Fake News, Telugu
 

ఈ వీడియోలో పోలీసులు కొడుతున్నది సమాజ్ వాదీ పార్టీ మాజీ మంత్రి కమాల్ అక్తర్‌ను కాదు

0

ఉత్తరప్రదేశ్‌లో సమాజ్ వాదీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారం చలాయించిన మాజీ మంత్రి కమాల్ అక్తర్‌ను యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలీసులు చితకబాదారు అంటూ పోలీసులు ఒక వ్యక్తిని లాఠీలతో కొడుతున్న వీడియోని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. వీడియో మొదట్లో కమాల్ అక్తర్‌ రాష్ట్రంలో తన పలుకుబడి గురించి గొప్పగా చెప్పుకోవడం చూడొచ్చు. ఈ కథనం ద్వారా పోస్టులో చేస్తున్న క్లెయిమ్ సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: సమాజ్ వాదీ పార్టీకి చెందిన మాజీ మంత్రి కమాల్ అక్తర్‌ను యోగి ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలీసులు కొట్టిన వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియోలో పోలీసులు కొడుతున్నది సమాజ్ వాదీ పార్టీకి చెందిన రాజా చతుర్వేదిని, కమాల్ అక్తర్‌ కాదు. పైగా ఈ ఘటన 2011లో బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జరిగింది. ఈ వీడియోకి యోగికి లేదా బీజేపీ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధంలేదు. ఇక వీడియోలో చూపిస్తున్నట్టు కమాల్ అక్తర్‌ ఆ వ్యాఖ్యలు చేసింది నిజమైనా, పోలీసులు కమాల్ అక్తర్‌ను కొట్టినట్టు ఎటువంటి రిపోర్ట్స్ లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులోని వీడియోలో పోలీసులు ఒక వ్యక్తిని లాఠీలతో కొడుతున్న దృశ్యాల విషయానికి వస్తే, యూట్యూబ్‌లో కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు ఈ వీడియో 2011 నుండే యూట్యూబ్‌లో అందుబాటులో ఉందని తెలిసింది. యూట్యూబ్‌లో ఈ వీడియోకి సంబంధించిన టైటిల్ ప్రకారం వీడియోలో పోలీసులు కొడుతున్నది సమాజ్ వాదీ పార్టీకి చెందిన మరొక నేత రాజా చతుర్వేదిని.

యూట్యూబ్‌ వీడియో ఆధారంగా గూగుల్‌లో వెతకగా ఫిబ్రవరి 2011లో పోలీసులు రాజా చతుర్వేదిని కొట్టిన ఘటనకు సంబంధించిన వార్తా కథనం మాకు అభించింది. ఈ కథనం ప్రకారం రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో నిరసన తెలుపుతున్న సందర్భంలో పోలీసులు  రాజా చతుర్వేదిని కొట్టారు. దీన్నిబట్టి, పోస్టులో షేర్ చేసిన వీడియోలో పోలీసులు కొడుతున్నది రాజా చతుర్వేదిని అని, కమాల్ అక్తర్‌ కాదని స్పష్టమవుతుంది. పైగా ఈ ఘటన 2011లో బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. ఈ దృశ్యాలకి యోగి ఆదిత్యనాథ్ కి ఎటువంటి సంబంధంలేదు.

పోస్టులోని వీడియో స్క్రీన్‌షాట్‌తో కమాల్ అక్తర్, రాజా చతుర్వేదిల ఫోటోలను పోల్చి చూసినప్పుడు, వైరల్ వీడియోలో పోలీసులు కొడుతుంది రాజా చతుర్వేది అని, కమాల్ అక్తర్‌ కాదని స్పష్టంగా తెలుస్తుంది.

పోస్టులోని వీడియో మొదట్లో రాష్ట్రంలో తన పలుకుబడి గురించి చెప్పుకుంటున్న వ్యాఖ్యలు కమాల్ అక్తర్‌ ఈ ఏడాది ఏప్రిల్‌లో చేసాడు. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో జరిగిన ఒక మీటింగ్‌లో కమాల్ అక్తర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసాడు. మీడియా ఈ వ్యాఖ్యలను రిపోర్ట్ చేసిన కథనాలు ఇక్కడ చూడొచ్చు. కమల్ అక్తర్‌ ఆ వ్యాఖ్యలు చేసింది నిజమైనా, పోలీసులు కమాల్ అక్తర్‌ను కొట్టినట్టు ఎటువంటి రిపోర్ట్స్ లేవు.

చివరగా, సంబంధంలేని పాత వీడియోని సమాజ్ వాదీ పార్టీకి చెందిన మాజీ మంత్రి కమాల్ అక్తర్‌ను పోలీసులు కొట్టినట్టు షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll