Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

వేరే దేశానికి చెందిన పాత వీడియోని పెట్టి, ‘కొరోనా వ్యాప్తి చేయడానికి ముస్లిం హోటళ్లలో హిందువులు తినే ఆహారం లో ఉమ్మేసి ప్యాక్ చేస్తున్నారు’ అని షేర్ చేస్తున్నారు

0

ముస్లిం షాపులలో హోటళ్లలో కొనకూడదు ఎందుకంటే ఈ వీడియో చూడండి హిందువులు కొనేటటువంటి పదార్థాలలో వాడు ఉమ్మి వేసి మరీ ప్యాకింగ్ చేస్తున్నాడు’ అంటూ ఒక వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఇండియాలో కొరోనా వ్యాప్తి చేయడానికి వీడియోలోని వ్యక్తి అలా చేస్తున్నట్టు కొందరు పోస్ట్ (ఆర్కైవ్డ్) చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కొరోనా వైరస్ ని వ్యాప్తి చేయడానికి ముస్లిం హోటళ్లలో ఆహరంలో ఉమ్మేసి ప్యాకింగ్ చేస్తున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): అది ఒక పాత వీడియో. ఏప్రిల్ 2019 నుండి ఆ వీడియోని ఇంటర్నెట్ లో షేర్ చేస్తున్నట్టు చూడవొచ్చు. అంతేకాదు, ఆ వీడియో ఇండియాకి సంబంధించింది కాదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్టులోని వీడియో యొక్క స్క్రీన్ షాట్ లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ఆ వీడియో గత సంవత్సరం ఏప్రిల్ నుండి సోషల్ మీడియా లో ఉన్నట్లుగా తెలిసింది. 26 ఏప్రిల్ 2019 న ‘We are Malaysians’ అనే ఫేస్బుక్ పేజీ ఆ వీడియో ని ‘Secret Recipe… to keep papadum fresh always..Turns out this is the secret recipe to stay fresh forever’ అనే వాక్యాలతో పోస్టు చేసింది. ఆ వీడియో గురించి మరే ఇతర సమాచరం అందులో లేదు.

పోస్టు చేసిన వీడియో లో ఫుడ్ డెలివరీ సంస్థ ‘foodpanda’ లోగో ‘పింక్’ కలర్ లో ఉన్నట్లుగా చూడవచ్చు. కానీ, ఇండియా లో ఆ సంస్థ లోగో ‘ఆరెంజ్’ కలర్ లో ఉంటుంది. కావున, వీడియో ఇండియాకి సంబంధించినది కాదు. సోషల్ మీడియా లో చాలా మంది ఆ వీడియో మలేషియా దేశానికి సంబంధించినదంటూ పేర్కొంటున్నారు కానీ అందుకు సంబంధించిన కచ్చితమైన సమాచారమేమీ లభించలేదు. మలేషియా లో ‘foodpanda’ లోగో ‘పింక్’ కలర్ లో ఉన్నట్టు వారి వెబ్సైటులో చూడవొచ్చు.

చివరగా, పాత వీడియోని పెట్టి, ‘కొరోనా వ్యాప్తి చేయడానికి ముస్లిం హోటళ్లలో హిందువులు తినే ఆహారం లో ఉమ్మేసి ప్యాక్ చేస్తున్నారు’ అని షేర్ చేస్తున్నారు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll