భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేష్ ఇటీవల అయ్యప్ప స్వామి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు బైరి నరేష్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారని చెప్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.
ఇలాంటి మరిన్ని పోస్టులని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
క్లెయిమ్: అయ్యప్ప స్వామి పైన అనుచిత వ్యాఖ్యలు చేశాక బైరి నరేష్ ను పొగుడుతున్న హరీష్ రావు.
ఫాక్ట్: ఈ వీడియో 20 ఏప్రిల్ 2022న సిద్దిపేట జిల్లాలోని చిన్నగుండవెల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో తీసినది. ఈ కార్యక్రమంలో హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హరీష్ రావు కంటే ముందు మాట్లాడిన నరేష్, తన ప్రసంగంలో మూఢ నమ్మకాల నిర్మూలన, అంబేద్కర్ ఆశయాలు, కుల నిర్మూలన వంటి విషయాల గురించి ప్రస్తావించారు. ఈ ప్రసంగాన్ని హరీష్‌రావు మెచ్చుకున్నారు. అయితే, నరేష్ అయ్యప్ప స్వామి పైన అనుచిత వ్యాఖ్యలు చేసింది 19 డిసెంబర్ 2022న కొడంగల్ మండలం రావులపల్లిలో జరిగిన సభలో. పోలీసులు నరేష్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నారు. పాత వీడియోని ఇప్పుడు జరిగిన సంఘటనకి ముడి పెట్టి షేర్ చేస్తున్నారు కాబట్టి క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ముందుగా ఈ వీడియో గురించి సంబంధిత పదాలతో ఇంటర్నెట్లో వెతకగా, ‘బైరి నరేష్’ యూట్యూబ్ ఛానెల్లో ఇదే వీడియోని 21 ఏప్రిల్ 2022లో అప్లోడు చేసినట్లు గుర్తించాము. “మూఢ నమ్మకాల గూర్చి బైరి నరేష్ ప్రస్తావిస్తే మంత్రి హరీష్ రావు ఏమన్నారో చూడండి” అని టైటిల్ తో ఉన్న ఈ వీడియోలో హరీష్‌రావు నరేష్ ఇచ్చిన ప్రసంగాన్ని మెచ్చుకోవడం చూడవచ్చు.
20 ఏప్రిల్ 2022న సిద్దిపేట జిల్లాలోని చిన్నగుండవెల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హరీష్‌రావు కంటే ముందు మాట్లాడిన నరేష్, తన ప్రసంగంలో మూఢ నమ్మకాల నిర్మూలన, అంబేద్కర్ ఆశయాలు, కుల నిర్మూలన వంటి విషయాల గురించి ప్రస్తావించారు. పూర్తి వీడియోని ఇక్కడ చూడవచ్చు. ఈ ప్రసంగంలో ఎక్కడా కూడా అయ్యప్ప స్వామి లేదా ఇతర దేవుళ్లపైన వ్యాఖ్యలు చేయలేదు. మీడియా కథనాల ప్రకారం, 19 డిసెంబర్ 2022లో కొడంగల్ మండలం రావులపల్లిలో జరిగిన సభలో నరేష్ అయ్యప్పస్వామి పైన అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ సభలో హరీష్‌రావు పాల్గొన లేదు.
పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నరేష్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
చివరిగా, బైరి నరేష్ ని హరీష్ రావు పొగుడుతున్న పాత వీడియోని ఇటీవల జరిగిన సంఘటనకి ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.