Fake News, Telugu
 

వరద నీటిలో మునిగిపోయిన మాయాపూర్ ఇస్కాన్ మందిరం పాత వీడియోని తిరుపతి ఇస్కాన్ మందిరానికి ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు

0

తిరుపతి ఇస్కాన్ మందిరం వరద నీటితో నిండిపోయిన దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. వరద నీటితో నిండిపోయి ఉన్న ఒక మందిరంలో భక్తులు ప్రార్ధన చేస్తున్న దృశ్యాలని మనం ఈ వీడియోలో చూడవచ్చు. తిరుపతిలో ఇటీవల భారీ వర్షాలతో నగరంలో వరదలు చోటుచేసుకున్న నేపథ్యంలో, ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: తిరుపతి ఇస్కాన్ మందిరం వరద నీటితో నిండిపోయిన దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలో కనిపిస్తున్నది పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మాయాపూర్‌లోని ఇస్కాన్ మందిరం, తిరుపతి ఇస్కాన్ మందిరం కాదు. 2015లో వరద నీటిలో మునిగిపోయిన మాయాపూర్ ఇస్కాన్ మందిరంలో భక్తులు ప్రార్ధన చేస్తున్న దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. పోస్టులో షేర్ చేసిన వీడియోకి తిరుపతి వరదలకి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.    

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ఒక యూట్యూబ్ ఛానల్ 11 ఆగష్టు 2015 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. 2015లో మాయాపూర్‌లోని ఇస్కాన్ మందిరం వరద నీటిలో నిండిపోయిన దృశ్యాలని ఈ వీడియోలో తెలిపారు. పోస్టులో షేర్ చేసిన అవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Hare Krsna TV’ యూట్యూబ్ ఛానల్ 04 ఆగష్టు 2015 నాడు పబ్లిష్ చేసింది. వరద నీటిలో మునిగిపోయిన మాయాపూర్ ఇస్కాన్ మందిరంలో భక్తులు ఆహ్లాదంగా ఆడుకుంటున్న దృశ్యాలని తెలిపారు.

2015లో మాయాపూర్ ఇస్కాన్ మందిరం వరద నీటిలో మునిగిపోయినప్పుడు తీసిన ఫోటోలని ‘Mayapur Iskon Yatra’ వారు తమ ఫేస్ బుక్ పేజీలో షేర్ చేసారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుపుతూ ‘ఇస్కాన్’ సంస్థ వారు ఆర్టికల్ కూడా పబ్లిష్ చేసారు.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మాయాపూర్‌లోని ఇస్కాన్ మందిరం వరద నీటితో నిండిపోయిందని ‘The Economics Times’ న్యూస్ సంస్థ 03 ఆగష్టు 2015 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో మాయాపూర్ ఇస్కాన్ మందిరానికి సంబంధించిన పాత వీడియో అని, తిరుపతి ఇస్కాన్ మందిరం కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, ఇస్కాన్ మాయాపూర్ మందిరానికి సంబంధించిన పాత వీడియోని తిరుపతి ఇస్కాన్ మందిరం వరద నీటిలో మునిగిపోయిన దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll