Fake News, Telugu
 

తెలంగాణ ప్రభుత్వం కేవలం ఇమామ్‌లకే కాకుండా హిందూ అర్చకులకు కూడా గౌరవభృతిని ఇస్తోంది

0

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల గౌరవ వేతనం పొందే ఇమామ్‌లు, మౌజమ్‌ల లబ్ధిదారుల సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో సోషల్ మీడియాలో ఈ అంశానికి సంబంధించి పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మసీదుల్లో పని చేసే ఇమామ్ & మౌజమ్‌ల వేతనాలు 9995 నుండి 17000లకు పెంచిందని ఒక వార్త, తెలంగాణ ప్రభుత్వం కేవలం ఇమామ్‌లకు మాత్రమే వేతనం ఇస్తుంది, హిందూ అర్చకులకు ఇవ్వడం లేదని అర్ధం వచ్చేలా మరో వార్త సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఐతే ఈ కథనం ద్వారా ఆ అంశానికి సంబంధించి నిజమేంటో  చూద్దాం.

క్లెయిమ్: తెలంగాణ ప్రభుత్వం మసీదుల్లో పని చేసే ఇమామ్ & మౌజమ్‌ల వేతనాలు 9995 నుండి 17000లకు పెంచింది; తెలంగాణ ప్రభుత్వం కేవలం ఇమామ్‌లకు మాత్రమే వేతనం ఇస్తుంది, హిందూ అర్చకులకు ఇవ్వడం లేదు.

ఫాక్ట్(నిజం):  తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వులు కేవలం ఇమామ్‌లు, మౌజంలకు గౌరవ వేతనం అందించడానికి సంబంధించిన లబ్ధిదారుల సంఖ్యకి సంబంధించిందే తప్ప, వారికి ఇప్పుడు ఇస్తున్న వేతనాన్ని పెంచేందుకు కాదు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 9,995 మంది ఇమామ్‌లు/మౌజంలకు నెలకు రూ. 5 వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తుండగా, ప్రస్తుత ఉత్తర్వుల ద్వారా మరో 7,005 మందికి వేతనాన్ని అందించనుంది. కొత్తగా జతచేసిన వారితో కలిపి రాష్ట్రవ్యాప్తంగా గౌరవ వేతనం పొందే ఇమామ్‌లు, మౌజంల సంఖ్య 17 వేలకు చేరుకుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం కేవలం ఇమామ్‌లకే కాకుండా హిందూ అర్చకులకు కూడా గౌరవభృతిని అందిస్తుంది. ఈమధ్యనే ఆలయాల్లోని అర్చకులకు చెల్లించే మొత్తాన్ని నెలకు 6,000 నుండి 10,000కు పెంచుతున్నట్టు కూడా ప్రకటించింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో మరో 7,005 మంది ఇమామ్‌లు, మౌజంలకు గౌరవ వేతనం ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఐతే ఈ ఉత్తర్వులు కేవలం ఇమామ్‌లు, మౌజంలకు గౌరవ వేతనం పొందే లబ్ధిదారుల సంఖ్యకి సంబంధించిందే తప్ప, వారికి ఇప్పుడు ఇస్తున్న వేతనాన్ని పెంచేందుకు కాదు.

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 9,995 మంది ఇమామ్‌లు/మౌజంలకు నెలకు రూ. 5 వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తుండగా, ప్రస్తుత ఉత్తర్వుల ద్వారా మరో 7,005 మందికి వేతనాన్ని అందించనుంది. కొత్తగా జతచేసిన వారితో కలిపి రాష్ట్రవ్యాప్తంగా గౌరవ వేతనం పొందే ఇమామ్‌లు, మౌజంల సంఖ్య 17 వేలకు చేరుకుంది. ఐతే వీరికి అందిస్తున్న వేతనంలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఈ సమాచారాన్ని బట్టి గౌరవ వేతనం పొందే ఇమామ్‌లు/మౌజంల సంఖ్యను తప్పుగా అర్ధం చేసుకొని ఉండొచ్చని స్పష్టమవుతుంది.

ఇతర మాతలకు కూడా గౌరవ వేతనాలు అందిస్తుంది:

ఇకపోతే పోస్టులో చేస్తున్న ఆరోపణలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం కేవలం ఇమామ్‌లకు మాత్రమే కాకుండా హిందూ అర్చకులకు కూడా ఎప్పటినుండో గౌరవ వేతనాలు అందిస్తూ వస్తుంది (ఇక్కడ మరియు ఇక్కడ). తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ ధూప దీప నైవేద్య పథకం కింద ఎన్నిక చేయబడిన ఆలయములలో ధూపదీప నైవేద్యము కొరకు నెలకు రూ. 2,000 మరియు అర్చకుని గౌరవ భృతి కింద రూ.4,000 చెల్లిస్తుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇక్కడ చూడొచ్చు.

ఈ సంవత్సరం మే నెలలో ఈ పథకం కింద అదనంగా 3,796 దేవాలయాలకు ధూపదీప నైవేద్యము కొరకు డబ్బులు అందించనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అలాగే ఈ పథకం కింద ప్రభుత్వం ఈ ఆలయాల్లోని అర్చకులకు చెల్లించే మొత్తాన్ని నెలకు 6,000 నుండి 10,000కు పెంచుతున్నట్టు కూడా ప్రకటించాడు. ప్రభుత్వం వివిధ మతాల అభ్యున్నతి అమలు చేస్తున్న పథకాలకు సంబంధించిన సమాచారం ఇక్కడ చూడొచ్చు.

చివరగా, తెలంగాణ ప్రభుత్వం కేవలం ఇమామ్‌లకే కాకుండా హిందూ అర్చకులకు కూడా గౌరవభృతిని అందిస్తుంది.

Share.

About Author

Comments are closed.

scroll