థాయిలాండ్ ఆరోగ్య మంత్రి ఇంజక్షన్ తీసుకోవడానికి బయపడుతున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. కరోన వాక్సిన్ తీసుకోవడానికి థాయిలాండ్ ఆరోగ్య మంత్రి ఇలా బయపడుతునట్టు మరొక యూసర్ సోషల్ మీడియాలో ఈ వీడియోని పోస్ట్ చేసారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: థాయిలాండ్ ఆరోగ్య మంత్రి కోవిడ్-19 వాక్సిన్ తీసుకోవడానికి బయపడుతున్న దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి థాయిలాండ్ ఆరోగ్యమంత్రి Anutin Charnvirakul కాదు. మొదటిసారిగా ఇంజక్షన్ తీసుకుంటున్న భయంతో ఒక చైనా దేశస్థుడు ఇలా ఏడ్చాడు. ఈ వీడియో 2018 నుంచి ఇంటర్నెట్ లో షేర్ అవుతుంది. ఈ వీడియోకి థాయిలాండ్ ఆరోగ్య మంత్రికి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
థాయిలాండ్ ఆరోగ్యమంత్రి Anutin Charnvirakul ఫోటోలని, వీడియోలో కనిపిస్తున్న వ్యక్తితో పోలిక చేసి చూస్తే, వీడియోలో కనిపిస్తున్నది థాయిలాండ్ ఆరోగ్యమంత్రి Anutin Charnvirakul కాదని స్పష్టమయింది.
పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Radio Jamba Kenya’ యూట్యూబ్ ఛానల్ 29 జనవరి 2018 నాడు పోస్ట్ చేసినట్టు తెలిసింది. చైనా దేశస్థుడు ఇంజక్షన్ తీసుకోవడానికి భయపడుతూ ఏడుస్తున్న దృశ్యాలని వీడియో వివరణలో తెలిపారు. ఈ వివరాల ఆధారంగా మరింత సమాచారం కోసం వెతికితే, ఇదే వీడియోని ‘South China Morning Post’ న్యూస్ ఛానల్ 04 ఫిబ్రవరి 2018 నాడు తమ యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. ‘Chinese man scared of his first ever injection’ అనే టైటిల్ తో ఈ వీడియోని ఆ ఛానల్ యూట్యూబ్ లో పోస్ట్ చేసింది.
అంతేకాదు, ఇదే వీడియోని చాలా మంది సోషల్ మీడియా యూసర్లు 2018లో పోస్ట్ చేసారు. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. వీడియోలో ఏడుస్తున్న వ్యక్తి వివరాలు పూర్తిగా తెలియనప్పటికీ, ఆ వ్యక్తి థాయిలాండ్ ఆరోగ్యమంత్రి అనుతిన్ చరన్విరకుల్ కాదు అని ఈ వివరాల ఆధారంగా ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, చైనా దేశస్థుడు ఇంజక్షన్ తీసుకోవడానికి బయపడుతన్న వీడియోని చూపిస్తూ కోవిడ్ వాక్సిన్ తీసుకోవడానికి బయపడుతున్న థాయిలాండ్ ఆరోగ్య మంత్రి అని షేర్ చేస్తున్నారు.