Fake News, Telugu
 

రిజర్వేషన్ల వల్ల ఉపయోగం లేదు అని చంద్రబాబు నాయుడు అన్నట్టు ఉన్న ఈ వీడియో డిజిటల్‌గా ఎడిట్ చేసింది

0

టీడీపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల రిజర్వేషన్లు రద్దు చేసే కుట్ర జరుగుతుంది అంటూ చంద్రబాబు నాయుడు వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ ఉంది. ‘ఏడు దశాబ్దాలుగా రిజర్వేషన్లు అందించినా ఎం లాభం జరిగింది? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల జీవితాలు మారాయా?’ అని చంద్రబాబు నాయుడు అనడం ఈ వీడియోలో చూడొచ్చు (ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఇన్నేళ్లుగా రిజర్వేషన్లు ఇచ్చి సాధించింది ఏంటి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రిజర్వేషన్ల వల్ల ఉపయోగం లేదు – చంద్రబాబు నాయుడు

ఫాక్ట్(నిజం): ఈ వీడియో డిజిటల్‌గా ఎడిట్ చేసింది. రిజర్వేషన్లు తప్పనిసరిగా ఉండాలి, వాటిని విస్మరించలేము. కానీ రిజర్వేషన్లకు మించి ఏదైనా చేయాలి, అప్పుడే సాధికారత సాధించవచ్చు’ అని చంద్రబాబు అన్న వీడియోను ఎడిట్ చేసి అయన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు చిత్రీకరించారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ANIతో వివిధ అంశాల గురించి మాట్లాడాడు. ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియో క్లిప్ ఈ ఇంటర్వ్యూ నుండి సేకరించిందే. ఐతే ఈ ఇంటర్వ్యూలో రిజర్వేషన్లు రద్దు చేస్తామని చంద్రబాబు నాయుడు అనలేదు.

రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ ‘ఏడు దశాబ్దాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు రిజర్వేషన్లు అందిస్తూ వచ్చాము, వాళ్ళ జీవితాలు ఎమన్నా మారాయా? అందుకే రిజర్వేషన్లకు మించి చేయాల్సి ఉంది. రిజర్వేషన్లు తప్పనిసరిగా ఉండాలి, వాటిని విస్మరించలేము, కానీ జర్వేషన్ లు ఒక్కటే పరిష్కారం కాదు, అంతకు మించి ఏదైనా చేయాలి, అప్పుడే సాధికారత సాధించవచ్చు’ అని చంద్రబాబు వ్యాఖ్యానించాడు.

ఐతే ఈ ఇంటర్వ్యూలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను డిజిటల్‌గా ఎడిట్ చేసి చంద్రబాబు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు చిత్రీకరించారు. ఐతే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో చంద్రబాబు నాయుడు కూడా ఈ వీడియో ఫేక్ అని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. తాను రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలను షేర్ చేసాడు. 

చివరగా, రిజర్వేషన్ల వల్ల ఉపయోగం లేదు అని చంద్రబాబు నాయుడు అన్నట్టు ఉన్న ఈ వీడియో డిజిటల్‌గా ఎడిట్ చేసింది.

Share.

About Author

Comments are closed.

scroll