Fake News, Telugu
 

రాజస్థాన్‌కి సంబంధించిన పాత వీడియోని బెంగళూరులోని ముస్లింలు హిందువుల వస్తువులను కొనకూడదని చెప్తున్నట్టు షేర్ చేస్తున్నారు

0

బెంగళూరులోని ముస్లింలు ఇటీవల జరుపుకున్న ఒక సమావేశంలో హిందువుల దగ్గర ఎటువంటి వస్తువులు కొనకూడదని, వచ్చే అయిదు సంవత్సరాలు రాష్ట్రంలో అధికారం తమదేనని, హిందువుల పెట్రోల్ పంపులలో పెట్రోల్ గానీ, హిందువుల మెడికల్ షాపులలో మందులు గానీ కొనకూడదని చెప్పుకుంటున్న దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: బెంగళూరులోని ముస్లింలు ఇటీవల జరుపుకున్న ఒక సమావేశంలో హిందువుల దగ్గర ఎటువంటి వస్తువులు కొనకూడదని చెప్పుకుంటున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో, 2019లో రాజాస్థాన్ రాష్ట్రం బార్మేర్ జిల్లా బేజారియా గ్రామంలో జరిగిన ఒక సమావేశంలోని దృశ్యాలను చూపిస్తుంది. 2019 జూన్ నెలలో గగారియా గ్రామంలోని పెట్రోల్ పంప్ ఎదుట జరిగిన ఒక బస్సు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా, ముగ్గురికీ తీవ్ర గాయాలపాలయ్యారు. చనిపోయిన వ్యక్తి అంత్యక్రియల సమయంలో బంధువులు అతని మరణాన్ని నిరసిస్తూ ఈ ప్రసంగం చేశారు. ఈ వీడియో కర్ణాటక రాష్ట్ర బెంగళూరుకు సంబంధించినది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.  

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని పలు సోషల్ మీడియా యూసర్లు 2019 నుండి షేర్ చేస్తున్నట్టు తెలిసింది. బార్మేర్ జిల్లా గగారియా గ్రామంలో జరిగిన ముస్లిం సమావేశంలోని దృశ్యాలంటూ ఈ వీడియోని షేర్ చేస్తూ పలు యూసర్లు తెలిపారు.

ఇదే వీడియోని ఈ సంవత్సరం మార్చి నెలలో ఒకే యూసర్ ట్వీట్ చేసినప్పుడు, బార్మేర్ పోలీస్ వారు ఈ వీడియోకి సంబంధించి స్పష్టతనిస్తూ ట్వీట్లు పెట్టారు. ఈ వీడియో 2019లో రాజాస్థాన్ రాష్ట్రం బార్మేర్ జిల్లాలోని బేజారియా గ్రామంలో జరిగిన ఒక సమావేశంలోని దృశ్యాలని చూపిస్తున్నాయని బార్మేర్ పోలీసు వారు తమ ట్వీట్లో తెలిపారు. 2019 జూన్ నెలలో గగారియా గ్రామంలోని పెట్రోల్ పంప్ ఎదుట జరిగిన ఒక బస్సు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా, ముగ్గురికీ తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే, చనిపోయిన వ్యక్తి అంత్యక్రియల సమయంలో బంధువులు అతని మరణాన్ని నిరసిస్తూ ఈ ప్రసంగం చేశారని, ఆ సమయంలో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నామని బార్మేర్ పోలీసులు తమ ట్వీట్లలో తెలిపారు. పై వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో పాతదని, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన పాత వీడియోని బెంగళూరులోని ముస్లింలు ఇటీవల ఒక సమావేశంలో హిందువుల వస్తువులను కొనకూడదని చెప్పుకుంటున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll