Fake News, Telugu
 

గుజరాత్ కి సంబంధించిన పాత వీడియోని హైదరాబాద్ హాఫిజ్ పేట్ లో ముస్లింలు పోలీసుని కొడుతున్న దృశ్యాలని షేర్ చేస్తున్నారు

0

హైదరాబాద్ కొండాపూర్ సమీపంలోని హాఫిజ్ పేట్ లో ముస్లింలు పోలీసుని కొడుతున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. ఈ ఘటన 28 మే 2021 నాడు రాత్రి  చోటుచేసుకున్నట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: హైదరాబాద్ హాఫిజ్ పేట్ లో ముస్లింలు పోలీసులని కొడుతున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): వీడియోలోని ఘటన 2020లో గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో జరిగింది. అహ్మదాబాద్ నగరంలోని సోలా పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సునీల్ సింగ్ చౌహాన్, తాగిన మత్తులో ఒక వ్యక్తిని దుషిస్తూ చెంప మీద కొట్టడంతో, స్థానిక ప్రజలు ఆగ్రహంతో అతనిపై ఈ దాడి చేసారు. ఈ వీడియో హైదరాబాద్ కి సంబంధించింది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Zee 24 Kalak’ న్యూస్ ఛానల్ 21 అక్టోబర్ 2020 నాడు తమ యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో చోటుచేసుకున్నట్టు ఈ వీడియోలో తెలిపారు. అహ్మదాబాద్ నగరంలోని సోలా పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సునీల్ సింగ్ చౌహాన్ పై ఈ దాడి జరిగినట్టు వీడియోలో తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలని రిపోర్ట్ చేస్తూ ‘The Times of India’ 22 అక్టోబర్ 2020 నాడు ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది. సోలా పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సునీల్ సింగ్ చౌహాన్, తాగిన మత్తులో ఒక వ్యక్తిని దుషిస్తూ చెంప మీద కొట్టడంతో, స్థానిక ప్రజలు ఆగ్రహంతో అతని పై ఈ దాడి చేసినట్టు ఈ ఆర్టికల్ లో రిపోర్ట్ చేసారు. ఇదే విషయాన్నీ రిపోర్ట్ చేస్తూ ‘News18 Gujarati’ న్యూస్ వెబ్సైటు కూడా ఆర్టికల్ పబ్లిష్ చేసింది. సునీల్ సింగ్ చౌహాన్ పై దాడి చేసిన వ్యక్తులు ముస్లింలని ఎక్కడా రిపోర్ట్ చేయలేదు.

గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన ఈ వీడియోని హైదరాబాద్ హాఫిజ్ పేట్ కు ముడిపెడుతూ కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తుండడంతో, వీడియోలోని ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకోలేదని స్పష్టం చేస్తూ మాదాపూర్ పోలీసులు ట్వీట్ పెట్టారు. సైబరాబాద్ పోలీసు వారు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో హైదరాబాద్ కు సంబంధించింది కాదని ట్వీట్ పెట్టారు. ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్న వారి పై చట్ట పరమయిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో హైదరాబాద్ కు సంబంధించింది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన పాత వీడియోని షేర్ చేస్తూ హైదరాబాద్ హాఫిజ్ పేట్ లో ముస్లింలు పోలీసులని కొడుతున్న దృశ్యాలంటున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll