Fake News, Telugu
 

బుర్ఖా ధరించిన అమ్మాయిలు డాన్స్ చేస్తున్న ఒక పాత వీడియోని కర్ణాటక హిజాబ్ వివాదానికి ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు

0

కర్ణాటకలో నెలకొన్న హిజాబ్ వివాదానికి సంబంధించి, విద్యాలయాల్లో  హిజాబ్, కాషాయపు కండువాలు మొదలైన మతపరమైన దుస్తులు ధరించరాదని కర్నాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో హిజాబ్ ధరించిన కొందరు అమ్మాయిలు డాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కోర్టు తీర్పుతో విద్యాలయాల్లో ఇక బుర్ఖా వేసుకునే బాధ తప్పిందన్న సంతోషంతో ఇలా చేస్తున్నారంటూ ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఆ వీడియోకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: విద్యాలయాల్లో మతపరమైన దుస్తులు ధరించరాదని కర్నాటక హైకోర్టు తీర్పు చెప్పడంతో, ముస్లిం అమ్మాయిలు సంతోషంలో డాన్స్ చేస్తున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోకి, కర్ణాటకలో నెలకొన్న హిజాబ్ వివాదానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులకు ఎటువంటి సంబంధంలేదు. ఈ వీడియో చాలా సంవత్సరాల నుండే ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది. హిజాబ్ వివాదానికి సంబంధించి హైకోర్టు తిరిగి విచారణ ఈ రోజు ప్రారంభించగా, వాదనల అనంతరం కర్నాటక హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వీడియోకి మరియు ఇటీవల కర్ణాటకలో నెలకొన్న హిజాబ్ వివాదానికి ఎటువంటి సంబంధంలేదు. ఈ వీడియో చాలా సంవత్సరాల నుండే ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది. యూట్యూబ్‌లో కీవర్డ్ సెర్చ్ చేయగా 2017 నుండే  ఈ వీడియో అందుబాటులో ఉన్నట్టు తెలిసింది.

అప్పటి నుండి ఈ వీడియో ఇంటర్నెట్‌లో షేర్ అవుతూనే ఉంది. ఐతే ఈ వీడియో ఎక్కడిదో, ఆ అమ్మాయిలు డాన్స్ చేసిన సందర్భం ఏమిటి అన్న విషయాలకు సంబంధించి మాకు ఎటువంటి కచ్చితమైన సమాచారమైతే లభించలేదు. ఐతే ఈ వీడియో ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమయాన్ని బట్టి ఈ వీడియోకి కర్నాటక హైకోర్టు తీర్పుకి ఎటువంటి సంబంధంలేదని స్పష్టమవుతుంది.

ఇటీవల 10 ఫిబ్రవరి 2022 నాడు విద్యాలయాల్లో  హిజాబ్, కాషాయపు కండువాలు మొదలైన మతపరమైన దుస్తులు ధరించరాదని కర్నాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసుకి సంబంధించి తిరిగి ఈ రోజు (14 ఫిబ్రవరి 2022) విచారణ మొదలుపెట్టారు. ఈ రోజు జరిగిన వాదనల అనంతరం కర్నాటక హైకోర్టు విచారణను రేపటికి (15 ఫిబ్రవరి 2022) వాయిదా వేసింది.

చివరగా, బుర్ఖా ధరించిన అమ్మాయిలు డాన్స్ చేస్తున్న ఒక పాత వీడియోని కర్ణాటక హిజాబ్ వివాదానికి ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll