Fake News, Telugu
 

ఆంధ్రప్రదేశ్‌లో వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వానికి రోజుకు రూ. 1000 చెల్లించాలన్న నిబంధన ఎక్కడా లేదు

0

వినాయక చవితి పండుగ సందర్భంగా, మండపాలలో వినాయకుడి  విగ్రహo పెడితే  రోజుకు రూ. 1000 ప్రభుత్వానికి కట్టాలి అంటూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ ఫోటో ఉన్న  పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం. 

క్లెయిమ్: వినాయక చవితికి మండపాలలో వినాయకుడి విగ్రహం పెడితే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి రోజుకి రూ. 1000 కట్టాలి. 

ఫాక్ట్ (నిజం):  వినాయక మండపం అనుమతికి పోలీసువారు విడుదల చేసిన నియమావళిలో ఎక్కడా కూడా విగ్రహం ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వానికి డబ్బు చెల్లించాలన్న నిబంధన లేదు. కావున, ఈ పోస్టులో చెప్పబడిన సమాచారం తప్పు.

ముందుగా వినాయక చవితికి ఏర్పాటు చేసే మండపాలకు ఎటువంటి అనుమతులు తీసుకోవాలో ఇంటర్నెట్లో వెతకగా, పలు వార్తా కథనాలు దొరికాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు.

ఈ కథనాల ప్రకారం విజయవాడ నగరంలో వినాయక చవితి సందర్భంగా పందిళ్ళు/ మండపాలు ఏర్పాటు చేసుకునే ఉత్సవ నిర్వాహకులు ముందస్తు  పోలీసు, మున్సిపల్, పంచాయితీ, అగ్నిమాపక మరియు విద్యుత్ శాఖ వారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆలాగే, ఉత్సవ వివరాలు,  విగ్రహానికి సంబంధించిన బరువు, ఎత్తు వివరాలు, మరియు నిమర్జనానికి సంబంధించిన వివరాలను కూడా  పోలీసులకి ముందుగానే తెలియచేయాల్సి ఉంటుంది. ఉత్సవాల్లో ఎటువంటి ఘటనలు జరుగకుండా నిర్వాహకులే అన్నీ జాగ్రత్తలు తీస్కోవాలి.

ఈ నియమాలలో ఎక్కడా కూడా విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి  రు.1000 చెల్లించాలని లేదు. మరియు “వినాయకుడి బొమ్మ పర్మిషన్ కొరకు సూచనలు” అనే హెడ్డింగ్ తో నోటరీ చేయవలెను అని చెప్తూ ఒక డాక్యుమెంట్ సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది. ఇది పూర్తిగా అవాస్తవం అని విజయవాడ పోలీసులు హెచ్చరించారు. ఆ పోస్టుని ఇక్కడ చూడవచ్చు.

అలాగే విశాఖపట్నం పోలీసులు కూడా వినాయక మండపం అనుమతికి సంబంధించిన నియమాలను విడుదల చేశారు. ఇందులో కూడా ఎక్కడా విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వానికి డబ్బు చెల్లించాలన్న నిబంధన లేదు.

మండపాలలో వినాయకుడి విగ్రహం పట్టడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం డబ్బులు వసూలు చేస్తుంది అని సోషల్ మీడియాలో వైరల్ అవడంతో, ఎండోమెంట్స్‌ కమిషనర్ స్పష్టత ఇస్తూ ప్రభుత్వం అలాంటి చార్జీలు వసూలు చేయట్లేదని తెలిపారు. అలాగే సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకుంటామని కూడా పేర్కొన్నారు.

చివరిగా, ఆంధ్రప్రదేశ్‌లో వినాయక విగ్రహం ఏర్పాటు చేస్తే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి రోజుకి రూ. 1000 చెల్లించాలి అనే నిబంధన ఎక్కడా లేదు. 

Share.

About Author

Comments are closed.

scroll