థానాలు కేవలం 18 మాత్రమే, 86 కాదు.

Share.

About Author

Comments are closed.

scroll