Fake News, Telugu
 

బంగ్లాదేశ్‌లో ముస్లింల దాడిలో మరణించిన హిందువుల దృశ్యాలంటూ జూలై 2024లో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన హత్రాస్ తొక్కిసలాటకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తున్నారు

0

బంగ్లాదేశ్‌లోని హిందువులు మరియు ఇతర మైనారిటీలపై, వారి మత స్థలాలపై దాడులు జరుగుతున్నట్లు పలు రిపోర్ట్స్ పేర్కొన్నాయి (ఇక్కడఇక్కడ). ఈ నేపథ్యంలోనే, “బంగ్లాదేశ్‌లో ముస్లింల దాడిలో మరణించిన హిందువులు చూపిస్తున్న దృశ్యాలు”  అని పేర్కొంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) .  ఈ కథనం ద్వారా ఈ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
(గమనిక: ఈ వీడియోలో కలవరపరిచే దృశ్యాలు ఉన్నాయి)

క్లెయిమ్: బంగ్లాదేశ్‌లో ముస్లింల దాడిలో మరణించిన హిందువులను చూపిస్తున్న వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో బంగ్లాదేశ్‌కి చెందినది కాదు. ఈ వీడియోలోని దృశ్యాలు జూలై 2024లో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన హత్రాస్ తొక్కిసలాట ఘటనకు సంబంధించినవి. ఈ వీడియో 02 జూలై 2024న  ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో ‘భోలే బాబా’ సత్సంగ్ (మతపరమైన సమావేశం)లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో మరణించిన/గాయపడిన వారిని సికంద్రరావు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తరువాత ఆసుపత్రి వద్ద నెల్కొన్న పరిస్థులను చూపిస్తుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన వివరాల కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వైరల్ వీడియోను జూలై 2024న పలువురు (ఇక్కడ, ఇక్కడ) సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు గుర్తించాము. ఇదే వీడియోను యూట్యూబ్‌లో (ఆర్కైవ్డ్ లింక్) షేర్ చేస్తూ, ఈ వీడియోలోని దృశ్యాలు ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో జరిగిన ‘భోలే బాబా’ యొక్క సత్సంగ్‌(మతపరమైన సమావేశం)లో చోటుచేసుకున్న తొక్కిసలాట తర్వాత నెలకొన్న పరిస్థితులను చూపిస్తుందని, ఈ ఘటన హత్రాస్ జిల్లాకు 47 కిలోమీటర్ల దూరంలోని ఫుల్రాయ్ గ్రామంలో చోటుచేసుకుంది అని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే, వైరల్ వీడియోలోని దృశ్యాలనే కలిగి ఉన్న పలు వార్తాకథనాలు కూడా మాకు లభించాయి (ఇక్కడఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, ‘భోలే బాబా’ అలియాస్ ‘నారాయణ్ సకర్ హరి’ అని కూడా పిలువబడే బోధకుడు సూరజ్ పాల్ సింగ్ నిర్వహించిన సత్సంగ్‌(మతపరమైన సమావేశం)లో జరిగిన తొక్కిసలాటలో మరణించిన లేదా గాయపడిన వారిని సికంద్రరావు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తరువాత ఆసుపత్రి వద్ద నెల్కొన్న పరిస్థులను ఈ దృశ్యాలు చూపిస్తున్నాయి. ఈ ఘటన 02 జూలై 2024న ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాకు చెందిన  ఫుల్రాయ్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో కనీసం 120 మంది మరణించారు, వీరిలో ఎక్కువ మంది మహిళలు మరియు పిల్లలు.

ఈ ఘటనను రిపోర్ట్ చేస్తూ పలు మీడియా సంస్థలు ప్రచురించిన కథనాల్లో కనిపిస్తున్న ఆసుపత్రిని, మేము గూగుల్ స్ట్రీట్ వ్యూలో జియో లొకేట్ చేశాము. ఆ రెండింటినీ పోల్చి చూస్తే, ఈ వైరల్ వీడియో ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలోని సికంద్రరావు ఆసుపత్రి వద్ద చిత్రీకరించినట్లు మనం నిర్ధారించవచ్చు.

మీడియా రిపోర్ట్స్ ప్రకారం (ఇక్కడ & ఇక్కడ), ఈ ఘటనకు సంబంధించి భారతీయ న్యాయ సంహిత (BNS)లోని వివిధ సెక్షన్ల కింద 02 జూలై 2024న ప్రథమ సమాచార నివేదిక (FIR) దాఖలు చేయబడింది,. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పోలీసులు 11 మందిపై అభియోగాలు మోపుతూ 3,200 పేజీల చార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించారు. అయితే చార్జిషీట్‌లో సూరజ్‌పాల్ సింగ్‌ను అలియాస్  ‘భోలే బాబా’ నిందితుడిగా పేర్కొనలేదు.

చివరగా, ఈ వైరల్ వీడియో బంగ్లాదేశ్‌కి చెందినది కాదు. ఈ వీడియోలోని దృశ్యాలు జూలై 2024లో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన హత్రాస్ తొక్కిసలాట సంబంధించినవి.

Share.

About Author

Comments are closed.

scroll