Fake News, Telugu
 

మహారాష్ట్ర కు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులన్స్ డ్రైవర్ ని పోలీసులు కొడుతున్న దృశ్యాలంటున్నారు

0

అంబులన్స్ గిరాకి కోసం ఒక డ్రైవర్ నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులకి ఆక్సిజన్ సరఫరా నిలిపివేసాడని సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. తన అంబులన్స్ గిరాకి కోసం కరోనా రోగుల ప్రాణాలని పణంగా పెట్టినందుకు పోలీసులు ఆ డ్రైవర్ ని చితకబాదుతున్నట్టు ఈ  పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులకి ఆక్సిజన్ సరఫరా నిలిపివేసిన అంబులన్స్ డ్రైవర్ ని పోలీసులు కొడుతున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): వీడియోలోని ఘటన మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో చోటుచేసుకుంది. జల్నా నగరంలోని ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించిన ఒక యువకుడి కుటుంబం, కొందరు బీజేపీ కార్యకర్తలతో కలిసి ఆ హాస్పిటల్ సిబ్బంది పై దాడి చేసారు. ఈ ఘటన 09 ఏప్రిల్ 2021 నాడు చోటుచేసుకుంది. ఈ దాడిలో ముఖ్యపాత్ర పోషించిన బీజేపీ కార్యకర్త శివరాజ్ నరియాల్వాలేని పోలీసులు పట్టుకొని ఇలా లాఠీలతో చితకబాదినట్టు తెలిసింది. ఈ వీడియో తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు సంబంధించింది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియో ‘Times Now Marathi’ న్యూస్ వెబ్సైటు 27 మే 2021 నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్ లో దొరికింది. మహారాష్ట్ర లోని జల్నా జిల్లాకు సంబంధించిన ఒక బీజేపీ కార్యకర్తని పోలీసులు చితకబాదుతున్న దృశ్యాలని ఈ ఆర్టికల్ లో తెలిపారు. శివరాజ్ నరియాల్వాలే అనే బీజేపీ కార్యకర్త, జల్నా నగరంలోని ఒక ప్రైవేటు హాస్పిటల్ పై దాడి చేసాడనే కారణంతో పోలీసులు అతన్ని లాఠీలతో కొట్టినట్టు ఈ ఆర్టికల్ లో రిపోర్ట్ చేసారు. ఇదే  విషయాన్నీ రిపోర్ట్ చేస్తూ ‘News18Lokmat’ న్యూస్ వెబ్సైటు, ఈ వీడియోని తమ ట్వీట్ లో షేర్ చేసింది.  

జల్నా నగరంలోని ఒక ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఒక యువకుడు 09 ఏప్రిల్ 2021 నాడు మరణించాడు. దీనితో, ఆ యువకుడి కుటుంబ సభ్యులు, కొందరు బీజేపీ కార్యకర్తలతో కలిసి ఆ ప్రైవేటు హాస్పిటల్ సిబ్బంది పై దాడి చేసారు. ఈ దాడిలో ముఖ్యపాత్ర పోషించిన బీజేపీ కార్యకర్త శివరాజ్ నరియాల్వాలే ని పోలీసులు పట్టుకొని ఇలా లాఠీలతో చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించి జల్నా పోలీసులు ఇచ్చిన వివరాలని ‘ANI’ న్యూస్ వెబ్సైటు 28 మే 2021 నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్ లో రిపోర్ట్ చేసింది.  

ఈ ఘటనకి సంబంధించి పబ్లిష్ అయిన మరికొన్ని న్యూస్ ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

ఇదిలా ఉంటే, తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాకి చెందిన కొందరు అంబులన్స్ డ్రైవర్లు, డబ్బులకు ఆశ పడి కరోనా రోగులకి ఆక్సిజన్ సప్లై ఆపేసినట్లు ‘News18’ న్యూస్ వెబ్సైటు 24 మే 2021 నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్ లో రిపోర్ట్ చేసింది. కానీ, పోస్టులో షేర్ చేసిన వీడియో తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాకు సంబంధించింది కాదు.

చివరగా, మహారాష్ట్ర కు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా రోగులకు ఆక్సిజన్ నిలిపివేసిన అంబులన్స్ డ్రైవర్ ని పోలీసులు కొడుతున్న దృశ్యాలంటున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll