Fake News, Telugu
 

పాకిస్తాన్‌లో జరిగిన ఊరేగింపుకు సంబంధించిన ఒక పాత వీడియోను బెంగాల్‌లో ముస్లింల ర్యాలీ అంటూ షేర్ చేస్తున్నారు

0

ముహమ్మద్ ప్రవక్తపై బీజేపీ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దేశంలోని వివిధ రాష్ట్రాలలో ముస్లింలు ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోల్‌కతాలో ముస్లింల ర్యాలీ అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: ముహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో కోల్‌కతాలో జరిగిన ముస్లింల ర్యాలీకు సంబంధించిన వీడియో.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియో గత సంవత్సరం జనవరిలో పాకిస్తాన్‌ తెహ్రీక్-ఎ-లబ్బైక్ పార్టీ చీఫ్ ఖాదీమ్ హుస్సేన్ రిజ్వీ మరణాంతరం లాహోర్‌లో జరిగిన ఒక ఊరేగింపు (చెహ్లం) కార్యక్రమానికి సంబంధించింది. అప్పట్లో ఈ కార్యక్రమానికి సంబంధించి వార్తా కథనాలు కూడా ఉన్నాయి. ఐతే ఇటీవల ముహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో బెంగాల్‌లో ముస్లింలు నిరసన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ, వైరల్ అవుతున్న వీడియోతో మాత్రం కోల్‌కతాకు ఎటువంటి సంబంధం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఇది పాకిస్తాన్‌లో జరిగిన ఊరేగింపుకు సంబంధించిన ఒక పాత వీడియో. ఈ వీడియోతో కోల్‌కతాకు ఎటువంటి సంబంధం లేదు.

వీడియో యొక్క స్క్రీన్ షాట్స్‌ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలు కలిగిన ఒక యూట్యూబ్‌ వీడియో మాకు కనిపించింది. ఈ వీడియోను 04 జనవరి 2021న యూట్యూబ్‌లో అప్లోడ్ చేసారు. వీడియో వివరణ ప్రకారం ఈ వీడియో పాకిస్తాన్‌ తెహ్రీక్-ఎ-లబ్బైక్ పార్టీ చీఫ్ ఖాదీమ్ హుస్సేన్ రిజ్వీ మరణాంతరం లాహోర్‌లో జరిగిన ఒక ఊరేగింపు (చెహ్లం) కార్యక్రమానికి సంబంధించింది.

19 నవంబర్ 2020న, తెహ్రీక్-ఎ-లబ్బైక్ పాకిస్తాన్ (TLP) చీఫ్ ఖాదీమ్ హుస్సేన్ రిజ్వీ మరణించారు. సాధారణంగా  షియా ముస్లింలు ఒక వ్యక్తి మరణించిన నలబై రోజుల తరవాత చెహ్లం అనే ఒక మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఖాదీమ్ హుస్సేన్ రిజ్వీ యొక్క చెహ్లం 03 జనవరి 2021న పాకిస్తాన్‌లోని లాహోర్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. వైరల్ అవుతున్న ఈ కార్యక్రమానికి సంబంధించిందే. దీనికి సంబంధించిన వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ఐతే ముహమ్మద్ ప్రవక్త వివాదం నేపథ్యంలో బెంగాల్‌లో ముస్లింలు నిరసన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ (ఇక్కడ మరియు ఇక్కడ), వైరల్ అవుతున్న వీడియో మాత్రం ఆ నిరసనలకు సంబంధించింది కాదు.

చివరగా, పాకిస్తాన్‌లో జరిగిన ఊరేగింపుకు సంబంధించిన ఒక పాత వీడియోను బెంగాల్‌లో ముస్లింల ర్యాలీ అంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll