మణిపూర్ హింస నేపథ్యంలో అక్కడి ప్రజలు ఆగ్రహంతో భారీ ఎత్తున బీజేపీ జెండాలను తగలబెట్టారని చెప్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ప్రజల్లో ఈ ఆగ్రహవేశాలు చూసిన తర్వాతే మోదీ బయటకు వచ్చినట్టు కూడా ఈ వీడియోను షేర్ చేస్తూ చెప్తున్నారు. ఐతే ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: మణిపూర్ హింస నేపథ్యంలో అక్కడి ప్రజలు ఆగ్రహంతో భారీ ఎత్తున బీజేపీ జెండాలను తగలబెడుతున్న వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ వీడియో 2022 జనవరిలో మణిపూర్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ టికెట్ రాని వారు ఇలా పార్టీ జెండాలు, దిష్టిబొమ్మలు తగలబెట్టి నిరసన తెలియజేసిన ఘటనకు సంబంధించింది. ఈ వీడియోకు ప్రస్తుతం మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితులకు ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
బీజేపీ జెండాలను తగలబెడుతున్న ఈ వీడియో మణిపూర్‌కు సంబంధించిందే అయిన ఈ ఘటన ఇటీవల జరిగింది కాదు. కాబట్టి ప్రస్తుతం మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితులకు ఈ వీడియోతో ఎటువంటి సంబంధం లేదు. ఈ వీడియోకు సంబంధించి మరింత సమాచారం కోసం వీడియో స్క్రీన్ షాట్స్‌ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే వీడియోను 2022 జనవరిలో షేర్ చేసిన ఒక ట్వీట్ మాకు కనిపించింది. ‘బీజేపీ మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల జాబితాను ప్రకటించిన తర్వాత బీజేపీలో తిరుగుబాటు’ అంటూ కాంగ్రెస్ సేవదాల్ ఈ వీడియోను షేర్ చేసింది
ఈ ట్వీట్ ఆధారంగా వెతకగా జనవరి 2022లో మణిపూర్ ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఇలాంటి అనేక ఘటనలకు సంబంధించిన వార్తా కథనాలు మాకు కనిపించాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో పేర్లు లేని వారు ఇలా బీజేపీ జెండాలు, దిష్టిబొమ్మలు తగలబెట్టి తమ నిరసన తెలియజేసారు. ఈ ఘటనలకు సంబంధించిన వార్తా కథనాలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.
ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియో ఈ ఘటనకు సంబంధించిందే అయ్యి ఉంటుంది. మీము ఈ వీడియో ఏ ప్రదేశానిదో కచ్చితంగా చెప్పలేనప్పటికీ, ఈ వీడియో ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న టైంను బట్టి దీనికి ప్రస్తుతం మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితులకు ఎటువంటి సంబంధంలేదని స్పష్టమవుతుంది.
చివరగా, 2022 ఎన్నికల్లో టికెట్ రాని వారు బీజేపీ జెండాలు తగలబెట్టిన వీడియోను ప్రస్తుతం మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితులకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.