Fake News, Telugu
 

పాత వీడియోని ఇటీవల చర్లపల్లి జైలులో రాజాసింగ్ భోజనం చేస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

ఇటీవల చర్లపల్లి జైలులో గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ భోజనం చేస్తున్నప్పుడు తీసిన వీడియో, అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతోంది. ముహమ్మద్ ప్రవక్తకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆరోపణ మీద రాజా సింగ్‌ను షాహీనాయత్ గంజ్ పోలీసులు 23 ఆగస్టు 2022 నాడు అరెస్ట్ చేశారు. పోలీసుల అరెస్ట్ విధానం సరిగా లేదని గుర్తిస్తూ నాంపల్లి కోర్టు రాజా సింగ్‌కు అదే రోజు బెయిల్ మంజూరు చేసి విడుదల చేసింది. అయితే, రాజా సింగ్‌పై ఈ ఏడాది ఫిబ్రవరి 19 మరియు  ఏప్రిల్ 12న నమోదైన కేసులలో నోటీసులు జారీ చేసి షాహీనాయత్ మరియు మంగళ్‌హట్ పోలీసులు పీడీ యాక్ట్ కింద రాజా సింగ్‌ను 25 ఆగస్టు 2022 నాడు మళ్ళీ అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో వైరల్ అవుతున్న వీడియోలో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఇటీవల చర్లపల్లి జైలులో రాజా సింగ్ భోజనం చేస్తున్నప్పుడు తీసిన వీడియో.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో కనీసం 2021 ఆగస్టు నెల నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. నాంపల్లి కోర్టు ప్రాంగణంలో రాజా సింగ్ అల్పాహారం సేవిస్తున్న దృశ్యాలని ఈ వీడియోని షేర్ చేస్తూ కొందరు యూసర్లు అప్పుడు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వైరల్  అవుతున్న ఈ వీడియోని చర్లపల్లి జైలు ఆవరణలో తీయలేదని  చర్లపల్లి జైలు అధికారులు ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేసారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.   

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ఒక ఫేస్‌బుక్ యూసర్ ఇటీవల షేర్ చేస్తూ, “ఎమ్మెల్యే శ్రీ రాజా సింగ్ గారు నాంపల్లి కోర్టులో అల్పాహారం చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది”, అని తెలిపారు. ఈ వీడియో పాతదని, కోర్టులో తీసినదని పేర్కొంటూ మరికొందరు కూడా ఇటీవల సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

ఈ వీడియోకి సంబంధించిన మరింత సమాచారం కోసం ఇంటర్నెట్లో వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోలను చాలా మంది ఫేస్‌బుక్ యూసర్లు 2021 ఆగస్టు నెలలో పోస్ట్ చేసినట్టు తెలిసింది. అవి ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన వివిధ కక్ష సాధింపు కేసులలో భాగంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రతి 4 రోజులకు ఒకసారి కోర్టుకు హాజరు కావాల్సి వస్తుందని ఈ పోస్టుల వివరణలో పేర్కొన్నారు.

ఈ వీడియో ఇటీవల చర్లపల్లి జైలులో తీసారని సోషల్ మీడియాలో పుకార్లు రావడంతో, ఈ వీడియోకి సంబంధించి చర్లపల్లి జైలు అధికారులు ఒక ప్రకటన విడుదల చేసారు. ఈ వీడియో చర్లపల్లి జైలు ఆవరణలో తీసినది కాదని, అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య, జైలు నిబంధనల మేరకు రాజా సింగ్‌కు సదుపాయాలు కల్పిస్తున్నట్టు చర్లపల్లి జైలు అధికారులు ఈ ప్రకటనలో తెలిపారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో పాతదని, చర్లపల్లి జైలుకి ఇటీవల రాజా సింగ్‌ను తరలించిన తరువాత తీసిన వీడియో కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, పాత వీడియోని ఇటీవల చర్లపల్లి జైలులో రాజాసింగ్ భోజనం చేస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll